చిత్తూరు వైసీపీలో సీన్ రివ‌ర్స్‌... ఫైర్ బ్రాండ్ సైలెంట్‌

Update: 2021-11-07 02:30 GMT
చిత్తూరు జిల్లా వైసీపీలో రాజ‌కీయాలు రివ‌ర్స్ అవుతున్నాయ‌నే టాక్ వినిపిస్తోంది. పార్టీకి ఇక్క‌డ చాలా బ‌ల‌మైన కేడ‌ర్ ఉంది. అయితే.. గ‌తంలో ఇక్క‌డ నుంచి పార్టీ త‌ర‌ఫున గ‌ట్టి వాయిస్ వినిపించేందుకు చంద్ర‌గిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి రెడీగా ఉండేవారు. అంతేకాదు.. పార్టీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు.. చెవిరెడ్డి.. వ్యూహాత్మ‌కంగా పావులు క‌దిపారు. పార్టీదే పైచేయి అని నిరూపించేందుకు ఆయ‌న పార్టీ అధినేత క‌నుస‌న్న‌ల్లో ముందుకు సాగారు. దీంతో అటు అసెంబ్లీలోనూ.. ఇటు.. బ‌య‌ట కూడా వైసీపీ త‌ర‌ఫున చెవిరెడ్డి జోరుగా.. వ్యాఖ్య‌ల బాణాలు సంధించేవారు.

అయితే.. పార్టీ అదికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత మాత్రం చెవిరెడ్డి ఎందుకో సైలెంట్ అయ్యారు. పార్టీలో కీల‌క‌మైన ప‌ద‌వులు ల‌భించ లేద‌నో.. లేక‌.. మంత్రిగా ఛాన్స్ ద‌క్కే అవ‌కాశం లేద‌నో.. ఆయ‌న భావించి ఉంటారు. ఆయ‌న వ‌రుస‌గా రెండు సార్లు గెల‌వ‌డంతో మంత్రి ప‌ద‌వి ఆశించారు. అయితే రెడ్డి కోటాలో పెద్దిరెడ్డి మంత్రి ప‌ద‌వి త‌న్నుకుపోవ‌డంతో జ‌గ‌న్ ఆయ‌న్ను సంతృప్తి ప‌రిచేందుకు తుడా చైర్మ‌న్‌తో పాటు టీటీడీ బోర్డు మెంబ‌ర్ ప‌ద‌వులు ఇచ్చారు. అయితే ఇప్పుడు తుడా చైర్మ‌న్ ప‌ద‌వి నుంచి తొల‌గించేశారు.

దీంతో కేవ‌లం ప్ర‌జ‌ల సంక్షేమానికి మాత్ర‌మే ఆయ‌న క‌ట్టుబ‌డి పోయారు. ఇటు కోవిడ్ స‌మ‌యంలోనూ.. ఇత‌ర‌త్రా స‌మ‌యాల్లోనూ.. ప్ర‌జ‌ల‌కు అన్ని విధాలా అండ‌గా ఉంటు న్నారు. తిరుప‌తి పార్ల‌మెంటు ఉప ఎన్నిక‌లో కానీ.. స్థానిక ఎన్నిక‌లో కానీ.. ఆయ‌న పెద్ద‌గా ఫైర్ బ్రాండ్ మాదిరిగా రెచ్చిపోలేదు. నిజానికి పార్టీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు.. చెవిరెడ్డి నిత్యం మీడియాలో ఉండేవారు. స‌రే! ఇప్పుడు క‌ట్ చే్స్తే.. జిల్లాలో ఇంకెవ‌రున్నారు.. ఫైర్ బ్రాండ్ అని త‌ర‌చి చూస్తే.. కొన్నాళ్ల కింద‌టి వ‌ర‌కు ఎవ‌రూ క‌నిపించ‌లేదు.

కానీ, ఇటీవ‌ల కాలంలో.. త‌న‌దైన శైలితో దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.. పూత‌ల‌ప‌ట్టు ఎమ్మెల్యే ఎం.ఎస్‌. బాబు. టీడీపీపై ఓ రేంజ్‌లో ఆయ‌న విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఇటు కోస్తాలో మంత్రి కొడాలి నాని ఏవిధంగా అయితే.. చంద్ర‌బాబుపై వ్యాఖ్య‌లు చేస్తారో.. అదే రేంజ్‌లో విరుచుకుప‌డుతున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి వ‌ర్గంలో కీల‌కంగా ఉన్న బాబు కుప్పంలో పార్టీ జెండా ఎగ‌రేసేందుకు తాము సిద్ధ‌మ‌ని పెద్దిరెడ్డిని చంద్ర‌బాబు ఏమీ చేయ‌లేర‌ని విమ‌ర్శిస్తున్నారు. దీంతో ఇప్పుడు చిత్తూరు జిల్లా అధికార పార్టీలో చెవిరెడ్డి పోయి బాబు వ‌చ్చాడోచ్ అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.
Tags:    

Similar News