కేసీఆర్ పై సెంటిమెంట్ లేఖాస్త్రం

Update: 2016-04-25 04:15 GMT
రాజకీయాల్లో ఉండకూడని వాటిల్లో ముఖ్యమైంది అహంకారం. దానికి మించిన లోపం మరోటి ఉండదు. అదే సమయంలో అణుకువగా ఉండటం ఆభరణంగా ఉంటుంది. చెట్టంత ఇంటి పెద్దను పోగొట్టుకొని అటు వ్యక్తిగతంగా.. ఇటు రాజకీయంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఒక రాజకీయ కుటుంబం బలహీనంగా మారటం ఇబ్బందికరమే. ఇలాంటి సందర్భాల్లో విపరీతమైన ఒత్తిడితో పాటు.. రాజకీయంగా బలహీనపర్చాలని ప్రయత్నించే ప్రత్యర్థులకు కొదవ ఉండదు. ఇలాంటి సందర్భాల్లో మానసికంగా ఎంత బలంగా ఉంటారన్నదే కీలకంగా మారుతుంది.

మొన్నటివరకూ ఇంటిపెద్ద కారణంగా ధీమాగా ఉన్న కుటుంబం కాస్తా.. కాలానికి చిక్కి పుట్టెడు విషాదం ముంచెత్తే వేళలో సంయమనానికి మించిన మందు మరొకటి ఉండదు. ఇలాంటి వైఖరికి ప్రజామోదం లభిస్తుంది. అందుకేనేమో.. పోరాటం కంటే కూడా పెద్దరికంగా వ్యవహరించే వైఖరిని అనుసరిస్తున్న తెలంగాణ కాంగ్రెస్.. మొన్నటివరకూ ఖమ్మం జిల్లాలో తమకు పెద్ద దిక్కుగా ఉన్న దివంగత రాంరెడ్డి వెంకటరెడ్డి మరణం తర్వాత వేస్తున్న ఎత్తులు వ్యూహాత్మకంగా ఉన్నాయనే చెప్పాలి.

మాజీ మంత్రి.. కాంగ్రెస్ సీనియర్ నేత రాంరెడ్డి వెంకటరెడ్డి మరణంతో ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. గతంలో అనుసరించిన సంప్రదాయాలకు భిన్నంగా ప్రతి ఉప ఎన్నికలోనూ పోటీ చేస్తున్న తెలంగాణ అధికారపక్ష వైఖరికి తగ్గట్లే ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. పాలేరు ఉప ఎన్నిక సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే తెలంగాణ అధికారపక్షం తమ అభ్యర్థిని ప్రకటించింది. ఆ ప్రకటనతో ఉప ఎన్నిక ఏకగ్రీవం కాదన్న విషయాన్ని కేసీఆర్ తన చేతలతో చెప్పేశారు. దీంతో.. భావోద్వేగంతో ఉప ఎన్నికను ఏకగ్రీవం చేసుకోవాలని భావించిన కాంగ్రెస్ ను తెలివిగా దెబ్బ తీశారు.

కేసీఆర్ దూకుడిని గుర్తించిన కాంగ్రెస్.. తన అనుభవం మొత్తాన్ని రంగరించి పాలేరు ఉప ఎన్నికల్లో అడుగులు వేస్తున్నట్లుగా తాజా పరిణామాలు చూస్తే ఇట్టే అర్థమవుతుంది. కేసీఆర్ ధీటుగా వ్యూహాన్ని సిద్ధం చేసి.. తాజా ఉప ఎన్నికలో కేసీఆర్ ను దెబ్బ తీయాలని కాంగ్రెస్ పట్టుదలగా ఉంది. ఇందులో భాగంగా తొలుత విపక్షాలన్ని ఏకం చేసే పనిలో పడ్డ కాంగ్రెస్ అందులో విజయం సాధించింది. అనంతరం.. దివంగత వెంకటరెడ్డి  సతీమణిని ఉప ఎన్నిక బరిలోకి దించటం ద్వారా సెంటిమంట్ ను మరింత పెంచే ప్రయత్నం చేశారు.

