సాయం చేసే వారికి నో పోలీస్‌ రిస్క్‌

Update: 2015-06-12 07:41 GMT
మానవతాదృక్ఫధంతో సాయం చేయబోయి.. లేనిపోని తలనొప్పులు తెచ్చుకోవటం తరచూ చోటు చేసుకుంటూ ఉంటుంది. ఇకపై అలాంటిదేమీ లేకుండా ఉండేలా కేంద్రం విప్లవాత్మకమైన ఒక మార్పును తీసుకురానుంది.

రోడ్డు మీద ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు.. ప్రమాదానికి గురైన వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించటం ఒక ప్రయాస అయితే.. ఆసుపత్రి వారిని ఒప్పించి ట్రీట్‌మెంట్‌ ఇప్పించేసరికి తల ప్రాణం తోకకు వస్తుంది. ఇంత సాయం చేసిన దానికి అభినందించటం తర్వాత.. వారిని పట్టుకొని నానా ప్రశ్నలు వేసి.. సాయం చేయాలంటేనే భయపడేటట్లు చేస్తుంటారు.

ఇలాంటి అంశాలపై కేంద్రం దృష్టి సారించింది. అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఆధారంగా చేసుకొని సాయం చేసిన వారిని ఆదుకోవటంతో పాటు.. వారికి పూర్తి భరోసా ఇచ్చేలా సరికొత్త మార్పులు తీసుకొస్తున్నారు.

దీని ప్రకారం.. ప్రమాదానికి గురైన సమయంలో ఎవరినైనా ఆసుపత్రికి తీసుకొచ్చి సాయం చేసిన వారిపై ఎలాంటి పోలీసు వేధింపులు ఉండవు. ఆసుపత్రికి వచ్చి ప్రమాదానికి గురైన వారిని జాయిన్‌ చేసి తమ దారిన తాము పోవచ్చు. సాయంగా నిలిచిన వారిని ఎవరూ ఏమీ అడగరు. విప్లవాత్మకమైన ఈ మార్పు అందుబాటులోకి వస్తే.. ప్రమాదానికి గురయ్యే వారికి ఎంతో ఆదరవుగా నిలుస్తుందని చెబుతున్నారు.

Tags:    

Similar News