2011 ప్రపంచకప్ ఫిక్సింగ్ కేస్..సంగక్కరను విచారించిన పోలీసులు..అభిమానుల ఆందోళన!

Update: 2020-07-03 08:50 GMT
భారత్ వేదికగా జరిగిన 2011 ప్రపంచకప్ ఫైనల్లో శ్రీలంక కావాలనే ఓడిపోయిందని ఆ దేశ అప్పటి క్రీడా మంత్రి మహీంద నంద ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయన చేసిన ఆరోపణలను సీరియస్‌ గా తీసుకున్న లంక ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. పూర్తి స్థాయి విచారణ కోసం ప్రత్యేక దర్యాప్తు విభాగాన్ని ఏర్పాటు చేసింది.

ఈ కేసు దర్యాప్తులో భాగంగా గురువారం అప్పటి శ్రీలంక జట్టు కెప్టెన్ కుమార సంగక్కరను సుమారు 10 గంటల పాటు విచారించింది. ముఖ్యంగా ఫైనల్ మ్యాచ్‌ లో రెండు సార్లు టాస్ వేయడంపై గల కారణాలపై ఆరా తీసినట్లు సమాచారం. ఈ విచారణ తర్వాత మీడియాతో మాట్లాడిన సంగక్కర.. నిజనిజాలు త్వరలోనే వెలుగు చూస్తాయని చెప్పి వెళ్లిపోయాడు. అయితే , నిరాధారమైన ఆరోపణలతో విచారణ పేరిట క్రికెటర్లను వేధించడంపై శ్రీలంకలో నిరసనలు మొదలయ్యాయి. సంగక్కరను విచారించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ యూత్ స్పోర్ట్స్ మినిస్ట్రీ కార్యలయం ముందు అభిమానులు పెద్ద సంఖ్యలో ఆందోళన చేపట్టారు.

ఇక శ్రీలంక ప్రతిపక్ష నేత సాజిత్ ప్రేమ్ దాసా క్రికెటర్ల పట్ల ప్రభుత్వం ప్రవర్తిస్తు తీరును తప్పుబట్టాడు. ట్విటర్ వేదికగా 2011 ప్రపంచకప్ ఆటగాళ్లకు మద్దతు తెలిపాడు. ‘మన 2011 ప్రపంచకప్ హీరోలను విచారణ పేరిట వేధించడాన్ని వ్యతిరేకించాలి. ప్రభుత్వ చర్యలు దారుణమైనవి'అని ట్వీట్ చేశాడు. ఇకపోతే ఈ దర్యాప్తు బృందం ఇప్పటికే 2011 వరల్డ్‌కప్‌కి టీమ్‌ను ఎంపిక చేసిన చీఫ్ సెలక్టర్ అరవింద డిసిల్వాను.. ఆ మ్యాచ్ ‌లో ఆడిన ఓపెనర్ ఉపుల్ తరంగాలను కూడా విచారించింది. ఇక మూడేళ్ల క్రితం శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ కూడా ఈ మ్యాచ్ ఫలితంపై సందేహం వ్యక్తం చేశాడు.
Tags:    

Similar News