ఏపీ గ‌వ‌ర్న‌ర్ సుష్మా.. ఈ వార్త ఎలా పుట్టిందో తెలుసా?

Update: 2019-06-11 04:46 GMT
సోమ‌వారం ఉద‌యం నుంచి రెండు తెలుగు రాష్ట్రాల‌కు కొత్త గ‌వ‌ర్న‌ర్లు వ‌స్తార‌న్న ప్రచారం ఊపందుకుంది. దీనికి త‌గ్గ‌ట్లే.. ఆదివారం సాయంత్రం తిరుప‌తిలో ప్ర‌ధాని మోడీని క‌లిసిన రెండు తెలుగు రాష్ట్రాల గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్.. సోమ‌వారం ఉద‌యం అయ్యేస‌రికి ఢిల్లీలో ప్ర‌త్య‌క్షం కావ‌టం.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ కావ‌టంతో ఏదో జ‌రుగుతుంద‌న్న భావ‌న క‌లిగింది.

ఇంత‌లోనే.. ఏపీకి సుష్మా స్వరాజ్ ను గ‌వ‌ర్న‌ర్ గా ఎంపిక చేశారంటూ వార్త ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. జాతీయ మీడియా మొద‌లు.. ప్రాంతీయ మీడియాలోనూ ఈ వార్త‌ను ప్ర‌ముఖంగా చూపించారు. బ్రేకింగుల మీద బ్రేకింగులు వేశారు. వామ్మో.. ఇదెక్క‌డ గొడ‌వ‌రా అన్న‌ట్లు సుష్మ సైతం చివ‌ర‌కు ట్విట్ట‌ర్ లో స్పందించారు.

తానేదో మ‌ర్యాద‌పూర్వ‌కంగా ఉప రాష్ట్రప‌తి వెంక‌య్య‌నాయుడ్ని క‌లిస్తే.. దానికి ఇలాంటి వాద‌న‌లు పుట్టిస్తారా? అన్న‌ట్లుగా ఆమె వ్యాఖ్యానించారు. తాను ఏపీకి గ‌వ‌ర్న‌ర్ గా నియ‌మితులైన‌ట్లు వ‌స్తున్న వార్త‌ల‌న్ని అబ‌ద్ధాలంటూ సుష్మ కొట్టిపారేశారు.

నిప్పు లేనిదే పొగ‌రాదు. అందునా.. ఏపీకి సుష్మ‌నే గ‌వ‌ర్న‌ర్ ఎందుకంత ప్ర‌చారం జ‌రిగింద‌న్న‌ది లోతుగా చూస్తే.. ఈ త‌ప్పుడు వ్యాప్తికి కార‌ణంగా కేంద్ర‌మంత్రి ఒక‌రు చేసిన పొర‌పాటు ట్వీట్ గా చెప్పాలి. కేంద్ర‌మంత్రి డాక్ట‌ర్ హ‌ర్ష‌వ‌ర్ద‌న్ ఒక ట్వీట్ చేశారు. సుష్మ‌ను ఏపీకి గ‌వ‌ర్న‌ర్ గా నియ‌మించార‌ని.. ఆమెకు అభినంద‌న‌లు తెలుపుతూ ట్వీట్ చేశారు. వైర‌ల్ గా మారిన ఈ ట్వీట్ ను కాసేప‌టికే ఆయ‌న డిలీట్ చేశారు.

అయిన‌ప్ప‌టికీ.. ఇది ప‌లు మీడియా సంస్థ‌ల క‌ళ్ల‌ల్లో ప‌డ‌టంతో.. సుష్మ గ‌వ‌ర్న‌ర్ అయ్యారోచ్ అన్న వార్త‌ల ప‌రంప‌ర మొద‌లైంది. ఏపీకి గ‌వ‌ర్న‌ర్ గా ఎంపికైన సుష్మ‌.. ఉప‌రాష్ట్రప‌తి వెంక‌య్య‌ను క‌లిశార‌ని.. అదే స‌మ‌యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఉమ్మ‌డి రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్  భేటీ కావ‌టంతో ఈ వ్య‌వ‌హారం వైర‌ల్ గా మారింది. చివ‌ర‌కు సుష్మ రంగంలోకి దిగి.. క్లారిటీ ఇచ్చాన త‌ర్వాత కానీ ఈ వ్య‌వ‌హారం త‌ప్ప‌న్న‌ట్లుగా తేలిపోయింది. అయినా.. కేంద్ర విదేశాంగ మంత్రిగా వ్య‌వ‌హ‌రించిన సుష్మ‌.. ఒక రాష్ట్రానికి గ‌వ‌ర్న‌ర్ పోస్టు తీసుకుంటారా? అయితే. .ఉప రాష్ట్రప‌తి.. లేదంటే రాష్ట్రప‌తి కానీ.. గ‌వ‌ర్న‌ర్ గిరిలు తీసుకుంటారా ఏంటి?


Tags:    

Similar News