పనామా పేపర్స్ మోటూరి బ్యాక్ గ్రౌండ్ ఇదే

Update: 2016-04-07 04:51 GMT
ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పనామా పేపర్స్ ఇష్యూలో తాజాగా ముగ్గురు తెలుగువాళ్ల పేర్లు బయటకు రావటం తెలిసిందే. ఈ భారీ కుంభకోణంలో 500 మంది వరకూ భారతీయులు ఉన్నట్లు తేల్చిన సంగతి తెలిసిందే. అయితే..500 మంది భారతీయుల్లో తెలుగు వారు లేరా? అన్న సందేహానికి తెర దించుతూ.. ముగ్గురు తెలుగువాళ్లు ఉన్నట్లు తేలటంతోపాటు.. వారి పేర్లు బయటకు వచ్చాయి. ఇలా వచ్చిన వారిలో మోటూరు శ్రీనివాస్ ప్రసాద్ కు సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ వివరాలు బయటకు వచ్చాయి. పెద్ద పేరు ప్రఖ్యాతులు లేని ఇతగాడి పేరు పనామా పేపర్స్ లో ఉండటం సంచలనంగా మారింది. ఇక.. మోటూరు శ్రీనివాస ప్రసాద్ వివరాల్లోకి వెళితే.. ఇతగాడిది ఏపీలోని విశాఖపట్నంగా తేల్చారు.

గతంలో అక్రమ వ్యాపారం చేసి పోలీసులకు పట్టుబడటమేకాదు.. జైలుకు కూడా వెళ్లిన ఘన చరిత్ర ఉందని తెలుస్తోంది. అనంతరం బయటకు వచ్చిన ఆయన ఎక్కడు ఉన్నారో? ఏం చేస్తున్నారన్న దానిపై స్పష్టత లేదు. తాజాగా పనామా పేపర్స్ లో పేరు బయటకు రావటంతో అతనేం అయ్యారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

2006లో విశాఖ సమీపంలోని దువ్వాడలోని విశాఖ స్పెషల్ ఎకనామిక్ జోన్ లో ‘‘వీఎస్ ఈజెడ్’’ పేరిట ఒక సంస్థను స్టార్ట్ చేశారు. ఈ సంస్థ ద్వారా బయోడీజిల్ ను విదేశాలకు ఎగుమతి చేసే వారు. అయితే.. నిబంధనలకు విరుద్ధంగా బయోడీజిల్ ను ఉత్పత్తి చేయటం కాకుండా.. అమెరికా నుంచి దిగుమతి చేసుకొని యూరోపియన్ దేశాలకు ఎగుమతి చేసేవారు. అతగాడి వ్యాపారం మీద పలు విమర్శలు.. ఆరోపణలు రావటంతో అధికారులు దృష్టి సారించి అతగాడి భాగోతాన్ని బయటపెట్టారు.

నిబంధనలకు విరుద్ధంగా లైసెన్స్ పొందటమే కాదు..అమెరికా నుంచి ఏకంగా 19,300 టన్నుల బయో డీజిల్ ను అక్రమంగా ఎగుమతి చేసినట్లుగా గుర్తించి కేసు నమోదుచేశారు.  2012 ఏప్రిల్ 2న అతడ్ని అరెస్ట్ చేశారు. అనంతరం జైలు నుంచి బయటకు వచ్చారు. ఆ తర్వాత ఆయనేం అయ్యారో ఎవరికి తెలీని పరిస్థితి. ఇది జరిగిన తర్వాత తాజాగా పనామా పేపర్స్ లో ఆయన పేరు బయటకు రావటంతో.. మోటూరు శ్రీనివాస్ ప్రసాద్ ఏమయ్యారన్నది ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నట్లు? ఏం చేస్తున్నట్లు..?
Tags:    

Similar News