జూన్ లో 10 కోట్ల టీకాలకు కేంద్రానికి సీరం హామీ.. ఆశ్చర్యం అందుకే?

Update: 2021-05-31 06:30 GMT
తీవ్రమైన టీకా కొరతతో కిందామీదా పడుతున్న కేంద్రానికి ఊపిరి పీల్చుకునే ప్రకటన చేసింది సీరం ఇన్ స్టిట్యూట్. తాజాగా ఆ సంస్థ కేంద్ర మంత్రి అమిత్ షాకు ఒక లేఖ రాసింది. దాని సారాంశం ఏమంటే.. జూన్ లో 10 కోట్ల వ్యాక్సిన్లు అందిస్తామని పేర్కొన్నారు. టీకాల ఉత్పత్తిని పెంచేందుకు తమ ఉద్యోగులు రేయింబవళ్లు కష్టపడుతున్నట్లుగా పేర్కొంది. జూన్ లో తొమ్మిది నుంచి పది కోట్ల వరకు టీకా డోసులు ఉత్పత్తి చేసి.. సరఫరా చేస్తామని చెప్పటానికి తాను సంతోషిస్తున్నట్లుగా సీరం పేర్కొంది.

కేంద్రమంత్రి అమిత్ షాకు సీరం ఇచ్చిన హామీపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. అలివికాని హామీని ఇస్తుందా? అన్నదిప్పుడు సందేహంగా మారింది. ఎందుకంటే.. ఇదే సంస్థ మేలో తాము 6.5 కోట్ల డోసుల్ని మాత్రమే ఉత్పత్తి చేయగలిగినట్లుగా పేర్కొంది. అందుకు భిన్నంగా ఇప్పుడు ఏకంగా 2.5కోట్ల నుంచి 3.5 కోట్ల డోసుల్ని పంపిణీ చేస్తానని చెప్పటంతో అదెలా సాధ్యమన్నది ప్రశ్నగా మారింది.

దేశంలో ప్రస్తుతం కోవీషీల్డ్.. కొవాగ్జిన్ వ్యాక్సిన్లు లభ్యమవుతున్నాయి. ఇటీవల స్పుత్నిక్ - వీ వ్యాక్సిన్ ను విడుదల చేసింది. త్వరలోనే పెద్ద ఎత్తున అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. వ్యాక్సినేషన్ కార్యక్రమం దేశంలో మందకొడిగా సాగటంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సెకండ్ వేవ్ పుణ్యమా అని దేశ ప్రజల్లో టీకా మీద అవగాహన పెరగటమే కాదు.. దీన్ని తీసుకోవటం కోసం పోటీ పడుతున్నారు. సీరం చెప్పినట్లుగా జూన్ లో 9- 10 కోట్ల వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయగలదా? అన్నది మాత్రం ప్రశ్నగా మారింది.
Tags:    

Similar News