మళ్లీ అదే చట్టం, వణికిపోతోన్న మహిళలు ..తాలిబన్ల సంచలన ప్రకటన !

Update: 2021-09-08 08:35 GMT
ఆఫ్ఘనిస్తాన్ మళ్లీ యధావిధిగా తాలిబన్ల చేతుల్లోకి వెళ్ళిపోయింది. అమెరికా సైన్యం అక్కడి నుండి వెనక్కి వెళ్లిపోయిన తర్వాత ఆఫ్ఘన్ లో తాలిబన్ల హావా ప్రారంభమైంది. ఇదే సమయంలో ఆఫ్ఘన్ మహిళల్లో ఆందోళన కూడా రోజురోజుకి పెరిగిపోతుంది. దీనికి ప్రధాన కారణం ఆఫ్ఘన్ లో తాలిబన్లు అమలు చేసే షరియా చట్టం. ప్రత్యక్ష నరకం ఎలా ఉంటుందో ఆప్ఘనిస్తానీయులకు పరిచయం చేసిన చట్టంగా దీన్ని చెబుతుంటారు. ఈ షరియా చట్టాన్ని తాలిబన్ ప్రభుత్వం ఎక్కడ అమలు చేస్తుందోననే భయంతోనే ఆప్ఘనిస్తాన్ ప్రజలు ప్రాణాలకు తెగించి పుట్టిన గడ్డ వదిలి వెళ్లడానికి ప్రయత్నించారు.

రెండు దశాబ్దాల కిందట ఆప్ఘనిస్తాన్‌ను పరిపాలించిన తాలిబన్లు షరియా చట్టాన్ని అమలు చేశారు. షరియా చట్టాన్ని ఉల్లంఘించిన వారికి మరణశిక్షను సైతం విధించడానికి వెనుకాడలేదు. అదెంత కఠినంగా ఉంటుందనేది అక్కడి ప్రజలకే కాదు. ప్రపంచం మొత్తానికీ తెలుసు. తాజాగా మళ్లీ అలాంటి పరిస్థితే అక్కడ ఏర్పడబోతోంది. ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించిన తాలిబన్లు.. ఆ వెంటనే బాంబులాంటి వార్తనూ వెల్లడించారు. షరియా చట్టాన్ని కఠినంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఆఫ్ఘనిస్తాన్‌ను ఆక్రమించుకున్న తరువాత షరియా చట్టం గురించి తాలిబన్లు ప్రస్తావించడం ఇదే తొలిసారి.

అందులో ఎలాంటి మార్పులు ఉండబోవని, రెండుదశాబ్దాల కిందట అమలు చేసిన చట్టాన్ని యధాతథంగా ఇప్పుడు కూడా కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. పత్రికా స్వేచ్ఛ, మీడియా ప్రతినిధులు, మహిళల హక్కులను షరియా చట్ట పరిధిలోనే గౌరవిస్తామని స్పష్టం చేశారు. దాన్ని ఎంత వరకు అమలు చేస్తారనేది అనుమానమే. మహిళల హక్కులను గౌరవించడం అనేది అసాధ్యమనే అభిప్రాయాలు ఇప్పటికే అందరిలో వ్యక్తం అవుతున్నాయి. షరియా చట్టాన్ని.. ఇస్లాం న్యాయవ్యవస్థగా చెప్పుకోవచ్చు. ఖురాన్‌లో పొందుపరిచిన అంశాలు, ముస్లి మతపెద్దలు జారీ చేసిన ఫత్వాల ఆధారంగా ఈ చట్టాన్ని రూపొందించారనే అభిప్రాయాలు ఉన్నాయి.

ముస్లింలు తమ దినచర్యలో భాగంగా మతాన్ని గౌరవిస్తూ చేపట్టాల్సిన ప్రతి చర్యను ఈ చట్టంలో పొందుపరిచారు. మత పెద్దలు నిర్దేశించిన నియమాలు, రంజాన్ వంటి కొన్ని పండుగ సమయాల్లో పాటించే ఉపవాసాలు, సమాజంలో ముస్లిం మహిళలు ఎలా ఉండాలి అనే విషయాలు ఇందులో ఉంటాయి. మహిళలు బుర్ఖాలు, పురుషులు పొడుగాటి దుస్తులను ధరించాల్సి ఉంటుందని షరియా చట్టం సూచిస్తుంది. అలాగే పురుషులు గడ్డం గీసుకోకూడదు. వాటిని కఠినంగా అమలు చేయాల్సి ఉంటుంది షరియా చట్టం ప్రకారం. పురుషుల తోడు లేకుండా మహిళలు ఇంటి గడపను దాటకూడదనేది షరియాచట్టంలో పొందుపరిచారు. చోరీలు, మహిళలపై అత్యాచారం, హత్యలకు పాల్పడటం వంటి నేరాలకు అత్యంత కఠినమైన శిక్షలను అమలు చేయాల్సి ఉంటుందని షరియా చట్టం చెబుతుంది.

1996-2001 మధ్య ఆప్ఘనిస్తాన్‌ ను పాలించిన తాలిబన్లు మహిళలు చదువుకోవడాన్ని నిషేధించిన విషయం తెలిసిందే. దీని ప్రభావంతో ఇప్పటికే ఆప్ఘనిస్తాన్‌ లోని విశ్వవిద్యాలయాలు మూతపడ్డాయి. తాలిబన్‌ ప్రభుత్వ హయాంలో మహిళల విద్యను ఇప్పుడు పునరుద్ధరించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సారి మహిళలకు చదువుకోవడానికి అవకాశం ఇస్తామని తాలిబన్లు ప్రకటించారు. వారి వస్త్రధారణతో పాటు ఇతర అంశాలపై ఆంక్షలు విధించారు. కోఎడ్యుకేషన్‌ను నిషేధించారు. ఇప్పుడు మళ్లీ అలాంటి చట్టం ఆఫ్ఘనిస్తాన్‌లో తెరమీదికిరాబోతోండటం ఆ దేశ ప్రజల్లో తీవ్ర భయాందోళనలకు గురి చేస్తోంది. దీన్ని వ్యతిరేకిస్తూ ప్రదర్శనలు చేసే వారిపై బుల్లెట్ల వర్షాన్ని కూడా కురిపించడానికి వెనుకాడరు తాలిబన్లు. షరియా చట్టాన్ని అమలు చేస్తామని, తాలిబన్లు అధికారికంగా ప్రకటించడంతో రెండు దశాబ్దాల కిందటి పరిస్థితులు పునరావృతం కాబోతున్నాయి అని ఆఫ్ఘన్ మహిళలు ఆందోళన చెందుతున్నారు.


Tags:    

Similar News