తిరుప‌తి బంధువులు మంబయిలో ఎక్క‌డున్నారంటే?

Update: 2018-02-28 08:08 GMT
శ్రీ‌దేవికి తిరుప‌తికి ఉన్న అనుబంధం గురించి తెలిసిందే. ఆమె త‌ల్లిది.. ద‌గ్గ‌ర బంధువులు చాలామంది తిరుప‌తిలోనే ఉన్నారు. శ్రీ‌దేవి మ‌ర‌ణ వార్త విన్న వెంట‌నే వారంతా ముంబ‌యికి ప‌య‌న‌మ‌య్యారు. అయితే.. ఆమె రాక అనుకున్న‌ట్లు కాకుండా దాదాపు మూడు రోజులు ప‌ట్టిన విష‌యం తెలిసిందే.

మ‌రి.. ముంబ‌యిలో వీరు ఎక్క‌డ ఉన్నారు?  ఎవ‌రింట్లో వీరు స్టే చేశారు? అన్న సందేహం రాక మాన‌దు. ఈ విష‌యం మీద ఫోక‌స్ చేస్తే.. తిరుప‌తి నుంచి ముంబ‌యికి చేరుకున్న శ్రీ‌దేవి తిరుప‌తి బంధువులంతా బోనీక‌పూర్ సోద‌రుడైన అనిల్ క‌పూర్ ఇంట్లో బ‌స చేసిన‌ట్లుగా తెలుస్తోంది. దీంతో పాటు.. తాజ్ హోట‌ల్లో మ‌రో ఆరు గ‌దుల్ని తీసుకున్నారు. శ్రీ‌దేవికి ద‌గ్గ‌రి బంధువులైన ప‌లువురు ముంబ‌యి చేరుకున్నారు.

చెన్నై.. మ‌ధురై.. బెంగ‌ళూరు.. న్యూజిలాండ్ ల‌తో పాటు ప‌లు ప్రాంతాల నుంచి శ్రీ‌దేవి బంధువులు ముంబ‌యికి చేరుకున్నారు. వేర్వేరు ప్రాంతాల నుంచి ముంబ‌యికి చేరుకుంటున్న శ్రీ‌దేవి బంధువుల‌కు ఆమె సొంత చెల్లెలు శ్రీ‌ల‌త బ‌స ఏర్పాట్లు చూస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. ఆమె భ‌ర్త మాజీ ఎమ్మెల్యే సంజీవ‌య్య ద‌గ్గ‌రుండి శ్రీ‌దేవి అంత్య‌క్రియ‌ల ఏర్పాట్లను ప‌ర్య‌వేక్షిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. శ్రీ‌దేవికి సంబంధించిన విష‌యాల్ని ఆమె బంధువులు గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఎప్పుడు ఎక్క‌డ ఉన్నా.. శ్రీ‌దేవి ఆగ‌స్టు 13న మాత్రం తిరుప‌తికి త‌ప్ప‌నిస‌రిగా వ‌స్తార‌ని చెబుతారు. ఎందుకంటే ఆ రోజు శ్రీ‌దేవి పుట్టిన‌రోజు అని..  త‌న బ‌ర్త్ డే రోజున తిరుమ‌ల శ్రీ‌వారిని ద‌ర్శించుకోవ‌టం శ్రీ‌దేవికి ఇష్ట‌మ‌ని చెబుతారు.

ఇక‌.. తిరుప‌తిలోని తీర్థ‌క‌ట్ట వీధిలోని ఇంటి నెంబ‌రు 93కు ఒక ప్రాధాన్య‌త ఉంద‌ని చెబుతారు. ఈ ఇల్లు శ్రీ‌దేవి తాత‌గారి ఇల్లు.

ఆయ‌న పేరు వెంక‌ట‌స్వామిరెడ్డి.  ప్రైవేటు బ‌స్సులు ఆప‌రేట్ చేసుకునే ఆయ‌న.. న‌ర్సుగా ప‌ని చేసే వెంక‌ట ర‌త్న‌మ్మ‌ను పెళ్లి చేసుకున్నారు. వీరిద్ద‌రూ ఈ ఇంట్లోనే ఉన్నారు. వీరికి శ్రీ‌దేవి త‌ల్లి రాజేశ్వ‌రితో పాటు మ‌రో ముగ్గురు కుమార్తెలు.. ఇద్ద‌రు కుమారులు ఉన్నారు. వారంతా ఆ ఇంట్లోనే పెరిగారు. అందుకే.. శ్రీ‌దేవికి తిరుప‌తి అంటే చాలా ఇష్ట‌మ‌ని చెబుతారు.
Tags:    

Similar News