కడప జిల్లాకు బిస్కట్ వేస్తున్న సోమిరెడ్డి!

Update: 2017-12-21 23:30 GMT
కడపలో ఉక్కు పరిశ్రమ అనేది రాయలసీమ ప్రజలకు సంబంధించి చాలా పెద్ద కల. అప్పట్లో ప్రభుత్వం సంకల్పించినట్లుగా ఇక్కడ ఉక్కు పరిశ్రమ ఏర్పాటు జరిగినట్లయితే గనుక.. అసలే క్షామం తాండవిస్తూ ఉండే సీమ నడిబొడ్డున కొన్ని వేల ఉద్యోగ - ఉపాధి అవకాశాలు ఏర్పాటు అవుతాయి. అయితే.. తెలుగు రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా విభజించినప్పుడు కూడా కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయడం గురించి.. అప్పటి కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చింది. మోడీ సర్కారు గద్దె ఎక్కిన తర్వాత.. తతిమ్మా విషయాల్లో నాటకాలు నడుస్తున్నట్లే.. ఉక్కు పరిశ్రమ విషయంలోనూ అనేక మాయమాటలు చెబుతూ రోజులు నెట్టుకొస్తున్నారు. తాజాగా ఢిల్లీ టూర్ లో ఉన్న మంత్రి సోమిరెడ్డి... వెంకయ్యనాయుడు ను కూడా కలిసి.. పరిశ్రమల మంత్రిని కూడా కలిసి.. ఓ విజ్ఞప్తి చేసి.. అక్కడితోనే చర్చలు ఫలప్రదం అయిపోయాయి అంటూ.. ఫ్యాక్టరీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ వచ్చినంత ఘనంగా ప్రకటించడం చూస్తోంటే.. కడప జిల్లా వాసులకు బాబు సర్కార్ తాజాగా ఓ బిస్కెట్ వేయడానికి పూనుకుంటున్నట్లుగా కనిపిస్తోంది.

ఎందుకంటే.. కడపలో ఉక్కు పరిశ్రమ అనేది మనకు చాలా ముఖ్యమైనదిగా కనిపించవచ్చు గాక.. కానీ ఢిల్లీ పెద్దలకు అందులో చాలా అపభ్రంశపు విషయాలు కనిపిస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే.. వెంకయ్యనాయుడు కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో ఇందుకోసం చాలా గట్టి ప్రయత్నాలే చేశారు. కానీ ఒక దశ దాటిన తర్వాత.. ఆయనే స్వయంగా ఇది అయ్యే పని కాదని బహిరంగసభల్లోనే తేల్చిచెప్పేశారు. ఏం చేద్దాం.. చాలా స్టడీ చేశారు.. ఫీజిబిలిటీ లేదని అంటున్నారు.. అంటూ ఆయన గతంలోనే పెదవి విరిచేశారు.

కాకపోతే.. అదే కడప ఉక్కు పరిశ్రమ విషయంలో ఇప్పుడు కొత్త డ్రామా మొదలైనట్లుగా కనిపిస్తోంది. విభజన చట్టంలో ఉన్న ఈ పరిశ్రమను ఇన్నాళ్లూ విస్మరించిది వదిలేసి, ఏదో కొత్తగా తాము రాష్ట్రానికి పరిశ్రమ తెస్తున్న రీతిగా సోమిరెడ్డి ‘మంత్రితో చర్చలు ఫలప్రదం’ అంటూ సెలవిస్తున్నారు. ఇంతా కలిపి... అక్కడ జరిగినదెల్లా.. ఫీజిబిలిటీ నివేదిక ప్రకారం నిర్ణయం తీసుకోండి అని కోరడం మాత్రమే. కానీ ఆ నివేదిక పరిశ్రమ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఉన్నదని గతంలోనే వెంకయ్యనాయుడు చెప్పిన సంగతి ఈ నేతలకు గుర్తున్నట్టు లేదు. ఏదో కడప వాసులకు కాస్త ఆశ పుట్టేలాగా.. కొత్త ఎపిసోడ్ ను నడిపించడానికి ఈ మాటలు చెబుతున్నారని పలువురు విమర్శిస్తున్నారు.
Tags:    

Similar News