ఎప్పుడూ లేనిది ఈ పాలేరు ఉప ఎన్నిక మీద కాంగ్రెస్ ఇంత పట్టుదలగా ఉండటానికి కారణం లేకపోలేదు. ఓపక్క కేసీఆర్ షురూ చేసిన ఆపరేషన్ ఆకర్ష్ కు తాత్కాలికంగా అయినా చెక్ చెప్పటానికి.. తనకు తిరుగులేదన్న ధోరణిని ప్రదర్శిస్తున్న కేసీఆర్ గర్వభంగం తాజా ఉప ఎన్నిక ద్వారా చేయాలన్నది తెలంగాణ కాంగ్రెస్ ఆలోచన. వెంకటరెడ్డి లాంటి బలమైన నేత మరణంతో సానుభూతి వెల్లువెత్తుతుందని.. ఆయన కుటుంబానికి అండగా నియోజకవర్గ ప్రజలు ఉంటారన్న నమ్మమే కాంగ్రెస్ ను మరింత పట్టుదలతో ప్రయత్నించేలా చేస్తోంది.

ఇందులో భాగంగా ప్రధాన రాజకీయ పార్టీలు ఉప ఎన్నికల బరిలో దిగకుండా జాగ్రత్త పడిన కాంగ్రెస్.. ఇప్పుడు సెంటిమెంట్ ను రాజేసే ప్రయత్నం మొదలెట్టింది. వెంకటరెడ్డి సతీమణి సుచరిత చేత తెలంగాణ ముఖ్యమంత్రి.. టీఆర్ ఎస్ అధినేత అయిన కేసీఆర్ కు లేఖ రాయటం ఇందులో భాగమేనని చెప్పాలి. ఖమ్మం జిల్లాకు తన భర్త చేసిన సేవల్ని దృష్టిలో ఉంచుకొని ఉప ఎన్నిక పోటీ నుంచి టీఆర్ ఎస్ అభ్యర్థిని విరమించే ప్రయత్నం చేయాలని ఆమె లేఖలో కోరారు.

సుచరిత లేఖ రాసినంతనే కేసీఆర్ తమ అభ్యర్ధిని బరి నుంచి తప్పించే అవకాశం లేనప్పటికీ.. భర్తను కోల్పోయిన భార్య.. నిస్సహాయంతో చేసుకున్న వినతి సానుభూతి సృష్టించటం ఖాయం. అదే జరిగితే.. ఎన్నికల ఫలితం మీద ప్రభావం చూపే అవకాశం ఉంది. సిట్టింగ్ నేత అకాల మరణం చోటు చేసుకున్నప్పుడు ఉప ఎన్నికను ఏకగ్రీవం చేసుకోవటం తెలుగు రాజకీయాల్లో కొత్తేం కాదు. అందుకు భిన్నంగా వ్యవహరించటం అసంతృప్తి వ్యక్తమయ్యేలా చేస్తోంది. బలమైన రాజకీయ ప్రత్యర్థులు ఎవరూ ఉండకూదన్న రీతిలో కేసీఆర్ అనుసరిస్తున్న వైఖరిపై ఇప్పటికే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అనుకోని విషాదం చోటుచేసుకున్న వేళ.. అందులోనూ రాజకీయ లబ్థిని వెతకటం లాంటివి ఆగ్రహానికి గురి చేసే అవకాశం ఉంది. ఇప్పుడు అలాంటిదే కేసీఆర్ గర్వభంగంగా మారుతుందని తెలంగాణ కాంగ్రెస్ ఆశిస్తోంది. మరి.. వారు నమ్ముకున్న సెంటిమెంట్ ఎంతవరకు సఫలమవుతుందో చూడాలి.
Tags:    

Similar News