టీడీపీ అభిమానుల మౌనం ?

Update: 2022-08-22 08:30 GMT
అటు తెలంగాణ‌లోనూ, ఇటు ఆంధ్రాలోనూ మంచి ఇమేజ్ ఉన్న హీరో తార‌క్. తెలుగుదేశం పార్టీతో విడ‌దీయ‌లేని బంధం ఉన్న కుర్రాడు. వీలున్నంత వ‌ర‌కూ తాను రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటాన‌ని అంటుంటాడు. మ‌రి ! ఇప్పుడెందుక‌ని బీజేపీకి చేరువ అవుతున్నాడ‌ని ? ఇదే ప్ర‌శ్న చాలా మందిని వేధిస్తోంది. నిన్న‌టి వేళ హైద్రాబాద్ నోవాటెల్ లో అమిత్ షాతో తారక్ భేటీ అయ్యారు. ఈ భేటీకి సంబంధించి అనేక క‌థ‌నాలు వ‌స్తున్నాయి.

ఏవి నిజం ఏవి అబ‌ద్దం అన్న‌వి తేల్చ‌లేం. కానీ తెలంగాణ బీజేపీ కి ఓ స్టార్ క్యాంపైన‌ర్ కావాల‌ని భావిస్తున్నార‌ని, అందుకు తార‌క్ అయితే బాగుంటుంద‌న్న వాద‌న ఒక‌టి వినిపిస్తుంది. ఎలానూ ఆంధ్రాలో ప‌వ‌న్ తో స్నేహం ఉంది క‌నుక తెలంగాణ వ‌ర‌కూ తార‌క్ సాయం తీసుకోవాల‌ని చూస్తున్నార‌ని తెలుస్తోంది.

అయితే ఈ వార్త‌లు కూడా చాలా మంది కొట్టిపారేస్తున్నారు. జూనియ‌ర్ అలాంటి త‌ప్పుడు నిర్ణ‌యాలు తీసుకోర‌ని, వీలున్నంత వ‌ర‌కూ తెలుగుదేశం పార్టీతోనే అనుబంధ బాంధ‌వ్యాలు కొన‌సాగిస్తార‌ని అంటున్నారు. ఎవ‌రి వాద‌న ఎలా ఉన్నా తార‌క్ ఓ కేంద్ర హోం మంత్రిని క‌ల‌వ‌డ‌మే పెద్ద వార్త. ఆయ‌నతో భేటీ అయ్యాక ఏం మాట్లాడి ఉంటార‌న్న వివ‌రం ఏదీ బ‌య‌ట‌కు రాలేదు. న‌ల‌భై ఐదు నిమిషాల పాటు సాగిన భేటీలో ఆ ఇద్ద‌రూ ఏం మాట్లాడుకున్నారు అన్న వివ‌రం ఏదీ బ‌య‌ట‌కు రాలేదు.

కానీ అమిత్ షా ట్వీట్ మాత్రం ఆస‌క్తిగానే ఉంది. ఆయ‌న ప్ర‌తిభ ఉన్న న‌టుడు అని తారక్ ను ఉద్దేశిస్తూ ప్రశంస పూర్వ‌క వ్యాఖ్య చేశారు. జూనియ‌ర్ భేటీ నేప‌థ్యంలో ఇటు తెలంగాణ‌లోనూ, అటు ఆంధ్రాలోనూ తెలుగుదేశం అభిమానులు కాస్త డైల‌మాలో ప‌డ్డారు.

ఇప్పుడేం మాట్లాడితే ఏ విధంగా అర్థం చేసుకుంటారో అని సోష‌ల్ మీడియా యాక్టివిస్టులు కూడా కాస్త సంయ‌మ‌నంతోనే ఉన్నారు. అయితే తారక్ ను పిలిపించి అమిత్ షా మాట్లాడిన వైనంపై కేసీఆర్ వ‌ర్గం మండిప‌డుతోంది.

మంచి ఇమేజ్ ఉన్న న‌టుడు తార‌క్ ను త‌మ అవ‌స‌రాల‌కు అనుగుణంగా బీజేపీ వాడుకోనుందా అన్న సందేహాలు వ్య‌క్తం చేస్తున్న‌ది. వ‌ద్దు తారక్ వ‌ద్దు అటుగా వెళ్ల‌మాకు అని కూడా స‌ల‌హాలు ఇస్తోంది.
Tags:    

Similar News