కంగ్రాట్స్ ... బట్ వియ్ ఆర్ అన్‌ హేపీ!

Update: 2017-12-20 05:06 GMT
పైకి అభినందనలు చెబుతూనే ఉన్నారు.. కానీ మొహం మీదనే మేం ఏమాత్రం సంతృప్తి కరంగా లేం అని కూడా చెప్పేస్తున్నారు. రెండు రాష్ట్రాల్లోనూ భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన ప్రధాని నరేంద్రమోడీకి... ఒక వర్గం నుంచి మాత్రం ఎదురవుతున్న ప్రతిస్పందన ఇది. సాధారణంగా మోడీ ప్రభంజనానికి చిహ్నంగా రెండు రాష్ట్రాల్లో విజయం సాధించిన తర్వాత.. కమలదళానికి అభినందనలు వెల్లువెత్తాయి. అంతో ఇంతో మోడీ పట్ల కినుక వహించి ఉన్న సొంత పార్టీ నాయకులు - మిత్రపక్షాల నాయకులు అందరూ కూడా.. తమ వైఖరిని సమీక్షించుకుని పైకి చిరునవ్వులు పులుముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే.. బహిరంగంగా పైకి అభినందనలు చెబుతూనే.. ‘వియ్ ఆర్ అన్‌ హేపీ’ అని చెప్పగల తెగువ ఎవరికి ఉంటుంది? మీరు ఏమైనా ఊహించగలరా?

అలా చెబుతున్నది మరెవ్వరో కాదు.. భారతీయ జనతా పార్టీకి బిగ్ బాస్ లాగా వ్యవహరించే ఆరెస్సెస్!! ఈ ఎన్నికల ఫలితాల తర్వాత.. ఆరెస్సెస్ అగ్ర నాయకులు మాత్రం ఒకింత అసంతృప్తితో ఉన్నట్లుగా పార్టీలోని అభిజ్ఞవర్గాల ద్వారా తెలుస్తోంది. నరేంద్రమోడీ తన మూలాల్లో ఆరెస్సెస్ భావజాలం పుష్కలంగా కలిగి ఉన్న రాజకీయ నాయకుడు. ఆయన ప్రధాని అభ్యర్థి కావడం అనేది కూడా ఆరెస్సెస్ స్కెచ్ ప్రకారమే జరిగిందనే వాదన కూడా ఉంది. దానికి తగ్గట్లుగానే ఆయన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నాటినుంచి.. చాలా విషయాల్లో ఆరెస్సెస్ మార్గదర్శనాన్ని స్వీకరిస్తూనే ఉన్నారు. ప్రధాని పదవిలో మోడీ ఉన్నప్పటికీ.. స్టీరింగ్ మాత్రం ఆరెస్సెస్ చేతిలో ఉన్నదంటూ విపక్ష కాంగ్రెస్ ఎన్ని సందర్భాల్లో విమర్శించినప్పటికీ.. ఆయన ఖాతరు చేయలేదు. ఆరెస్సెస్ నాయకులను తరచూ కలవడం, అంతర్గతంగా పాలనా పరమైన నిర్ణయాల విషయంలో వారి సలహాలకు విలువ ఇవ్వడం మానలేదు.

ఇలాంటి నేపథ్యంలో భాజపా ప్రభుత్వానికి బిగ్ బాస్ లాగా వ్యవహరిస్తున్న ఆరెస్సెస్ ప్రత్యేకించి గుజరాత్ ఎన్నికల ఫలితాల పట్ల అసంతృప్తిగానే ఉన్నట్లు సమాచారం. ఇది పండుగ చేసుకోవాల్సిన విజయం కాదని.. జాగరూకత వహించాల్సిన ఆవశ్యకతను తెలియజెప్పే విజయం అని వారు భావిస్తున్నారట. గుజరాత్ లో మెజారిటీ తగ్గిందనే అంశాన్ని ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని.. పార్టీకి మళ్లీ ఇలాంటి దుస్థితి రాకుండా భవిష్యత్ కార్యచరణ రూపొందించుకోవాలని నిర్దేశనం చేస్తున్నారట. మొత్తానికి అభినందనలు పర్వాన్ని ఇక మరచిపోయి.. అప్రమత్తం కావడం గురించి మోడీని సంఘ్ హెచ్చరిస్తున్నదని పలువురు భావిస్తున్నారు.
Tags:    

Similar News