సీనియర్లు... చలో ఢిల్లీ... ?

Update: 2021-12-12 17:30 GMT
సీనియర్ అయితే ఏ రంగంలో అయినా విలువా మర్యాదా ఉంటాయి. అయితే కాలం మారుతోంది. టెక్నాలజీ అడ్వాన్స్ అయింది. ఈ సాంకేతిక యుగం లో వయసే ఒక్కోసారి మైనస్ అవుతోంది. కుర్రాళ్ళూ గుర్రాలూ అంటున్నారు అంతా. మరీ ముఖ్యంగా రాజకీయాల్లో చూసుకుంటే యూత్ కే పెద్ద పీట వేస్తున్నారు. ఒకనాడు భారత దేశంలో సీఎం సగటు వయసు ఆరు పదులు దాటి ఉంటే. ఇపుడు అది కాస్తా యాభైకి చేరింది. దీని అర్ధం వయోజనులకు సైడ్ చేస్తున్నారు అన్న మాటే.

ప్రతీ ఎన్నికకూ కొత్త వ్యూహాలను అనుసరించే పార్టీలు ఈసారి తారక మంత్రంగా యువతను వాడుకోవాలని చూస్తున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నుంచి మొదలుపెడితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పార్టీల వరకూ అంతా కుర్ర కారు యమ జోరు అని గట్టిగా నమ్ముతున్నారు. ఈ లెక్కన తీసుకుంటే ఏపీలో వచ్చే ఎన్నికల్లో యువ రక్తమే ఎటు చూసినా కనిపిస్తుంది అని ముందే జోస్యం చెప్పాల్సి వస్తోంది.

వచ్చే ఎన్నికలలో అధికార వైసీపీ తీసుకుంటే యాభై ఏళ్ల లోపు వారికే ఎమ్మెల్యే టికెట్లు అన్న సూత్రాన్ని పెట్టుకుంటుంది అన్న టాక్ నడుస్తోంది. ఆ పై ఏజ్ వారిలో మరీ ముఖ్యమనుకుంటే కాస్తా మినహాయింపు ఉంటుందేమో తప్ప టోటల్ 175లో తొంబై శాతం యువతకే పెద్ద పీట అని చెబుతున్నారు. అందులోనూ కొత్త వారికి ప్రాధాన్యత ఇస్తారని తెలుస్తోంది.

మరి యాభైలు దాటిన వారి సంగతేంటి అంటే వారికీ ఒక చాన్స్ ఉంది. అదే ఢిల్లీ బాట పట్టడం. సీనియర్ నేతకు, మంత్రులుగా పని చేసిన ఫిఫ్టీ ప్లస్ బ్యాచ్ ని ఎంపీలుగా బరిలో దింపాలని పార్టీ భావిస్తోందని ప్రచారం అయితే గట్టిగా సాగుతోంది. ఇక అరవైలు దాటిన వారు, ఇంకా ఎక్కువ వయసు ఉన్న వారిని పార్టీ బాధ్యులుగా చేసి ఎన్నికల్లో విజయం కోసం వారి సేవలను వాడుకుంటారని చెబుతున్నారు.

మరి వారికి రాజయోగం ఉండదా అంటే వారికీ చాన్స్ ఉంటుంది. వారిని ఎమ్మెల్సీలుగా, రాజ్య స‌భ సభ్యులుగా నామినేటెడ్ పదవులలో నియమిస్తారని, వారి అనుభవాలను పార్టీ కోసం, జిల్లాల్లో విజయాల కోసం వినియోగించుకుంటారని అంటున్నారు. ఈ విధానాన్ని ఇప్పటి నుంచే అమలులో పెట్టడానికి వైసీపీ అధినాయకత్వం రెడీగా ఉంది. మంత్రి వర్గ విస్తరణలో సీనియర్లను కొంత మందిని అలా ఏరి కోరి పార్టీ పనికి వినియోగించడం ద్వారా కొత్త వారికీ యూత్ కి క్యాబినెట్ బెర్తులు కన్ ఫర్మ్ చేయాలని హై కమాండ్ యోచిస్తోందని టాక్.

చిత్రమేంటి అంటే ఇదే రకమైన ఆలోచనలో టీడీపీ కూడా ఉందిట. ఆ పార్టీ కూడా సీనియర్ సేవలు ఇక చాలు, మీకు ఎన్నికల్లో టికెట్లు ఉండవని చెబుతోంది. పార్టీ విజయం కోసం పనిచేయమని సూచిస్తోందిట. మొత్తానికి ఏపీలో యూత్ కి మంచి రోజులు వస్తూంటే తెలంగాణాలో కూడా ఇలాగే అధికార టీయారెస్ కానీ విపక్షాలు కానీ ఆలోచించడం మొదలెట్టాయని అంటున్నారు. అంటే యూత్ ట్యాగ్ తోనే వచ్చే ఎన్నికలను ఎదుర్కోవాలని అన్ని పార్టీలు గట్టిగా డిసైడ్ అయిపోయాయన్న మాట. మరి యూత్ పొలిటికల్ ఫేట్ ని మారుస్తుందా. వెయిట్ అండ్ సీ.
Tags:    

Similar News