మాజీ సీఎంగారు క‌బ్జాలు చేయ‌ద్ద‌న్నారు

Update: 2016-08-06 11:03 GMT
ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనేందుకు జాతీయ పార్టీలైన బీజేపీ & కాంగ్రెస్‌ లు చాలా ముందుగానే సమాయత్తమవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని అధికార సమాజ్‌ వాదీ పార్టీ కూడా స‌న్న‌ద్ద‌మ‌వుతోంది. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు రెడీ కావాలని పార్టీనేతలు - కార్యకర్తలకు ఎస్‌ పి అధినేత ములాయం సింగ్ యాదవ్ పిలుపునిచ్చారు.  ఈ సంద‌ర్భంగా ఆయ‌న భూక‌బ్జాల‌పై ఆస‌క్తిక‌రంగా మాట్లాడారు. భూ ఆక్రమణలకు ఇతర అనుచిత కార్యక్రమాలకు స్వస్తిపలకాలని హెచ్చరిక స్వరంతో ములాయం విజ్ఞప్తి చేశారు.

ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌ లో మళ్లీ అధికారంలోకి రావాలంటే అన్నిరకాలగానూ దిద్దుబాటు చర్యలు చేపట్టాలని, తప్పులను సరిదిద్దుకోవాలని ములాయం పిలుపునిచ్చారు. ‘మీ లోపాలను సరిదిద్దుకోగలుగుతారా? భూ ఆక్రమణలను ఆపగలుగుతారా? వీటి అన్నింటినీ నిరోధిస్తేనే మళ్లీ అధికారం మనది అవుతుంది’ అని ములాయం పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను ప్ర‌శ్నించారు. డబ్బులు సంపాదించాలంటే భూ ఆక్రమణలే మార్గం కాదని అందుకు ఇతరాత్రా అనేక మార్గాలున్నాయని కార్యకర్తలకు చెప్పారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రజలకు సన్నిహితమయ్యే పనులు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

పార్టీ నేత జ్ఞానేశ్వర్ మిశ్రా 84వ జయంతి సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో ములాయం మాట్లాడారు. పార్టీలకు కొత్తగా వచ్చిన కార్యకర్తలకు సామ్యవాదం అంటే తెలియదన్నారు. వారికి శిక్షణ ఇవ్వాలంటూ ముఖ్యమంత్రి అఖిలేష్‌ ను అనేక సార్లు కోరానని అయితే తన మాటను ఎవరూ పట్టించుకోలేదని ములాయం ఆవేదన చెందారు.

రాజకీయాలు అంత సులభం కాదని ఇందులో రాణించాలంటే కార్యకర్తలకు శిక్షణ అవసరమని ములాయం తెలిపారు. దేశంలోనే యూపీ అతిపెద్ద రాష్ట్రం కాబట్టి ఈ రాష్ట్రం ఎన్నికల గురించి ఢిల్లీలో చర్చించుకుంటున్నారని అటు కాంగ్రెస్ ఇటు బీజేపీలు రాష్ట్రంలో అధికారం హస్తగతం చేసుకునేందుకు నువ్వానేనా అన్నట్టు దూసుకొస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈనేపథ్యంలో యువకులు, రైతులకు పార్టీలో ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యంగా మహిళల ప్రమేయం పెంచాలని ములాయం కోరారు.
Tags:    

Similar News