గౌరవ సభలు నిర్వహించాలా..? వద్దా..?

Update: 2021-12-09 05:36 GMT
ఏపీ అసెంబ్లీలో కొన్ని రోజుల కింద జరిగిన పరిణామాలు సంచలనం రేపాయి. అసెంబ్లీ వేదికగా ప్రతిపక్ష నేత చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యేలు ఘాటు వ్యాఖ్యాలు చేశారు. అవి అతని సతీమణి భువనేశ్వరిని ఉద్దేశించి అన్నారని చంద్రబాబు మీడియా ఎదుట బోరున విలపించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబుకు సానుభూతి వ్యక్తమైంది. మరోవైపు వైసీపీ ఎమ్మెల్యేల వ్యాఖ్యలపై కొందరు విమర్శలు చేస్తూ వచ్చారు. అయితే ఇదే అంశంపై ప్రజల్లోకి వెళ్లాలని టీడీపీ నిర్ణయించింది. గౌరవ సభలు పెట్టి ప్రభుత్వ పనితీరును ఎండగట్టాలని ఆలోచింది. కానీ ఇంతలో భువనేశ్వరిపై వ్యాఖ్యలు చేసిన వల్లభనేని వంశీ క్షమాపణలు చెప్పారు. దీంతో టీడీపీ నాయకులు గౌరవ సభలు నిర్వహించాలా..? వద్దా..? అన్న సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వల్లభనేని వంశీ, కొడాలి నాని, అంబటి రాంబాబులు చంద్రబాబుపై విమర్శలు చేశారు. ఒక దశలో వల్లభనేని వంశీ చంద్రబాబు సతీమణిణిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపాయి. వైసీపీ నాయకుల వ్యాఖ్యలపై టీడీపీ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించింది. ఈ క్రమంలో చంద్రబాబుకు సానుభూతి పెరిగింది. తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ సహా కొందరు ఫోన్లో చంద్రబాబును పరామర్శించారు. ఈ విషయంపై వైసీపీలోనూ అంతర్మథనం మొదలైంది. ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండేది కాదని కొందరు నాయకులు లోలోపలచర్చించుకున్నట్లు సమాచారం.

ఇదే సమయంలో పార్టీపై వ్యతిరేకత పవనాలు వీస్తున్నట్లు గ్రహించిన టీడీపీ నాయకులు గౌరవ సభలు నిర్వహించాలని నిర్ణయించారు. అసెంబ్లీలోకి ఆడవాళ్ల ఇంట్లో వాళ్ల ప్రస్తావనను తీసుకు రావడంపై గౌరవసభల్లో ఎండగట్టాలని అనుకున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల సభలు నిర్వహించాలని ప్లాన్ వేశారు. అలాగే చంద్రబాబు మళ్లీ సీఎం అయ్యాకే అసెంబ్లీలో అడుగుపెడుతానని శపథం చేశారు. దీంతో సీఎం అయ్యేందుకు ప్రజల్లోకి వెళ్లాలని, అందుకు గౌరవ సభలే పునాది కావాలని అనుకుంటున్నారు.

అయితే ఈ క్రమంలో చంద్రబాబు సతీమణిపై కామెంట్స్ చేసిన వల్లభనేని వంశీ క్షమాపణలు చెప్పారు. తాను అలా కామెంట్స్ చేసిందుకు క్షమించండి అంటూ ప్రకటించారు. దీంతో టీడీపీ నాయకులు డైలామాలో పడ్డారు. అసలు భువనేశ్వరిపై కామెంట్స్ చేశారనే గౌరవ సభలు నిర్వహించాలని అనుకున్నవారు... ఇప్పుడు ఆయన క్షమాపణ చెప్పిన తరువాత ఎలాంటి అంశంతో ఈ సభలు నిర్వహించాలని ఆలోచిస్తున్నారట. అయితే వల్లభనేని క్షమాపణ చెప్పకపోతే మాత్రం ఈ అంశం ప్రజల్లోకి బాగా వెళ్లేది. వైసీపీ నాయకుల ప్రవర్తనను తప్పుబట్టే అవకాశం ఉండేంది. కానీ ఆ చాన్స్ మిస్సయిందని టీడీపీ నాయకులు అనుకుంటున్నారు.

ఇదే సమయంలో వంశీ గురించి ప్రస్తావించకుండా ప్రజా సమస్యలపై ఈసభలు నిర్వహిస్తే బాగుంటుందని కొందరు సూచిస్తున్నారట. అయితే అలా కాదని ఇదే అంశంతో ప్రజల్లోకి వెళితే మొదటికే మోసం వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే వల్లభనేని వంశీ క్షమాపణలు చెప్పినా కొడాలి నాని, అంబటి రాంబాబులు మాత్రం తమ వ్యాఖ్యలను సమర్థించుకుంటున్నారు. తాము భువనేశ్వరిని ఉద్దేశించి అనలేదని, చంద్రబాబే తన భార్యను రాజకీయంగా వాడుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. అయితే టీడీపీ నాయకులు మాత్రం కొడాలి నాని వ్యాఖ్యలను ఆధారంగా సభలను నిర్వహిస్తే కాస్త ప్రయోజనం ఉంటుందని అనుకుంటున్నారు. కానీ చంద్రబాబు తన వ్యూహాన్ని ఎలా మలిచాడో పార్టీ నాయకులకు కూడా అర్థం కావడం లేదని కొందరు అంటున్నారు. ఇలాంటి అంశంపై చంద్రబాబు చెప్పిన విధంగానే నడుచుకుంటే పోలా.. అని కొందరు నాయకులు అంటున్నారు. కానీ ఇంకొందరు మాత్రం ప్రజల్లో ఈ విషయంపై సానుకూలత ఏర్పడే అవకాశం ఉందా అని అనుమానిస్తున్నారట.
Tags:    

Similar News