ప‌వ‌న్ అప్ప‌టికి పిల్లాడు..స్కూల్లో ఉండి ఉంటాడు

Update: 2018-07-06 04:50 GMT
జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు మాజీ ఎంపీ స‌బ్బం హ‌రి. అయ్య‌గారి తీరు చూస్తే.. ఏపీ అధికార‌ప‌క్షంలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్న‌ట్లుగా క‌నిపిస్తోంది. పైకి మాత్రం తాను వైఎస్సార్ కాంగ్రెస్ తో పాటు.. జ‌న‌సేన‌లోకి వెళ్లేందుకు సైతం రెఢీగా ఉన్న‌ట్లు చెబుతున్నా.. స‌బ్బం మాట‌ల్ని వింటే మాత్రం ఆయ‌న చూపుల‌న్నీ సైకిల్ ఎక్కేందుకే సిద్ధంగా ఉన్న‌ట్లు క‌నిపించ‌క మాన‌దు.

తాజాగా ఉత్త‌రాంధ్ర‌లో ప‌ర్య‌టిస్తున్న జ‌న‌సేన అధినేత చేస్తున్న వ్యాఖ్య‌ల‌పై స‌బ్బం తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. అవ‌గాహ‌న రాహిత్యంతో ప‌వ‌న్ మాట్లాడుతున్నార‌ని.. ఆయ‌న మాట‌ల కార‌ణంగా లేనిపోని సందేహాలు తెర మీద‌కు వ‌స్తున్నాయ‌న్నారు. టీటీడీలో పింక్ డైమండ్ లేద‌ని మాజీ ఈవోలంతా నిర్దారించార‌ని గుర్తు చేసినా.. ఇప్ప‌టికి పింక్ డైమండ్ అంటూ ప‌దే ప‌దే అదే విష‌యాన్ని ప్ర‌స్తావించ‌టం అర్థం లేద‌న్నారు.

ఏపీలో పెట్టుబ‌డులు పెట్టేందుకు పారిశ్రామిక‌వేత్త‌లు భ‌య‌ప‌డుతున్నార‌న్న వ్యాఖ్య‌లు కూడా అవ‌గాహ‌న‌రాహిత్యంతో కూడుకున్న‌వేన‌న్న ఆయ‌న‌.. ప‌వ‌న్ చేస్తున్న వ్యాఖ్య‌ల్ని వ‌రుస పెట్టి త‌ప్పుప‌ట్ట‌టం గ‌మ‌నార్హం. ఆ మ‌ధ్య‌న త‌న‌ను ఉద్దేశించి వ్యాఖ్య‌లు చేసిన అశోక్ గ‌జ‌ప‌తి రాజును ప‌వ‌న్ త‌ర‌చూ టార్గెట్ చేయ‌టం తెలిసిందే. అశోక్ మీద ప‌వ‌న్ చేసే వ్యాఖ్య‌ల‌కు స‌భికుల నుంచి వ‌స్తున్న స్పంద‌న నేప‌థ్యంలో త‌ర‌చూ ఆ త‌ర‌హా వ్యాఖ్య‌లు ప‌వ‌న్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. అశోక్ గ‌జ‌ప‌తి మీద ప‌వ‌న్ చేస్తున్న వ్యాఖ్య‌ల్ని స‌బ్బం త‌ప్పు ప‌ట్టారు. త‌న వ‌ల్లే అశోక్ గెలిచారంటూ ప‌వ‌న్ చేస్తున్న వ్యాఖ్య‌లు స‌రికాద‌ని.. త‌న వ‌ల్లే ఏపీలో టీడీపీ అధికారం అనుభ‌విస్తోంద‌న్న ప‌వ‌న్ మాట‌ల్ని కామెడీగా కొట్టిపారేశారు.

1983 నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ అశోక్ గ‌జ‌ప‌తి రాజు ప్ర‌తి ఎన్నిక‌ల్లో విజ‌యం సాధిస్తున్నార‌ని.. 30 ఏళ్లుగా గ‌జ‌ప‌తులు అనుభ‌వించిన ప‌దవులు ఎవ‌రి వ‌ల్ల వ‌చ్చాయో చెప్పాలంటూ ప‌వ‌న్ ను ప్ర‌శ్నించిన స‌బ్బం.. 1983లో అశోక్ గ‌జ‌ప‌తిరాజు గెలిచిన‌ప్పుడు ప‌వ‌న్ స్కూల్లో ఉండి ఉంటార‌న్నారు. త‌న వ‌ల్లే అశోక్ గ‌జ‌ప‌తి రాజు గెలిచారంటూ ప‌వ‌న్ చేస్తున్న వ్యాఖ్య‌ల‌పై ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌లు అస‌హ్యించుకుంటున్నార‌న్న ఆయ‌న‌.. ఇప్ప‌ట్లో కాంగ్రెస్ కోలుకునే అవ‌కాశ‌మే లేద‌ని.. కొత్త త‌రం వ‌స్తే కానీ ఆద‌ర‌ణ వ‌చ్చే అవ‌కాశం లేద‌న్నారు. మొత్తంగా ప‌వ‌న్ ను కార్న‌ర్ చేసిన స‌బ్బం వ్యాఖ్య‌లు ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News