పరువు హత్యల్లో దోషులకు ఏ శిక్షలంటే..?

Update: 2018-09-17 05:10 GMT
మిర్యాల గూడలో ప్రణయ్ పరువు హత్య తర్వాత తెలుగు రాష్ట్రాల్లో దీనిపైనే చర్చ.. ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి ఓ నిండు ప్రాణం బలైపోయింది. కులాల కట్టుబాట్లతో ఓ జీవితం అర్థాంతరంగా ముగిసిపోయింది దీనిపై ఇంటా బయటా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పరువు హత్యలపై అప్పట్లో సుప్రీం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. అత్యంత హేయమైన, అనాగరికమైన ఈ పరువు హత్యలు చేసిన వారికి ఉరిశిక్షే సరైందని తీర్పునిచ్చింది..

అప్పట్లో ఢిల్లీకి చెందిన భగవాన్ దాస్ తన కుమార్తె తన ఇష్టానికి వ్యతిరేకంగా మేనమామ కొడుకును పెళ్లి చేసుకుందని కక్ష పెంచుకొని సొంత కూతురినే దారుణంగా హతమార్చాడు. ఈ కేసును విచారించిన సుప్రీం కోర్టు పరువు హత్యలపై కీలక వ్యాఖ్యలు చేసింది. తమ పరువు పోయిందని తెలిస్తే తమ కూతురు/కొడుకుతో శాశ్వత సామాజిక సంబంధాలను తెంచేసుకోవాలి.. కానీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదని స్పష్టం చేసింది. హింసాత్మక చర్యలు పాల్పడే వారికి ఉరిశిక్షే సరైన శిక్ష అని తేల్చి చెప్పింది. అంతేకాదు.. పరువు హత్యలను అత్యంత అరుదైన కేసులుగా గుర్తించి దోషులకు ఉరిశిక్ష విధించాలని హైకోర్టులకు స్పష్టం చేసింది. ఈ మేరకు దేశంలోని అన్ని కోర్టులు ఇప్పుడు పరువు హత్యలకు ఉరిశిక్షను ఖరారు చేస్తున్నాయి.

సుప్రీం కోర్టు ఆదేశాల తర్వాత ఢిల్లీలో షియా వర్గానికి చెందిన ఓ యువతి.. సున్నీ  వర్గానికి చెందిన యువకుడిని పెళ్లి చేసుకుంది. దీంతో యువతి సోదరులు.. ఆ యువకుడి తమ్ముడిని హత్య చేశారు. 2008లో జరిగిన ఈ హత్య కేసులో విచారించిన ఢీల్లీ కోర్టు పరువు హత్యలు చేశారని.. యువతి కుటుంబ సభ్యులు ఐదుగురికి మరణశిక్ష విధించడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఇప్పుడు మిర్యాల గూడలో  ప్రణయ్ ను చంపిన మారుతీరావుకు కూడా ఉరిశిక్ష పడుతుందని అంచనావేస్తున్నారు.
Tags:    

Similar News