తెలంగాణ ముఖ్యమంత్రి - టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కు చెక్ పెట్టేందుకు ఏకంగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ రంగంలోకి దిగారని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ - బీజేపీ దేశ ప్రజలను మోసం చేశాయి.. జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పును తీసుకొస్తా.. కాలం కలిసొస్తే థర్డ్ ఫ్రంట్ కు నాయకత్వం వహిస్తా.. అద్భుతాలు చేసి చూపిస్తా’ అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం..ఈ. మేరకు ఒకట్రెండు పార్టీలతో చర్చలు జరపడం తెలిసిన సంగతే. ఈ నేపథ్యంలో ఆయనకు చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ రంగంలోకి దిగారని అంటున్నారు.
ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరపరాజయం పాలైన సమాజ్ వాది పార్టీ ఏడాది తిరగకుండానే లోక్ సభ ఉప ఎన్నికల్లో భారీ విజయాలు నమోదు చేయడంతో వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి బీజేపీని ఓడించేందుకు మహాకూటమి ఏర్పడవచ్చన్న ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి. ఉప ఎన్నికల ఫలితాలు మహా కూటమి ఏర్పాటుకు ప్రతిపక్ష పార్టీల్లో నైతిక స్థయిర్యాన్ని కల్పించాయని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)ఎంపీ మజీద్ మెమన్ పేర్కొన్నారు. మహాకూటమి ఏర్పాటుకు కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ - ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ ఇప్పటికే చర్చలు ప్రారంభించారని ఆయన వెల్లడించారు. మరోవైపు రాహుల్ గాంధీ బుధవారం రాత్రి ఎన్సీపీ నాయకుడు శరద్ పవార్ ను ఆయన ఇంటికి వెళ్లి కలుసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఐక్యంగా గట్టిపోటీనివ్వాలని ఇద్దరు నేతలు చర్చించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ నెల 28న శరద్ పవార్ నిర్వహించనున్న ప్రతిపక్ష పార్టీల సమావేశానికి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కూడా హాజరవుతారని భావిస్తున్నారు.
తద్వారా కేసీఆర్ కు మద్దతు ఇచ్చిన నేతల్లో ముఖ్యులు అయిన మమతాబెనర్జీ - శరద్ పవార్ కు ఆదిలోనే బ్రేకులు వేసేందుకు కాంగ్రెస్ పెద్దలు సీరియస్‌గా ఎంట్రీ ఇచ్చారని అంటున్నారు దీనిపై కేసీఆర్ స్పందన ఎలా ఉంటుందోనని వారు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.