మద్యం తాగే గోప్యత కూడా లేదా..? ఆ విషయాలు ఎందుకు చెప్పాలి..?

Update: 2021-10-02 01:30 GMT
ఆంధ్రప్రదేశ్లో మద్యం దుకాణాల్లో డిజిటల్ చెల్లింపు వ్యవహారంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.  ఈ విధానంలో ఆధార్ ద్వారా చెల్లించేలా చూడాలని ఓ న్యాయవాది వాదించగా ఇతరుల మద్యం ఖర్చుపై మీకెందుకు అని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. మద్యం చెల్లింపుల్లో ఆధార్ అనుసంధానించడమేంటని ప్రశ్నించింది. అయితే మద్యం చెల్లింపులు డిజిటల్ ద్వారా చేయాలని వచ్చిన పిటిషన్ పై అంతకుముందు హైకోర్టు ఆమోదించింది. ఈ నిర్ణయంపై సుముఖత వ్యక్తం చేస్తూ మద్యం దుకాణాల్లో డిజిటల్ చెల్లింపులు చేసుకోవచ్చని అనుమతి ఇచ్చింది.

ప్రకాశం జిల్లాకు చెందిన దాసరి ఇమ్మాన్యుయేల్ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. మద్యం దుకాణాల్లో ఆన్లైన్, డిజిటల్ చెల్లింపులు చేయాలని, ఇందుకు కోర్టు అనుమతి ఇవ్వాలని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ వ్యాజ్యం గురువారం ధర్మాసనం ముందుకు వచ్చింది.  దీంతో ఆంధ్రప్రదేశ్ బేవరేజస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీబీఎల్) తరుపున న్యాయవాది పి. నరసింహామూర్తి  దసరా కల్లా మద్యం దుకాణాల్లో డిజిటల్ చెల్లింపుల విధానం అమల్లోకి వస్తుందన్నారు. ఇందుకు బ్యాంకులు కూడా అంగీకరించాయన్నారు. ఇందులో భాగంగా మద్యం షాపుల్లో అవసరమైన పరికరాలను అందుబాటులోకి తెస్తామన్నారు. ఈ వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణ అక్టోబర్ 28కి వాయిదా వేస్తున్నట్లు సీజే జస్టిస్ నైనాల జయసూర్యల ధర్మాసనం ఆదేశాలిచ్చింది.

ఇదే సమయంలో మరో పిటిషనర్ తరుపున న్యాయవాది వంకాయలపాటి నాగ ప్రవీణ్ వాదించారు. మద్యం విక్రయాలను ఆధార్ తో అనుసంధానం చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. మద్యం దుకాణాల్లో డిజిటల్ చెల్లింపులు చేసినప్పుడు ఆధార్ కూడా ప్రవేశపెట్టి తీరాలన్నారు.  అయితే నాగ ప్రవీణ్ వాదనపై హైకోర్టు ఆసహనం వ్యక్తం చేసింది. మద్యం విక్రయాలను ఆధార్ తో అనుసంధానించడమేంటని ప్రశ్నించింది. దీనికి సమాధానంగా నాగ ప్రవీణ్ రాష్ట్రంలో అనేక మంది సంక్షేమ పథకాలు పొందుతున్నారని, వారు మద్యంపై అధికంగా ఖర్చు పెడుతున్నారన్నారు. సంక్షేమ పథకాలు పొందుతున్నవారిలో రోజుకు కనీసం రూ.200 నుంచి 300 వరకు వెచ్చిస్తున్నారన్నారు.

అయితే ప్రజలు ఎంత మద్యం తాగుతున్నారన్న విషయం పిటిషనర కు ఎందుకని ధర్మాసనం ప్రశ్నించింది. కొందరికి మద్యం తాగే స్వేచ్ఛ కూడా ఉండకూడదా..? అని అడిగింది. ఇతరుల పర్సనల్ విషయాల్లోకి తొంగి చూడడ మెందుకంది. ఇంతకూ పిటిషనర్ ఏం చేస్తున్నారని ధర్మాసనం అడగగా నాగ ప్రవీణ్ సమాధానం చెప్పలేకపోయారు. పిటిషనర్ గురించి వివరాలు చెప్పరు గాని ఇతరు విషయం ఆయనకు ఎందుకని ప్రశ్నించింది.

ఇదిలా ఉండగా తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన సంఘటనలో ఎస్ ఐని సస్పెండ్ చేశామని రాష్ట్ర అడ్వకేట్ జనరల్ ఎస్. శ్రీరామ్ గురువారం హైకోర్టుకు విన్నవించారు. జిల్లాలోని కొత్త పేట పోలీస్ స్టేషన్లో ఇద్దరు వ్యక్తులను నిర్బంధించి కొట్టిన వ్యవహారంలో ఈ చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.   ఆ వ్యక్తులపై ఉన్న గాయాలను పరిశీలించాక స్పందిస్తామని అన్నారు. అయితే ఈ వివరాలను వైద్యులకు అందించాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ప్రభుత్వ కౌంటర్ కు సమాధానం ఇస్తామని పిటిషనర్ తరుపున న్యాయవాది రాజిరెడ్డి చెప్పడంతో ఈ విచారణను అక్టోబర్ 28కి వాయిదా వేసింది.

అలాగే ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలపై సీఎం ఫొటో ముద్రించడాన్ని సవాల్ చేస్తూ గుంటూరు జిల్లా భట్టిప్రోలుకు చెందిన జడా రవీంద్రబాబు పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ విచారణను చేపట్టిన ధర్మాసనం ఫొటో ముద్రణపై ఉన్న అభ్యంతరాలను అధికారులకు వినతి రూపంలో తెలియజేయాలని ఆదేశించారు. అభ్యంతరాలను ఆరువారాల్లో తెలియజేయాలని న్యాయమూర్తి జస్టిస్ మంతోజు గంగారాం గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
Tags:    

Similar News