అన్ని ప్రేమలు ఒకేలా ఉండవు.. అయ్యో అనిపించే ఈ ఉదంతం

Update: 2021-09-22 03:48 GMT
దాదాపు రెండు దశాబ్దాల క్రితం మణిరత్నం ‘సఖి’ అనే సినిమా తీశారు. అందులో హీరోహీరోయిన్లు ప్రేమించుకుంటారు. ఇంట్లో ఇబ్బంది రాకుండా ఉండేందుకు.. చట్టబద్ధంగా తాను ప్రేమించిన అమ్మాయి తన భార్యగా చేసుకునేందుకు ఇద్దరి ఇళ్లల్లో తెలియకుండా పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత బయటపడుతుందనుకోండి. ఆ విషయాన్ని పక్కన పెడితే.. ఆ సినిమాలో మాదిరి ఎవరికి తెలీకుండా పెళ్లి చేసుకొని.. ఎవరి ఇళ్లల్లో వారు ఉన్న తీరులోనే తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఒక జంట ఏడాదిగా ప్రేమించుకుంటున్నారు.

యువకుడి సోదరి ద్వారా యువతి పరిచయమైంది. యువకుడికి 24 ఏళ్లు అయితే.. యువతికి 21 ఏళ్లు. తమ ప్రేమకు పెళ్లితో కామా పెట్టాలనుకున్న వారు.. పది రోజుల క్రితం వారిద్దరూ హైదరాబాద్ లో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. అనంతరం ఎవరి ఇళ్లల్లో వారు ఉంటున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా వారి పెళ్లి ఫోటోలు ఎలా వచ్చాయో కానీ బయటకు వచ్చేశాయి. సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఇక్కడే ఊహించని ట్విస్టు వారి జీవితాలకు శాపంగా మారింది.

వీరి పెళ్లి ఫోటోల్ని చూసిన ఇరు వర్గాలకు చెందిన బంధువులు.. వారిద్దరూ అన్నాచెల్లెళ్లుగా తేల్చి.. వారిద్దరి మధ్య బంధురికం ఈ సోదరీసోదరుల వరుసగా తేల్చారు. దీంతో.. తీవ్ర మనస్తాపానికి గురైన యువతి పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకుంటే.. ఆ విషయం తెలుసుకున్నయువకుడు పురుగుల మందు తాగి వ్యవసాయ బావిలో దూకేశాడు. సమయానికి స్థానికులు ఈ విషయాన్ని గుర్తించి.. అతన్ని కాపాడి స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఖమ్మంలో చికిత్స పొందుతున్న ఆ యువకుడి పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రస్తుతం హైదరాబాద్ కు తరలించారు. ప్రతి ప్రేమకథ ఒకేలా ఉండదన్నది నిజమే అయినా.. మరీ ఇలా మాత్రం ఉండకూడదని చెప్పక తప్పదు.
Tags:    

Similar News