బాబును ఇరుకున పెట్టేలా చేస్తున్న సోమిరెడ్డి

Update: 2017-08-25 06:57 GMT
కొన్ని సంద‌ర్భాల్లో నోటిని ఎంత అదుపులో ఉంచుకుంటే అంత మంచిది. అదేం సిత్ర‌మో కానీ.. తెలుగు త‌మ్ముళ్ల‌కు ఈ సూక్ష్మం తెలీక త‌ర‌చూ త‌ప్పులో కాలేస్తుంటారు. నంద్యాల ఉప ఎన్నిక సంద‌ర్భంగా బాబు బ్యాచ్ ఎంత‌గా హైరానా ప‌డింద‌న్న విష‌యం అంద‌రికి అర్థ‌మైంది. ఇంత‌కాలం త‌మ‌కు ఎదురులేదు.. తిరుగులేదంటూ చెప్పిన మాట‌ల్లో బ‌డాయిత‌నం నంద్యాల ఉప ఎన్నిక పుణ్య‌మా అని రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు అర్థ‌మైంది.

ఒక ఉప ఎన్నిక కోసం ఒక బ‌ల‌మైన అధికార‌ప‌క్షం ఇంత కిందామీదా ప‌డాల్సిన అవ‌స‌రం ఏమిట‌న్న సందేహాలు మొద‌లు కావ‌ట‌మే కాదు.. బాబు పాల‌నపై స‌రికొత్త సందేహాలు వ్య‌క్త‌మ‌య్యే ప‌రిస్థితి. బాబుకు వ‌య‌సు మీద ప‌డింద‌ని.. తొమ్మిదిన్న‌రేళ్ల ముఖ్య‌మంత్రిగా వ్య‌వ‌హ‌రించిన స‌మ‌యంలో ప్ర‌ద‌ర్శించిన చురుకుద‌నం మొత్తంగా మాయ‌మైంద‌న్న వాద‌న‌లో నిజం ఉంద‌న్న విష‌యం తాజా ప‌రిణామాలు స్ప‌ష్టం చేస్తున్నాయ‌ని చెప్పాలి.

నంద్యాల ఉప ఎన్నిక తుది ఫ‌లితం ఎలా ఉంటుందో అన్న‌ది ఎవ‌రికీ అంతుచిక్క‌నిదిగా మారింది. త‌మ గెలుపు ఖాయ‌మ‌ని తెలుగు త‌మ్ముళ్లు బ‌య‌ట‌కు చెబుతున్నా.. లోప‌ల మాత్రం గోస్పాడు.. నంద్యాల రూర‌ల్ ప్రాంతాల ఓట‌ర్లు త‌మ త‌ల‌రాత‌ను ఏ విధంగా లిఖించారో అర్థం కాక స‌త‌మ‌త‌మ‌వుతున్నారు.

ఇదిలా ఉంటే.. నంద్యాల ఉప ఎన్నిక మీద మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి మాట‌లు ఇప్పుడు  తెలుగు త‌మ్ముళ్ల‌కు తెగ చిరాకు తెప్పిస్తున్నాయ‌ట‌. గెలుపు ముచ్చ‌ట మీదే సందేహాలున్న వేళ‌.. పాతిక‌వేల మెజార్టీ అంటూ ఆయ‌న చెబుతున్న మాట‌ల‌పై ఫైర్ అవుతున్నారు. మూడేళ్ల తెలుగుదేశం ప్ర‌భుత్వ పాల‌న‌కు రెఫ‌రెండంగా నంద్యాల ఉప ఎన్నిక‌ల ఫ‌లితం అని చెప్పిన జ‌గ‌న్ మాట‌కు నిల‌బ‌డ‌తారా? అంటూ ఆయ‌న ప్ర‌శ్నిస్తున్న వైనంపై క‌స్సుమంటున్నారు.

ఉప ఎన్నిక పోలింగ్ చివ‌రి మూడు గంట‌ల్లో ఉన్న ప‌వ‌ర్ అంతా ఉపయోగించి కిందామీదా ప‌డిన నేప‌థ్యంలో ఒక‌వేళ గెలిచినా అదంతా కూడా చాలా ప‌రిమిత మెజార్టీతోనే ఉంటుంది త‌ప్పించి.. భారీ మెజార్టీ వ‌చ్చే అవ‌కాశం లేద‌న్న భావ‌న‌లో ఉన్న వేళ‌.. ముందు వెనుకా చూసుకోకుండా సోమిరెడ్డి చెబుతున్న బ‌డాయి మాట‌లు కొత్త త‌ల‌నొప్పులు తెచ్చే అవ‌కాశం ఉందంటున్నారు. పాతిక వేల మెజార్టీ ప‌క్కా అని చెబుతున్న వేళ‌.. రేపొద్దున త‌క్కువ మెజార్టీతో గెలిచినా.. పాతిక‌వేలు వ‌స్తాయ‌న్నారుగా? అంటూ సంధించే ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్ప‌లేక ఆత్మ‌ర‌క్ష‌లో పడాల్సి వస్తుంద‌ని.. దీనంత‌టికి కార‌ణం సోమిరెడ్డి మాట‌లే అన్న ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తున్నారు తెలుగు త‌మ్ముళ్లు. మ‌రి.. త‌మ్ముళ్ల‌కున్న లాజిక్ మంత్రి సోమిరెడ్డికి ఎందుకు మిస్ అయిన‌ట్లు చెప్మా?
Tags:    

Similar News