సుప్రీంకోర్టు సంచలన తీర్పు..ఆర్మీలో శాశ్వత మహిళా కమిషన్‌!

Update: 2020-02-17 09:55 GMT
ఇండియన్ ఆర్మీ పర్మినెంట్ కమిషన్‌ లో మహిళా కమాండోల నియామకంపై దేశ అత్యున్యత న్యాయస్థానం   సోమవారం సంచలన తీర్పును వెలువరించింది. పురుషులతో సమానంగా మహిళలకు కూడా ఇందులో అవకాశం కల్పించాలని ఆదేశించింది. లింగవివక్షతకు తావులేకుండా మహిళలనూ పర్మినెంట్ కమిషన్‌ లోకి అనుమతించాలని జస్టిస్ డీవై చంద్రచూడ్ - జస్టిస్ అజయ్ రస్తోగి ధర్మాసనం ఈ మేరకు స్పష్టం చేసింది.  తమ ఆదేశాల అమలుకు కేంద్రానికి మూడు నెలల సమయం ఇచ్చిన సుప్రీం.. ఈ విషయంలో కేంద్రం తీరును తప్పుబట్టింది.  మహిళలపై కేంద్ర ప్రభుత్వం తన ఆలోచనా ధోరణిని మార్చుకోవాలని తెలిపింది.  సామాజిక - భౌతిక పరిమితులు - కుటుంబ బాధ్యతలను సాకుగా చూపి మహిళలకు కేంద్రం సమాన అవకాశం కల్పించకపోవడాన్ని తీవ్రంగా పరిగణించింది.

ఆర్మీలో మహిళల కోసం శాశ్వత కమిషన్‌ను ఏర్పాటు చేయడానికి వీలుగా 2010లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును కేంద్ర ప్రభుత్వం సవాల్ చేసింది. శాశ్వత మహిళా కమిషన్ ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ సుప్రీంకోర్టులో పిటీషన్‌ ను దాఖలు చేసింది. ఈ పిటీషన్ సోమవారం విచారణ నిర్వహించింది. 2010లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే మంజూరు చేయాలంటూ కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తన వాదనలను వినిపించారు. దీనిపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. పురుషులతో సమానంగా మహిళలకు ప్రాధాన్యత కల్పించాల్సి అవసరం ఉందని ధర్మాసనం స్పష్టం చేసింది. దీనికోసం శాశ్వత కమిషన్ ఉండి తీరాల్సిందేనని అభిప్రాయపడింది. ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కేంద్రం దాఖలు చేసిన పిటీషన్‌ను కొట్టేసింది.

స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ కింద ఎంపికైన మహిళా అధికారులు 14 సంవత్సరాలకు లోబడి ఉన్నా - పైబడి ఉన్నప్పటికీ - వారికి శాశ్వత కమిషన్‌ ను మంజూరు చేయాల్సి ఉంటుందని తెలిపింది. అంతకుముందు కేంద్రం తమ వాదన వినిపిస్తూ .. ప్రస్తుతం సైన్యంలోని పురుషుల్లో చాలా మంది గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చినవారేనని - సామాజిక నిబంధనల కారణంగా మహిళా అధికారులను కమాండోగా అంగీకరించడానికి మానసికంగా సిద్ధంగాలేరని  - అలాగే - వివిధ భౌతిక ప్రమాణాల ఆధారంగా పోస్టింగ్ విషయంలో మహిళలు, పురుషులను సమానంగా చూడలేమని - ఈ విషయంలో పరిమితులున్నాయని స్పష్టం చేసింది. ఈ వాదనలను మహిళల తరఫున హాజరైన మీనాక్షీ లేఖీ - ఐశ్వర్య భట్టీ తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ మహిళలు అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించారని, పాకిస్థాన్ ఎఫ్-16 యుద్ధ విమానాన్ని కూల్చేవేసిన వింగ్ కమాండర్ అభినందన్‌ కు మార్గనిర్దేశనం చేసిన ఫ్లైట్ కంట్రోలర్ మింటీ అగర్వాల్ ఉదంతమే నిదర్శనమని - ఆమెకు యుద్ధ సేవా మెడల్ కూడా వచ్చిందని తెలియజేశారు. అలాగే ,కాబూల్‌ లోని భారత రాయబార కార్యాలయంపై జరిగిన ఉగ్రదాడిని మహిళా అధికారి మిథాలీ మధుమిత చాలా సమర్ధంగా తిప్పికొట్టిన విషయాన్ని కూడా కోర్టుకి తెలిపారు.
Tags:    

Similar News