లోకేశ్‌ ను సోమిరెడ్డి పొగిడారా?.. తిట్టారా?

Update: 2017-04-17 04:24 GMT
టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ చ‌ట్ట‌స‌భ‌ల్లోకి అడుగుపెట్టిన తీరుపై ఇంకా మాట‌ల మంట‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. ఓ రాజ‌కీయ పార్టీకి అధినేత‌గానే కాకుండా... ఓ రాష్ట్రానికి సీఎంగా ఉన్న కీల‌క నేత కుమారుడు చ‌ట్ట‌స‌భ‌ల్లోకి ఎంట్రీ ఇవ్వ‌డం డైరెక్ట్‌ గా ఉండాలి గానీ... లోకేశ్ విష‌యంలో చంద్ర‌బాబు ఎందుకు ఇన్‌ డైరెక్ట్ ఎంట్రీని ఎంచుకున్నార‌న్న అంశంపై పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రిగింది. ద‌మ్ముంటే ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల ద్వారా చ‌ట్ట‌స‌భ‌లోకి అడుగుపెట్టాల‌ని విప‌క్ష పార్టీ నేత‌ల‌తో పాటు ప‌లు జాతీయ పార్టీల నేత‌లు కూడా బ‌హిరంగంగానే స‌వాళ్లు విసిరారు. అయితే ఈ స‌వాళ్ల‌ను - విమ‌ర్శ‌ల‌ను ఏమాత్రం ప‌ట్టించుకోని లోకేశ్... ఎమ్మెల్సీగానే ఏపీ శాస‌న‌మండ‌లిలోకి ప్ర‌వేశించారు. ఆ వెనువెంట‌నే త‌న తండ్రి ఆధ్వ‌ర్యంలోని మంత్రివ‌ర్గంలోనే చేరిపోయి... కీల‌క శాఖ‌ల బాధ్య‌త‌లు చేప‌ట్టారు.

ఈ క్ర‌మంలో మెజారిటీ ప్ర‌జ‌లు లోకేశ్ చ‌ట్ట‌స‌భ‌ల ఎంట్రీని దాదాపుగా మ‌రిచిపోయార‌నే చెప్పాలి. ఈ విష‌యాన్ని జ‌నం మ‌రిచిపోయినా గానీ... సొంత పార్టీ నేత‌లు మాత్రం మ‌రిచిపోవ‌డానికి సిద్ధంగా లేరు. లోకేశ్‌ పై ఈగ కూడా వాల‌కుండా చూసుకునే బ్యాచ్‌ లో ముందు వ‌రుస‌లో ఉన్న పార్టీ సీనియ‌ర్ నేత‌ - లోకేశ్‌ తో పాటు చంద్ర‌బాబు కేబినెట్‌ లో స్థానం సంపాదించుకున్న సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి నిన్న మ‌ళ్లీ ఈ విష‌యాన్ని క‌దిపారు. అస‌లు లోకేశ్ ఏ రీతిన చ‌ట్ట‌స‌భ‌ల్లోకి అడుగుపెడితే ఏమిటంటూ ప్ర‌శ్న‌ల‌తో మొద‌లెట్టిన ప్ర‌సంగాన్ని సోమిరెడ్డి ఓ పీక్ స్టేజ్‌ కు తీసుకెళ్లారు. దేశానికి ప‌దేళ్ల పాటు ప్ర‌ధానిగా ప‌నిచేసిన మ‌న్మోహ‌న్ సింగ్ రాజ్య‌స‌భ‌కే ప్రాతినిధ్యం వ‌హించారు క‌దా అంటూ ఆరాలు తీశారు. దేశ ప్ర‌ధానే ప‌రోక్ష ఎన్నిక ద్వారా చ‌ట్ట‌స‌భ‌లోకి ప్ర‌వేశిస్తే... లోకేశ్ అదే మార్గం ద్వారా ఎంట్రీ ఇస్తే త‌ప్పేంట‌ని సోమిరెడ్డి ప్ర‌శ్నించారు. అయితే ఇక్క‌డ సోమిరెడ్డి ఓ విష‌యాన్ని మ‌రిచిపోయిన‌ట్లున్నారు.

మ‌న్మోహ‌న్ సింగ్ ఫ‌క్తు రాజ‌కీయ నేత కాదు. ప్ర‌పంచం మెచ్చిన ఆర్థికవేత్త‌. మ‌న్మోహ‌న్ సింగ్ త‌నంత తానుగా రాజ‌కీయాల్లోకి రాలేదు. నాడు ప్ర‌ధానిగా ఉన్న పీవీ న‌ర‌సింహారావు... ఏరికోరి మ‌న్మోహ‌న్‌ ను త‌న కేబినెట్‌ లో చేర్చుకుని ఆ త‌ర్వాత రాజ్య‌స‌భ స‌భ్య‌త్వం ఇప్పించారు. ఆ త‌ర్వాత కూడా సోనియా గాంధీ అదే పంథాను కొన‌సాగిస్తూ... మ‌న్మోహ‌న్‌ కు ప్ర‌ధాని ప‌ద‌వి క‌ట్ట‌బెట్టి రాజ్య‌స‌భ‌లోనే కొన‌సాగించారు. మ‌రి లోకేశ్‌ లో ఏ క్వాలిటీస్ ఉన్నాయ‌ని చంద్ర‌బాబు... ఆయ‌న‌ను మండ‌లికి పంపార‌న్న విష‌యాన్ని సోమిరెడ్డి చెప్ప‌లేదు. అంతేకాకుండా మ‌న్మోహ‌న్ సింగ్ లా లోకేశ్ ఆర్థిక వేత్త కాదు... ఫ‌క్తు రాజ‌కీయ కుటుంబానికి చెందిన వ్య‌క్తి. మ‌రి అలాంటి వ్య‌క్తి ప‌రోక్ష ఎన్నిక ద్వారా చ‌ట్ట‌స‌భ‌లోకి ప్ర‌వేశించ‌డం ఎంత‌వ‌ర‌కు స‌మంజ‌స‌మ‌న్న ప‌లు రాజ‌కీయ పార్టీల ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇచ్చేందుకు రంగంలోకి దిగిన సోమిరెడ్ది... మ‌న్మోహ‌న్‌ తో పోల్చి లోకేశ్ ను ఇంకా కింద‌కు దిగ‌జార్చిన‌ట్టుగా విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News