తాలిబన్లకు ఊపిరి ఈ నలుగురు..

Update: 2021-08-17 04:53 GMT
ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఇరవై ఏళ్ల పాటు సాగిన ప్రజాపాలన అఫ్గానిస్థాన్ లో అంతమైంది. తాలిబన్ల ఆరాచకం మళ్లీ మొదలైనట్లే. అమెరికన్.. నాటో బలగాల ఉపసంహరణతో మళ్లీ తాలిబన్ల రాజ్యం మొదలైనట్లే. కోట్లాది మంది అఫ్గాన్ పౌరుల బతుకులు ఏమిటి? వారి భవిష్యత్తు ఏమిటి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. కోట్లాది మంది బతుకుల్ని డిసైడ్ చేయనున్న తాలిబన్లలో.. చక్రం తిప్పేది ఎందరో తెలుసా? అక్షరాల నలుగురు. ఆ నలుగురు తీసుకునే నిర్ణయాలే అఫ్గాన్ భవిష్యత్తును డిసైడ్ చేయున్నాయి. ఇంతకీ ఆ నలుగురు ఎవరు? వారి నేపథ్యం ఏమిటన్నది చూస్తే..

1. హైబతుల్లా అఖుంజాదా.. తాలిబన్ చీఫ్

2. సిరాజుద్దీన్ హక్కానీ.. 45 ఏళ్లు

3. ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్

4. ముల్లా యాకూబ్.. 30 ఏళ్లకు పైనే

హైబతుల్లా అఖుంజాదా

ప్రస్తుతం తాలిబన్ సంస్థకు ఇతడే చీఫ్. మొత్తం తాలిబన్లను తన కనుసన్నల్లో నడిచేలా చేస్తాడు. చీఫ్ అన్నంతనే విలాసవంతమైన జీవితాన్ని అనుసరిస్తారనే దానికి భిన్నంగా సామాన్య జీవనాన్ని ఆచరించటం ఇతడి ప్రత్యేకత. మత పరమైన వ్యవహారాలన్ని అతడి కనుసన్నల్లోనే సాగుతాయి. తాలిబన్ వర్గాల్ని ఏకతాటి మీదకు తీసుకురావటంలో కీలకపాత్ర పోషించాడు. అల్ ఖైదా అగ్రనేత అల్ జవహరికి విశ్వాసపాత్రుడు. 2016లోఅమెరికా జరిపిన డ్రోన్ దాడిలో తాలిబన్ నేత ముల్లా మన్సూర్ అక్తర్ మరణించటంతో.. అతడి స్థానంలో ఇతడికి చీఫ్ బాధ్యతల్ని అప్పజెప్పారు.

సిరాజుద్దీన్ హక్కానీ

అమెరికాపై దాడి చేయటమే లక్ష్యం. ఇందుకోసం ఏర్పాటు చేసిన ఉగ్రవాద సంస్థ హక్కానీ నెట్ వర్క్ కు అధిపతి. సంపన్నుడు. సోవియెట్ వ్యతిరేక ముజాహిదీన్ కమాండర్ జలాలుద్దీన్ హక్కానీ కుమారుడే సిరాజుద్దీన్. తాలిబన్ డిప్యూటీ నేతగా వ్యవహరిస్తున్నారు. హక్కానీ నెట్ వర్కు ఆధ్వర్యంలోనే కాబుల్ లో భీకర దాడులుకొంతకాలంగా సాగుతున్నాయి. నాటో దళాలకు కొరుకుడుపడని సంస్థగా హక్కానీ నెట్ వర్కును చెబుతారు.

ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్

తాలిబన్ రాజకీయ విభాగానికి ఇతనే అంతా. 1970లో అఫ్గాన్ ను సోవియట్ ఆక్రమించుకోవటంతో తిరుగుబాటు టీంలో చేరాడు. ఒంటి కన్ను ముల్లా ఒమర్ తో కలిసి మదర్సాను స్థాపించిన ఘన చరిత్ర ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్. తాలిబన్ రాజకీయ విభాగానికి ఇతడే అధిపతి. అఫ్గాన్ ముజాహిదీన్ తరఫున పోరాడాడు. సోవియట్ దళాలు వెళ్లిపోయిన తర్వాత దేశంలో అవినీతి.. అంతర్యుద్ధం చెలరేగాయి. ఒంటికన్ను ముల్లాతో కలిసి మదర్సాను స్థాపించిన బరాదర్.. తర్వాత అతడితో కలిసి తాలిబన్ ఉద్యమాన్ని ప్రారంభించాడు.

పాక్ కు చెందిన ఐఎస్ఐ మద్దతుతో ఇతగాడి సంస్థ  ఒక్కో రాష్ట్రాన్ని చేజిక్కించుకొని.. 1996లో అధికారాన్ని హస్తగతం చేసుకుంది. అమెరికా ఒత్తిడితో 2010లో పాక్ లోని ఐఎస్ఐ.. సీఐఏ టీంలు బరాదర్ ను అరెస్టు చేశాయి. ట్రంప్ అభ్యర్థనతో 2018లో పాక్ అతడ్ని విడిచి పెట్టింది.

ముల్లా యాకబ్

తాలిబన్ వ్యవస్థాపకుడు ముల్లా ఒమర్ తనయుడు.. ఈ సంస్థలో అత్యంత శక్తివంతమైన మిలిటరీ కమిషన్ కు అధిపతి. తాలిబన్ తదుపరి సుప్రీం లీడర్ గా బాధ్యతలు చేపట్టే వీలుంది. 30 ఏళ్లు దాటిన యూకూబ్ అఫ్గాన్ సైన్యానికి సారథ్యం వహించే వీలుంది.

ఈ నలుగురితో పాటు.. ‘‘రహ్ బారి షురా’’ అనే విభాగం తాలిబన్ లోని అత్యున్నత నాయకత్వ మండలి. తాలిబన్ల అంతర్గత రాజకీయ ఏకాభిప్రాయానికి వేదికగా చెబుతారు. రాజకీయాలకు సంబంధించి సుప్రీం లీడర్ నిర్ణయాలు తీసుకోవటానికి ముందు తప్పనిసరిగా ‘రహ్ బారి షురా’ అనుమతి తీసుకున్న తర్వాతే అడుగు ముందుకు వేయాల్సి ఉంటుంది.
Tags:    

Similar News