783 కోట్ల‌ ప్రాజెక్టు..హ‌రీశ్ వ‌ల‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే?

Update: 2018-01-09 07:05 GMT
తెలంగాణ‌లో ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ మ‌రోమారు మొద‌లైందా? విప‌క్ష ఎమ్మెల్యే టార్గెట్‌గా చేసిన ఏకంగా రూ. 783 కోట్ల ప్రాజెక్టుకు తెలంగాణ ప్ర‌భుత్వం శ్రీ‌కారం చుట్టిందా? ఈ వ‌ల‌లో స‌ద‌రు ఎమ్మెల్యే చిక్కుకున్నారా? అంటే అవున‌నే చ‌ర్చ జరుగుతోంది రాజ‌కీయ‌వ‌ర్గాల్లో. జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి మండలం తుమ్మిళ్లలో రూ.783 కోట్ల రూపాయలతో చేపట్టిన తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం మొదటిదశ పనులకు మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన చేశారు. ఈ కార్య‌క్ర‌మం కేవ‌లం ప్రాజెక్టు శంకుస్థాప‌న‌కే ప‌రిమితం కాలేద‌ని...రాజ‌కీయాల వేదిక‌గా మారింద‌ని అంటున్నారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి హరీశ్‌ రావు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్య‌క్తి అయిన‌ప్ప‌టికీ...తాము అభివృద్ధికి క‌ట్టుబ‌డి ఉండి ఈ ప్రాజెక్టును మొద‌లుపెట్టామ‌ని తెలిపారు. ఆర్డీఎస్ పరిధిలోని 87,500 ఎకరాలకు కచ్చితంగా సాగునీరందించి తీరుతామని స్పష్టం చేశారు. ఆర్డీఎస్ నుంచి 17.09 టీఎంసీల నీటి కేటాయింపులున్నా కేవలం ఐదు టీఎంసీలు కూడా సమైక్యపాలకులు పారించలేదని విమర్శించారు. ఆర్డీఎస్ గురించి ఇటీవలే కర్ణాటక ప్రభుత్వంతోనూ చర్చించామని - పెండింగ్‌ లో ఉన్న పనులను వేగవంతంగా పూర్తిచేసేందుకు కర్ణాటక ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని వెల్లడించారు. కాంగ్రెస్ నేతలు గతంలో పదేండ్లపాటు తమ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టుల పనులు చేశామని చెప్పినా ఏ ఒక్క ప్రాజెక్టు నుంచి కూడా చుక్కనీరు పారించలేదని ఎద్దేవా చేశారు. ఇందుకు ఉమ్మడి పాలమూరులోని ఎంజీకేఎల్‌ ఐ - నెట్టెంపాడు - భీమా - కోయిల్‌ సాగర్ ఎత్తిపోతల పథకాలే నిదర్శనమని వివరించారు.

గతంలో కాంగ్రెస్ ఇచ్చిన విడుతలవారీ కరంటు.. రైతులకు చుక్కలు చూయించిందన్నారు. నేడు టీఆర్‌ ఎస్ ప్రభుత్వం నిరంతరాయంగా త్రీఫేస్ కరంటును అందిస్తూ - దేశంలోనే రాష్ర్టాన్ని అభివృద్ధిలో నంబర్‌ వన్‌ గా నిలిపిందని తెలిపారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అంతర్భాగమైన ఏదుల రిజర్వాయర్ పనులు వచ్చే నెలాఖరుకల్లా పనులు పూర్తి అవుతున్నాయని.. వచ్చే సీజన్‌ లో ఈ రిజర్వాయర్‌ లో సాగునీటిని నిలువ చేసి ఉమ్మడి పాలమూరు సాగుబడులకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే - ఇక్కడి కాంగ్రెస్ నాయకులు కోర్టుకు వెళ్లి అడ్డుకునే ప్రయత్నాలు చేయడం పాలమూరు రైతుల దురదృష్టకరమని వెల్లడించారు.

ఈ ప్రాజెక్టుకు భూమి పూజ‌ సంద‌ర్భంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే సంపత్‌ కుమార్ మంత్రి హ‌రీశ్ రావుకు చేతులు జోడించి ధ‌న్య‌వాదాలు తెలిపారు. అంతేకాకుండా స్వ‌యంగా హ‌రీశ్‌ రావుకు నెత్తిన కిరీటం పెట్ట‌డం విశేషం. ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయ‌కులు పెండింగ్‌ లో పెట్టిన ఈ ప్రాజెక్టుకు టీఆర్ ఎస్ స‌ర్కారు మోక్షం క‌లిగించింద‌ని.. త్వ‌ర‌లోనే... ఆయ‌న పార్టీ మార‌నున్నార‌ని అంటున్నారు.

Tags:    

Similar News