వైఎస్ఆర్ కు షర్మిల, విజయమ్మ నివాళులు

Update: 2021-07-08 05:47 GMT
దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 72వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని ఆయన సమాధి వద్ద వైఎస్ షర్మిల, వైఎస్ విజయమ్మ ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

ప్రత్యేక ప్రార్థనల అనంతరం షర్మిల ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు బయలు దేరుతారు. సాయంత్రం 5 గంటలకు పార్టీ ఆవిర్భావంపై ప్రకటనచేయనున్నారు. పార్టీ జెండా, అజెండా ఇప్పటికే ఖరారైంది.

తెలంగాణలో మరో రాజకీయ పార్టీ అధికారికంగా ఆవిర్భవిస్తోంది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల ఈరోజు సాయంత్రం ‘వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ’ని ఆయన జయంతి సందర్భంగా గురువారం ప్రారంభిస్తున్నారు. పార్టీ ఆవిర్భావ ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి.

హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో సాయంత్రం 5 గంటలకు వేలాది మంది వైఎస్ఆర్ అభిమానుల సమక్షంలో వైఎస్ షర్మిల పార్టీ జెండాను ఆవిష్కరించి పార్టీని, జెండాను, విధివిధానాలు, లక్ష్యాలను కొత్త పార్టీ ఏర్పాటు సందర్భంగా ప్రకటిస్తారు.

ఇక షర్మిల ఇడుపుల పాయ నుంచి బయలు దేరి వెళ్లాక సాయంత్రం 4 గంటలకు సీఎం జగన్ ఇడుపులపాయ చేరుకుంటారు. ఇడుపులపాయలో వైఎస్ఆర్ కు నివాళులర్పించనున్నారు. ఆ తర్వాత జిల్లాల్లో పలు అభివఋద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు.

అయితే విభేదాలు ఉన్నాయని ప్రచారం అవుతున్న నేపథ్యంలో తండ్రి వైఎస్ఆర్ కు షర్మిల, జగన్ వేర్వేరు సందర్భాల్లో నివాళులర్పించడం చర్చనీయాంశమైంది. దీన్ని బట్టి వీరి మధ్య విభేదాలు ఉన్నాయని పరిశీలకులు అనుమానిస్తున్నారు.
Tags:    

Similar News