మాజీ మంత్రికి రేవంత్ కొత్త ఫిటింగ్‌.. అది జ‌రిగేనా..?

Update: 2022-07-16 00:30 GMT
వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా అధికారంలోకి రావాల‌ని భావిస్తున్న తెలంగాణ కాంగ్రెస్ అందుకు త‌గ్గ‌ట్లే ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంది. ఏడాదికి పైగా స‌మ‌యం ఉన్నా ఇప్ప‌టి నుంచే ఒక్కో నియోజ‌క‌వ‌ర్గంలో బ‌ల‌మైన నేత‌ల‌ను త‌యారు చేసుకుంటోంది. ప్ర‌భావం చూప‌లేని స్థానాల్లో ఇత‌ర పార్టీల నుంచి చేరిక‌ల‌ను ప్రోత్స‌హిస్తోంది. దీనికి రేవంత్ దూకుడు కూడా తోడ‌వ‌డంతో పార్టీలోకి చేరిక‌లు వెల్లువ‌లా వ‌స్తున్నాయి. కొంద‌రు ముఖ్య నాయ‌కుల‌కు టీపీసీసీ గాలం వేస్తున్న‌ట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా మాజీ మంత్రి, తాండూరు మాజీ ఎమ్మెల్యే ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డిపై రేవంత్ గురిపెట్టారు. పార్టీలో చేరిక‌పై ఆయ‌న‌తో సంప్ర‌దింపులు జ‌రుగుతున్న‌ట్లు స‌మాచారం. టీడీపీలో ఉన్న‌ప్పుడు రేవంతుకు మ‌హేంద‌ర్ రెడ్డి స‌న్నిహితుడు కావ‌డం కూడా క‌లిసొచ్చే అంశ‌మ‌ని చ‌ర్చ జ‌రుగుతోంది. అయితే.. కాంగ్రెస్ లో చేరేందుకు ప‌ట్నం కొన్ని డిమాండ్లు ముందు పెట్టిన‌ట్లు స‌మాచారం. వాటికి టీపీసీసీ సానుకూలంగా ఉన్నా రేవంత్ ఫిటింగుతో ప‌రిస్థితి మ‌ళ్లీ మొద‌టికొచ్చిన‌ట్లు తెలుస్తోంది.

తెలుగుదేశం పార్టీలో ఉన్న‌ప్పుడు తాండూరును త‌న కంచుకోట‌గా మార్చుకున్న మ‌హేంద‌ర్ రెడ్డి అక్క‌డి నుంచి నాలుగు సార్లు గెలుపొంది మంత్రి ప‌ద‌వి కూడా చేప‌ట్టారు. 1994 నుంచి మొన్న‌టి 2018 ఎన్నిక‌ల వ‌ర‌కు మ‌ధ్య‌లో ఒక్క‌సారి మిన‌హాయిస్తే ఆయ‌న వ‌రుస‌గా విజ‌య‌దుందుభి మోగించారు. 2004లో వైఎస్ హ‌వాలో ఒక‌సారి.. క్రితం ఎన్నిక‌ల్లో మ‌రోసారి మాత్ర‌మే ఓట‌మి పాల‌య్యారు.

అయితే.. క్రితం ఎన్నిక‌ల్లో తాండూరు నుంచి కాంగ్రెస్ త‌ర‌పున గెలిచిన పైలెట్ రోహిత్ రెడ్డి టీఆర్ఎస్ లో చేర‌డంతో మ‌హేందర్ రెడ్డికి క‌ష్టాలు మొద‌ల‌య్యాయి. గ్రూపు రాజ‌కీయాల‌తో వేర్వేరుగా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ నాదంటే నాద‌ని బ‌హిరంగంగానే వాదులాడుకుంటున్నారు. ఇటీవ‌ల జ‌రిగిన కొన్ని సంఘ‌ట‌న‌ల‌తో మంత్రి కేటీఆర్ ప‌ట్నంపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్లు స‌మాచారం. అప్ప‌టి నుంచీ ఆయ‌న మ‌న‌స్తాపం చెంది పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటున్నారట‌.

ఈ విష‌యాన్ని గ‌మ‌నించిన రేవంత్ రెడ్డి ఆయ‌న‌తో చ‌ర్చ‌ల‌కు తెర‌దీశారు. ఆయ‌న‌కు, ఆయన స‌తీమ‌ణికి టికెట్లు.. పార్టీలో ప్ర‌యారిటీ వంటి అంశాల‌పై రేవంత్ సుముఖంగానే ఉన్నార‌ట‌. అయితే ఎటొచ్చీ ఆయన సోద‌రుడు కొడంగ‌ల్ ఎమ్మెల్యే న‌రేంద‌ర్ రెడ్డి అంశంపైనే తెగ‌డం లేద‌ట‌. త‌న సోద‌రుడిని కూడా పార్టీలోకి తీసుకొస్తాన‌ని తిరిగి కొడంగ‌ల్ టికెట్ ఇవ్వాల‌ని మ‌హేంద‌ర్ రెడ్డి ప్ర‌తిపాద‌న పెట్టార‌ట‌.

ఈ అంశంపైనే రేవంత్ విముఖంగా ఉన్న‌ట్లు చ‌ర్చ జ‌రుగుతోంది. క్రితం ఎన్నిక‌ల్లో త‌న‌పై పోటీ చేసి 9 వేల మెజారిటీతో ఓడించిన న‌రేంద‌ర్ రెడ్డికి అవ‌కాశం ఇవ్వ‌లేన‌ని స్ప‌ష్టం చేసిన‌ట్లు స‌మాచారం. ఒక‌వేళ ఆయ‌న కాంగ్రెస్ లో చేరినా వ‌చ్చే ఎన్నిక‌ల్లో కొడంగ‌ల్ నుంచి త‌ప్పుకొని త‌న గెలుపున‌కు స‌హ‌క‌రించాల్సిందిగా రేవంత్ కోరార‌ట‌. దీనికి మ‌హేంద‌ర్ రెడ్డి ఒప్పుకోక‌పోవ‌డంతో పార్టీలో చేరిక వాయిదా ప‌డుతున్న‌ట్లుగా తెలుస్తోంది. చూడాలి మ‌రి ఇక‌పై ఏం జ‌రుగుతుందో..!
Tags:    

Similar News