కేసీఆర్ కు థాంక్స్ చెబుతున్న టీ కాంగ్రెస్ !

Update: 2022-05-01 02:30 GMT
శ‌త్రువుకు థాంక్స్..వినేందుకు కొత్త‌గా ఉన్నా ఇదే నిజం. రేప‌టి వేళ త‌మ గెలుపున‌కు కార‌ణం అయ్యే పెద్దాయ‌న కేసీఆర్ కు యువ రాజు రాహుల్ త‌ర‌ఫున థాంక్స్ అంటోంది హ‌స్తం పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్య‌వ‌ర్గం. ఆ వివ‌రం ఈ క‌థ‌నంలో...

అధికారం కార‌ణంగా కేసీఆర్ త‌ప్పిదాలు చేస్తున్నారు. ఆ విధంగా కాంగ్రెస్ పై ప్ర‌జ‌ల‌కు ఎక్క‌డ లేని సానుభూతి ద‌క్కేవిధంగా చేస్తున్నారు. రైతు సంఘ‌ర్ష‌ణ స‌భ‌కు అనుమ‌తి ఇవ్వ‌నివ్వ‌కుండా అడ్డుకున్న పెద్దాయ‌న‌కు, కాంగ్రెస్ లో ఉన్న పెద్ద పెద్ద నాయ‌కుల‌కూ మ‌ధ్య యుద్ధం జ‌రుగుతోంది. ఈ వాగ్యుద్ధం కార‌ణంగా ఎవ‌రు గెలుస్తారో అన్న‌ది ఇప్ప‌టిలో తేలేది కాదు కానీ, ఓ విధంగా యువ‌రాజు రాహుల్ అటెండ్ అయ్యే స‌భ‌ను అడ్డుకోవ‌డం అంత మేలు కాద‌ని పాల‌క ప‌క్షానికి కాంగ్రెస్ నాయ‌కులు సుద్దులు చెబుతున్నారు.

తెలంగాణ ఇచ్చిన పార్టీకే ఇంత‌టి అవ‌మానమా అని మండిప‌డుతున్నారు. దీంతో ప్ర‌త్యామ్నాయ ఏర్పాట్ల‌కు కార్యాచ‌ర‌ణ సిద్ధం చేస్తూ ఉన్నారు. ఇదే స‌మ‌యంలో కేసీఆర్ పై పోరుకు  మ‌రింతగా మాట‌ల దాడికి త‌మ స‌న్నాహాల‌ను సైతం సిద్ధం చేస్తూ ఉన్నారు.

ప్ర‌తిప‌క్షంలో ఉన్న పార్టీల‌ను పెంచి పెద్ద‌వి చేసేవి అధికార ప‌క్షాలే అందులో సందేహాల‌కు తావే లేదు. విప‌క్షంలో ఉన్న‌ప్పుడు త‌రువాత కూడా వారి బ‌లం ఎలా ఉన్నా, ముందు వారిని మాన‌సికంగా శ‌క్తిమంతుల‌ను చేసేది, వారిలో ధృడ చిత్తం పెంచేది కూడా అధికార పార్టీలే ! అందుకే ఎక్క‌డ‌యినా ఎప్పుడ‌యినా ఓ పార్టీ ప‌త‌నం ఎలా ఆరంభం అవుతుంది అంటే అధికారంలో ఉన్న‌ప్పుడు సంబంధిత ద‌ర్పంతో ఊగిపోయి తూగిపోయిన‌ప్పుడే ! అప్పుడే ఆవేశం అప్పుడే అహంకారం అన్న‌వి వెల్లువ‌లోకి వ‌స్తాయి. వెలుతురు చూస్తాయి. ఆ విధంగా ఆ వెలుతురు పిట్ట కూత కార‌ణంగా అధికార ప‌క్షం త‌ప్పిదాలు అన్నీ లోకం వింటుంది. కొన్ని వెలుగులు పోగేసుకుని అవే విష‌యాలు లోకానికి మీడియా తెలియ‌జేస్తుంది.


ఆ విధంగా ఇప్పుడు కేసీఆర్ ఓ స‌మ‌స్య‌లో ఇరుక్కుపోయారు. మే ఏడున ఓయూలో టీ కాంగ్రెస్ నిర్వ‌హించ‌నున్న రాహుల్ గాంధీ సభ (రైతు సంఘ‌ర్ష‌ణ స‌భ‌) కు అనుమ‌తులు ఇవ్వ‌లేదు. ఇందుకు వీసీ అంగీకారం ఇవ్వ‌లేదు. దీంతో టీ కాంగ్రెస్ మ‌ళ్లీ  ఆగ్ర‌హంతో ఊగిపోతోంది. కేసీఆర్ చ‌ర్య‌ల కార‌ణంగా త‌మ బ‌లం ప‌రోక్షంగా మ‌రింత పెరిగింద‌ని అంటోంది. ఇకపై క్యాంప‌స్ లో ఎటువంటి స‌మావేశాల‌కు కానీ స‌భ‌ల‌కు కానీ ఎటువంటి అనుమ‌తులూ ఇవ్వ‌బోమ‌ని, అదేవిధంగా సంబంధిత కెమెరాల‌నూ అనుమతించ‌బోమ‌ని వీసీ తేల్చేశారు. దీనిపై విప‌క్ష పార్టీ స‌భ్యులు మండిప‌డుతున్నారు.

ఒక‌నాడు ఓయూ కేంద్రంగా ఉద్య‌మించిన కేసీఆర్ కు ఇప్పుడు అదే ప్రాంతం అదే ప్రాంగ‌ణం అంటే భ‌యం పుట్టుకువ‌స్తోంద‌ని జ‌గ్గారెడ్డి ఫైర్ అవుతున్నారు. ఏదేమ‌యిన‌ప్ప‌టికీ అణిచివేతల నేప‌థ్యంలో టీ కాంగ్రెస్ నేత‌లు త‌మ బలం మ‌రో సారి పెరిగింద‌ని, ఇది ఓ విధంగా తెలంగాణ ఇంటి పార్టీ  ప‌త‌నానికే నాంది అని అంటున్నారు.
Tags:    

Similar News