ఏపీ మంత్రి కంటే ఆ స్వామీజీకే పవర్ ఎక్కువట...?

Update: 2019-08-25 01:30 GMT
ప్రభుత్వం ఏదైనా కొన్ని అదృశ్య శక్తులు వెనుక నుండి నడిపిస్తూ ఉంటాయి. ఈ అదృశ్య శక్తుల ప్రభావం అన్నీ ప్రభుత్వాల మీద లేకపోయిన కొన్నిటి మీద ఖచ్చితంగా ఉంటుంది. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి అదృశ్య శక్తులు బాగానే పని చేస్తాయి. అయితే ఈ శక్తులకి మొత్తం ప్రభుత్వం మీద కాకపోయిన కొన్ని మంత్రిత్వ శాఖల్లో పూర్తి పట్టు ఉంటుంది. తాజాగా ఏపీ ప్రభుత్వంలో దేవాదాయ శాఖ మీద పవర్ మంత్రికంటే ఓ స్వామీజీకే ఎక్కువ ఉందన్న వార్త‌లు పొలిటిక‌ల్ వ‌ర్గాల్లో స‌ర్క్యులేట్ అవుతున్నాయి.  

ఆ స్వామీజీ ఎలా చెబితే అలాగే దేవాదాయ ఉద్యోగుల పోస్టింగులు- నామినేటెడ్ పదవుల పోస్టింగులు- కాంట్రాక్టులు జరుగుతున్నాయట. తాజాగా ఏపీలో ఓ ప్రముఖ దేవాలయానికి సంబంధించిన ఈవోని మార్చారు. ఆ ఈవో మంచిగా పనిచేసే వ్యక్తేనట. అయినా సరే కారణం ఏమి తెలియకుండా స్వామీజీ కరుణ ఉండటం వల్ల ఆ ఈవో ప్లేసులోకి కొత్త ఈవో వచ్చారు. అయితే కొత్త ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి దేవాదాయ శాఖలో జరిగిన బదిలీలు- మార్పులు మరో శాఖలోనే కాదు మొత్తం ప్రభుత్వంలోనే జరగలేదట.

అది కూడా స్వామీజీ ఆశీస్సులు ఉన్నవారి కోసమే బదిలీలు జరిగినట్లు తెలుస్తోంది. రాష్ట్రం మొత్తం మీద పోస్టింగులు ఎక్కడ ఉన్నమంత్రి కంటే స్వామీజీని ప్రసన్నం చేసుకుంటే చాలట. వారికి ఖచ్చితంగా పని అయ్యేదట. ఆ స్వామీజీ దెబ్బకు దేవాదాయ శాఖలో ఎమ్మెల్యేలు- మంత్రుల సిఫార్సులు కూడా పనికిరాలేదని తెలిసింది. పోనీ ఏదైనా పోస్టుకి గానీ, కీలకమైన పదవులకు వీరు సిఫార్సులు చేసిన, అప్పటికే స్వామీజీ అండ ఉన్నవారు ఆ పోస్టుల్లో వచ్చి ఉన్నారట.  

దీంతో వైసీపీ ఎమ్మెల్యేలు- మంత్రులు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. మొత్తం మీద దేవాదాయ శాఖకు ఆ స్వామీజీ అనధికార మంత్రిగా పని చేస్తూ ప్రభుత్వంలో కీలకంగా మారారని చెబుతున్నారు.. అటు మిగతా శాఖల్లో కూడా ఒకే సామాజికవర్గానికి చెందిన వ్యక్తులు షాడో మంత్రులుగా పని చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. కానీ దేవాదాయ శాఖలో మాత్రం స్వామీజీదే పెత్తనమట. మొత్తానికి దేవాదాయ శాఖలో ఏం కావాలన్న స్వామీజీ ఆశీస్సులు ఉండాలన్న‌మాట.
Tags:    

Similar News