బాబు అవసరం తెలంగాణకు లేదన్నాడు

Update: 2016-02-06 08:44 GMT
మామూలుగానే మాటల హాడావుడి ఎక్కువ. ప్రత్యర్థులపై ఓ రేంజ్ లో విరుచుకుపడే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి వారికి తాజాగా విడుదలైన గ్రేటర్ ఎన్నికల ఫలితాలు ఎంత కిక్ ఇస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణ విపక్షాలు మాట్లాడలేని విధంగా గ్రేటర్ ప్రజల తీర్పు ఉండటంతో వారు తమ దారుణ ఓటమికి కారణాలు చెప్పలేక కిందా మీదా పడుతున్న పరిస్థితి.

ఇదిలా ఉంటే.. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెలరేగిపోయారు. గ్రేటర్ ఎన్నికల ఫలితాలతో రాజకీయ పార్టీలకు దిమ్మ తిరిగి పోయిందంటూ ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారు. టీటీడీపీ తరఫు నుంచి సార్వత్రిక ఎన్నికల బరిలోకి దిగిన ఆయన.. అనంతరం తెలంగాణ అధికారపక్షంలోకి చేరటం.. మంత్రిగా బాధ్యతలు చేపట్టటం తెలిసిందే. తలసాని మంత్రి పదవిని ఇవ్వటంపై తెలంగాణ విపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడటం తెలిసిందే. తలసాని రాజీనామాను ఆమోదించి ఉప ఎన్నికలు నిర్వహించాలంటూ ఇప్పటికే  పలుమార్లు డిమాండ్లు వచ్చాయి.

తాజాగా గ్రేటర్ ఎన్నికల్లో పార్టీ సాధించిన అద్భుత విజయం నేపథ్యంలో మాట్లాడిన తలసాని.. తెలంగాణకు చంద్రబాబు అవసరం లేదని తేలిపోయిందని.. బాబును తెలంగాణ ప్రజలు పంపేశారని వ్యాఖ్యానించారు. తాను రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో తిరిగి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు మొదటి నుంచి చెబుతున్నానని.. అదే వ్యాఖ్యకు ఇప్పటికీ కట్టుబడి ఉంటానని తలసాని వ్యాఖ్యానించటం గమనార్హం.
Tags:    

Similar News