చిన్నమ్మ స్కెచ్ దిమ్మతిరిగేలా ఉందే!

Update: 2016-12-30 19:30 GMT
అమ్మగా తమిళుల మనసుల్లో నిలిచిపోయిన దివంగత ముఖ్యమంత్రి జయలలిత తరువాత అన్నాడీఎంకే పార్టీలో ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది. జయ నమ్మినబంటు పన్నీర్‌ సెల్వం ముఖ్యమంత్రి పదవిని అధిరోహించారు. ఆమె నెచ్చెలి శశికళ పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలను స్వీకరించడమే కాక, సీఎం పీఠాన్ని కూడా కైవసం చేసుకోవాలని ఎత్తులు వేస్తున్నారని అంటున్నారు. ఈ క్రమంలో - పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం ద్వారా తన లక్ష్యంలో సగం విజయం సాధించారు.  ఇక సీఎం కూర్చీలో కూర్చోవడమే ఆమె ఏకైక లక్ష్యం అంటున్నారు. పార్టీ అధినేత్రిగా పగ్గాలు చేపట్టే క్రమంలో శశికళ వర్గం అనేక జాగ్రత్తలు తీసుకుందని సమాచారం.

అన్నాడీఎంకే పార్టీ సర్వసభ్య సమావేశంలో శశికళకు ఇబ్బంది కలిగేలా కొంచెం కూడా వ్యతిరేకత కనపడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ భేటీకి 2200 మందిని మాత్రమే ఆహ్వానించారు. శశికళపై వ్యతిరేకత ఉన్నవారికి ఆహ్వానం అందలేదు. వారిని పార్టీ కార్యాలయంలోకి ప్రవేశించకుండా అడ్డుకున్నారు. కేవలం ఇన్విటేషన్‌ ఉన్న వారు పార్టీ కార్యాలయంలోకి వచ్చేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. సమావేశం వేదికపై జయలలిత కోసం ప్రత్యేక కుర్చీని ఏర్పాటు చేశారు. దారి పొడవునా జయలలిత - శశికళ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ చేస్తానని ఎంపీ శశికళ పుష్ప ప్రకటించడంతో శశికళ వర్గం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. బుధవారం పార్టీ కార్యాలయానికి వచ్చిన శశికళ పుష్ప భర్త లింగేశ్వరన్‌ తిలకన్‌ పై శశి వర్గం తీవ్రంగా దాడి చేసింది. రక్తం వచ్చేలా కొట్టి, బయటకు తరిమేసింది. ఈ వ్యవహారంతో, తమ వ్యతిరేక వర్గాలను భయభ్రాంతులకు గురి చేసింది శశి వర్గం. సర్వసభ్య సమావేశం సందర్భంగా కూడా కొంత మేర వాడిగా వేడిగా సమావేశం జరిగినట్టు సమాచారం. అయినప్పటికీ, శశికళ పార్టీ అధినేత్రిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇలా ఎక్కడా పోటీ లేకుండా అంతా ప్రణాళిక బద్దంగా చిన్నమ్మ ముందుకుసాగింది.

ఇదిలాఉండగా అన్నాడీఎంకేలో నెలకొన్న లుకలుకలు బయటపడుతున్నాయి. అన్నా డీఎంకే పార్టీ నుంచి వైదొలుగుతున్నానని ప్రముఖ నటుడు ఆనంద్‌ రాజ్‌ ప్రకటించారు. పార్టీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ఏమాత్రం బాగోలేవని ఈ సందర్భంగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దివంగత జయలలితకు పార్టీ నేతలు సరైన గౌరవం ఇవ్వడం లేదని, ఆమెతో ఇతరులను పోల్చడం సరి కాదని అన్నారు. మంత్రులు వ్యవహరిస్తున్న తీరు కూడా బాధాకరంగా ఉందని, జయ గౌరవాన్ని దెబ్బ తీసే విధంగా వారు వ్యవహరిస్తున్నారని, ఇలాంటి చర్యలను వారు మానుకోవాలని చెప్పారు. గురువారం జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశానికి తనను ఆహ్వానించలేదని విమర్శించారు. డీఎంకే అధినేత కరుణానిధితో సమావేశమయ్యే అవకాశం వస్తే తప్పకుండా భేటీ అవుతానని చెప్పారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News