ఫైబర్ నెట్ స్కాంలో సంచలనం.. కేంద్ర అధికారి అరెస్ట్: నెక్ట్స్ లోకేష్ టార్గెట్?

Update: 2021-09-18 11:30 GMT
గత చంద్రబాబు ప్రభుత్వంలో వెలుగుచూసిన ఫైబర్ నెట్ స్కాంలో తొలి అరెస్ట్ జరిగింది. చంద్రబాబు కేబినెట్ లో ఐటీశాఖ మంత్రి ఆయన కుమారుడు లోకేష్ ఉన్న సంగతి తెలిసిందే. ఫైబర్ నెట్ ను స్వయంగా లోకేష్ మంత్రిగా అమలు చేశారు. ఆయనకు సంబంధించిన వ్యక్తులు ఈ స్కాంలో అక్రమాలకు పాల్పడ్డారనే అంశంపైనే సీఐడీ విచారణ సాగింది. అందులో 2వేల కోట్ల మేర అవినీతి జరిగిందంటూ ప్రస్తుత ఫైబర్ నెట్ చైర్మన్ గౌతం రెడ్డి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో సీఐడీ అధికారులు కీలక సమాచారాన్ని వెలుగులోకి తెచ్చారు.

ఈ ఫైబర్ నెట్ స్కాంలో ఐదురోజులుగా సీఐడీ అధికారులు ఇందులో కీలకంగా భావిస్తున్న ముగ్గురు వ్యక్తులను విచారణకు పిలిచారు. అందులో వేమూరి హరిప్రసాద్ తోపాటు నాటి ప్రభుత్వంలో ఇన్ ఫ్రాస్టక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ వీసీ , ఎండీగా పనిచేసిన సాంబశివరావు హాజరయ్యారు.

తాజాగా ఈరోజు ఫైబర్ నెట్ స్కాంలో సాంబశివరావును సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన రాష్ట్రంలో పనిచేసేందుకు డిప్యూటేషన్ మీద వచ్చారు. కేంద్ర రైల్వే సర్వీసులకు చెందిన సాంబశివరావు ఏపీలో డిప్యూటేషన్ మీద పనిచేశారు. ఇన్ ప్ట్రాస్టక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీగా ప్రభుత్వం ఆయనకు బాధ్యతలు అప్పగించింది. తాజాగా ఆయనను అరెస్ట్ చేసిన పోలీసులు సీఐడీ కోర్టులో హాజరు పరుచనున్నట్లు తెలుస్తోంది.

సాంబశివరావు అరెస్ట్ తో టీడీపీలో గుబులు మొదలైంది. ఈ ఫైబర్ నెట్ ను దగ్గరుండి అమలు చేయించింది మంత్రి లోకేష్. దీంతో లోకేష్ అరెస్ట్ ఖాయమన్న ప్రచారం మొదలైంది. ప్రభుత్వం ఎలా అడుగులు వేస్తుందన్నది ఆసక్తిగా మారింది.

*ఇదీ ఫైబర్ గ్రిడ్ వ్యవహారం
చంద్రబాబు హయాంలోని అక్రమాలు అవినీతిపై జగన్ ప్రభుత్వం గద్దెనెక్కగానే కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మంత్రివర్గ ఉపసంఘం విచారణలో తాజాగా విస్తుగొలిపే వాస్తవాలు వెలుగుచూశాయని తెలిసింది. మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి నారాలోకేష్ కు అత్యంత సన్నిహితుడైన వేమూరి హరికృష్ణ కేంద్రంగా ఈ అవినీతి సాగినట్టు సబ్ కమిటీ తేల్చింది. ఈ వేమూరి హరికృష్ణ గతంలో ఈవీఎంల ట్యాంపరింగ్, చోరీ కేసులో ప్రధాన నిందితుడు. ఇతడికి చెందిన బ్లాక్ లిస్ట్ లో ఉన్న టెరాసాఫ్ట్ కు గత చంద్రబాబు ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా ఫైబర్ గ్రిడ్ పనులను కట్టబెట్టినట్టు ఏపీ కేబినెట్ సబ్ కమిటీ విచారణలో తేలినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబుతోపాటు లోకేష్ పాత్ర కూడా సీబీఐ దర్యాప్తులో వెలుగుచూసే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఏపీ ప్రభుత్వం చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో 2015 జూలై 7న గత సర్కారు హయాంలో రూ.329 కోట్ల అంచనా వ్యయంతో ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌ (ఆంధ్రపదేశ్‌ స్టేట్‌ ఫైబర్‌ నెట్‌ లిమిటెడ్‌) టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ టెండర్లలో నాలుగు సంస్థలు బిడ్‌లు దాఖలు చేశాయి. హారిజోన్‌ బ్రాడ్‌క్రాస్ట్‌ ఎల్‌ఎల్‌పీ, సిగ్నమ్‌ డిజిటల్‌ నెట్‌తో టెరాసాఫ్ట్‌ కన్సార్టియంగా ఏర్పడి రూ.320.88 కోట్లకు బిడ్‌ దాఖలు చేసింది. అయితే ఇందులో తూర్పు గోదావరి జిల్లాలో ఈ–పాస్‌ యంత్రాల సరఫరాలో అక్రమాలకు పాల్పడిన టెరాసాఫ్ట్‌ను 2015 మే 11న ఏపీటీఎస్‌(ఆంధ్రప్రదేశ్‌ టెక్నాలజీ సర్వీసెస్‌) బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టింది. బ్లాక్‌ లిస్ట్‌లో ఉన్న సంస్థకు టెండర్లలో బిడ్‌ దాఖలు చేసేందుకు అర్హత ఉండదు. కానీ ఈఎంవీ (ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్‌)ల చోరీ కేసులో నిందితుడు, చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన వేమూరు హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్‌ బిడ్‌ను ఆమోదించాలని టీడీపీ సర్కార్‌ పెద్దలు అధికారులపై ఒత్తిడి తెచ్చారని సబ్ కమిటీ నివేదించింది. అంతటితో ఆగకుండా తక్కువ ధరకు బిడ్‌ దాఖలు చేసిన ఎల్‌–1ను కాదని అధిక ధరక బిడ్‌ దాఖలు చేసిన టెరాసాఫ్ట్‌కు ఫైబర్‌ గ్రిడ్‌ దక్కేలా చక్రం తిప్పినట్టు కేబినెట్ సబ్ కమిటీ విచారణలో తేలింది. ఈ క్రమంలో పైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టులో రూ.200 కోట్లకుపైగా అవినీతి చోటు చేసుకున్నట్లు నిర్ధారిస్తూ కేబినెట్‌కు నివేదిక ఇచ్చింది.


Tags:    

Similar News