సింగర్ మనో.. పోయి పోయి ఆ పార్టీలో చేరాడు

Update: 2019-03-10 10:38 GMT
నాగూర్ బాబు అలియాస్ మనో గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గాయకుడిగా ప్రస్థానం మొదలుపెట్టి.. ఆపై డబ్బింగ్ ఆర్టిస్టుగా.. టెలివిజన్ షోల హోస్ట్‌ గా.. సంగీత కార్యక్రమాల జడ్జిగా బహుముఖ ప్రజ్ఞను చాటుకున్నారాయన. రజనీకాంత్ సినిమాలకు తెలుగులో ఆయన చెప్పే డబ్బింగ్ ఎంత పాపులారో తెలిసిందే. దక్షిణాదిన ఏదో ఒక ఇండస్ట్రీకి పరిమితం కాకుండా పలు భాషల్లో పాపులారిటీ సంపాదించుకున్నాడు మనో. ఇప్పుడాయన రాజకీయ అరంగేట్రానికి సిద్ధం కావడం విశేషం. మనో లాంటి పాపులర్ పర్సనాలిటీ వస్తానంటే ప్రధాన పార్టీలు రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానం పలుకుతాయి. కానీ ఆయన మాత్రం తమిళనాడుకు వెళ్లి అక్కడ అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం అనే పార్టీలో చేరాడు. ఇది శశికళ అనుయాయుడు టీటీవీ దినకరన్ పెట్టిన పార్టీ.

జయలలిత మరణానంతరం తమిళనాట నెలకొన్న నాటకీయ రాజకీయ పరిణామాల్లో టీటీవీ దినకరన్‌ హాట్ టాపిక్ అయ్యాడు. అతను జయలలిత నియోజకవర్గం అయిన ఆర్కే నగర్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో ఏదో మ్యాజిక్ జరిగింది కానీ.. టీటీవీ రాబోయే పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపిస్తాడన్న అంచనాలేమీ లేవు. అతడికి రాష్ట్ర స్థాయిలో సొంతంగా పార్టీ నడిపేంత సీన్ లేదు. అలాంటి వాడు పెట్టిన పార్టీలోకి మనో చేరడం ఆశ్చర్యమే. సినిమా వాడు కాబట్టి రజనీకాంత్ లేదా కమల్ హాసన్‌ పెట్టిన పార్టీల్లో చేరితే బాగుండేదని.. అక్కడ మనోకు ప్రాధాన్యం కూడా దక్కేదని.. మంచి స్థానం చూసుకుని పోటీ చేస్తే గెలిచేందుకు కూడా అవకాశం ఉండేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి మనో ఏం ఆశించి టీటీవీ పెట్టిన పార్టీలో చేరాడో ఆయనకే తెలియాలి.
Tags:    

Similar News