టీఆర్ఎస్‌లో టికెట్ల లొల్లి..స్పీక‌ర్ సంచ‌ల‌న స‌వాల్‌

Update: 2018-05-13 08:35 GMT
తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీలో క‌ల‌క‌లం చోటుచేసుకుంది. పార్టీకి చెందిన సీనియ‌ర్ నేత‌ల మ‌ధ్య 2019 ఎన్నిక‌ల్లో పోటీ చేసే అంశం  చిచ్చుపెట్టింది. ఒక‌రిని మించి మ‌రొక‌రు కామెంట్లు చేస్తుండ‌టంతో....గులాబీ నేత‌లు గంద‌రగోళానికి గుర‌వెతున్నారు. ఇలాంటి ర‌చ్చ‌కు వేదిక అయింది టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు అచ్చి వ‌చ్చిన వ‌రంగ‌ల్ జిల్లాలో కావ‌డం గ‌మ‌నార్హం. పార్టీకి చెందిన ఈ సీనియ‌ర్లే స్పీక‌ర్ మ‌ధుసూధ‌నాచారి, ఫైర్ బ్రాండ్ నాయ‌కురాలిగా పేరున్న ఎమ్మెల్యే కొండాసురేఖ‌. ఈ ఇద్ద‌రు నేత‌ల మాట‌ల యుద్ధానికి వేదిక‌గా నిలిచింది జయశంకర్ భుపాలపల్లి జిల్లా భూపాలపల్లి నియోజకవర్గం. కొండాసురేఖ ఇటీవల అక్కడ పర్యటించిన సమయంలో,, స్పీకర్ పై పరోక్షంగా విమర్శలు చేశారు. దీనిపై స్పీక‌ర్ సైతం ఘాటుగా రియాక్ట‌య్యారు.

వ‌రంగ‌ల్ జిల్లాలో బ‌ల‌మైన నేత‌లుగా ఉన్న  కొండా దంప‌తులు టీఆర్ఎస్ పార్టీలో ప‌ట్టుకోసం ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ కూతురిని బ‌రిలో దింపాల‌ని చూస్తున్నారు. అందుకే అధిష్టానాన్ని 2019 ఎన్నిక‌ల్లో రెండు టికెట్లు అడిగామ‌ని పార్టీ నేత‌ల‌కు చెప్తున్నారు. అయితే ఇదే స‌మ‌యంలో ఆమెకు ఓ నియోజ‌క‌వ‌ర్గం కూడా వెతికే ప‌నిలో ప‌డ్డారు. ఇందులో భాగంగా రాష్ట్ర స్పీక‌ర్ సిరికొండ మ‌ధుసూధ‌నాచారి నియోజ‌క‌వ‌ర్గంపై కొండా దంప‌తులు క‌న్నేసిన‌ట్టు స‌మాచారం. దీన్ని నిజం చేస్తూ తాజాగా అక్క‌డ కొండా సురేఖ ప‌ర్య‌టించారు. ఈ క్ర‌మంలోనే స్పీక‌ర్ ప‌నితీరు, ఆయ‌న రాజ‌కీయాలు న‌డుపుతున్న తీరుపై కామెంట్లు చేశారు. నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధి జ‌ర‌గ‌నేలేద‌ని, రాబోయే రోజుల్లో తాము గెలిచి మెరుగైన పాల‌న‌ను అందిస్తామ‌ని సురేఖ ప్ర‌క‌టించారు.

దీంతో ఈ ప‌రిణామంపై స్పీక‌ర్ స్పందించారు. ప‌ల్లె నిద్ర‌లో భాగంగా స్పీకర్ మధుసూదనాచారి నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌ర్య‌టిస్తూ ఘాటు స‌వాల్ విసిరారు. ప‌ల్లెల్లో ఉన్న సమస్యలన్నీ ఒక్కొక్కటిగా పరిష్కరిస్తానని, ప్రజల్లో ఉంటేనే సమస్యలు తెలుస్తాయని అన్నారు. ఈ ప్రాంతంలో విద్యా - వైద్యం ప‌రంగా మ‌రిన్ని కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. ఇక పార్టీ నేత‌ల కామెంట్ల‌ను ప్ర‌స్తావిస్తూ  భూపాలపల్లిలో తనను ఓడించిన వాళ్లకు స్వర్ణకంకణధారణ చేయించి పాలతో అభిషేకం చేస్తానంటూ హాట్ కామెంట్స్ చేశారు . నియోజకవర్గంలో కొన్ని గ్రామాల పేర్లు కూడా తెలియని వారు మాట్లాడ్డం విడ్డూరంగా ఉందని మధుసూదనాచారి ఎద్దేవా చేశారు.

కాగా, ఎన్నికలకు ముందే సీటు విషయంలో లొల్లి మొదలైందని పార్టీలో చ‌ర్చ జ‌రుగుతోంది. మ‌రోవైపు గ‌తంలో జ‌రిగిన సింగ‌రేణి ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ అనుబంధ సంస్ధ ఓడిపోవ‌డంతో స్పీక‌ర్ పై అధిష్టానం న‌మ్మ‌కం కోల్పోయిందని చ‌ర్చే కూడా ఉంది. ఇదే మంచి టైమ్ అనుకున్న కొండా దంప‌తులు ఈ నియోజ‌క‌ర్గంపై క‌న్నేసిన‌ట్లు స‌మాచారం. అయితే...పార్టీ అంత‌ర్గ‌త రాజ‌కీయం నుంచి బ‌హిరంగ స‌వాళ్లు విసిరే వ‌ర‌కు ప‌రిస్థితి చేరిన‌ప్ప‌టికీ...సీఎం కేసీఆర్ స్పందించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News