కోదండ‌రాం రాయేస్తే కేసీఆర్ కు త‌గులుతుందా

Update: 2017-08-31 13:35 GMT
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కేసీఆర్ కు ప్ర‌త్యామ్నాయంగా క‌నిపిస్తున్న ఒకే ఒక్క మ‌నిషి కోదండ‌రాం. టీడీపీలో మిగిలిన రేవంత్ రెడ్డి ఓటుకునోటు కేసుతో ప్ర‌జ‌ల్లో ఉన్న ప‌రువు పోగొట్టుకున్నాడు. కొడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో మ‌ళ్లీ నిల‌బ‌డితే ఈ సారి రేవంత్ రెడ్డికి నూక‌లు చెల్లిన‌ట్లే. అదే కేసులో ఉన్న మ‌రో ఎమ్మెల్యే సండ్ర వెంక‌ట‌వీర‌య్య ఈ సారి మ‌ళ్లీ ఎమ్మెల్యేగా గెలిస్తే అదృష్ట‌మే. సీపీఎం - సీపీఐలు గ‌త ఎన్నిక‌ల్లో ద‌క్కించుకున్న ఒక్కో సీటు ద‌క్కించుకుంటే క‌ష్ట‌మే. మిగిలింది కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీలో ఉన్న జానారెడ్డి - డీకె అరుణ‌ - ఉత్త‌మ్ కుమార్ రెడ్డి - కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి - గీతారెడ్డిలు అంతా ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థులే.

కాంగ్రెస్ పార్టీని ఎవ‌రూ నాశ‌నం చేయాల్సిన అవ‌స‌రం లేదు. వారిని వారే నాశ‌నం చేసుకుంటారు అన్న‌ది గ‌త మూడేళ్లుగా తెలంగాణ‌లో వాళ్లు అనుస‌రిస్తున్న పంథా చూస్తేనే అర్థం అవుతుంది. పార్టీకి దిశానిర్దేశం చేసే నాయ‌కుడు లేడు. ఓ నాయ‌కుడు ముందు నిల‌బ‌డి చెప్పినా వినే వారు పార్టీలో లేరు. అందుకే ఇటు తెలుగుదేశం పార్టీ నుండి, అటు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుండి కోదండ‌రాంకు భారీ మ‌ద్ద‌తు ల‌భిస్తుంద‌ని తెలుస్తుంది. కేసీఆర్ మీద తెలంగాణ టీడీపీ నేత‌లు - కాంగ్రెస్ నేత‌లు ఎన్ని ఆరోప‌ణ‌లు చేసినా జ‌నం ప‌ట్టించుకోరు. ఎందుకంటే గ‌త 14 ఏండ్ల ఉద్య‌మంలో, 60 ఏండ్ల పాల‌న‌లో తెలంగాణ ప‌ట్ల వారికి ఎంత చిత్త‌శుద్ది ఉన్న‌ది తెలంగాణ ప్ర‌జ‌లు గ‌మ‌నించారు.  

ఇక తెలంగాణ ఏర్ప‌డిన త‌రువాత కేసీఆర్ వినూత్న ప‌థ‌కాల‌తో తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ద‌గ్గ‌ర‌వుతూ వ‌స్తున్నారు. ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వ‌ని హామీల‌ను అమ‌లు చేస్తున్నారు. ఎన్నిక‌ల హామీల‌యిన ఆస‌రా - వికలాంగుల ఫించ‌న్లు మాత్ర‌మే కాకుండా ముఖ్యంగా మిష‌న్ భ‌గీర‌థ ద్వారా అన్ని గ్రామాల‌కు ఇంటింటికి నీళ్లు ఇవ్వ‌నిదే ఎన్నిక‌ల్లో నిల‌బ‌డ‌న‌ని ప్ర‌క‌టించ‌డం ప్ర‌జ‌ల‌ను ఎంతో ఆక‌ట్టుకుంది. క‌ళ్యాణ ల‌క్ష్మి ప‌థ‌కం - గురుకుల పాఠ‌శాల‌లు గ్రామీణ ప్ర‌జ‌లలో కేసీఆర్ మీద విశ్వాసం పెంచుతున్నాయి.

ఈ ప‌రిస్థితుల‌లో కేసీఆర్ తో క‌లిసి తెలంగాణ ఉద్య‌మంలో అయిదేండ్లు ప‌నిచేసిన కోదండ‌రాం ద్వారా ఆరోప‌ణ‌లు చేస్తేనే జ‌నం న‌మ్ముతార‌ని కాంగ్రెస్ - టీడీపీలు న‌మ్ముతున్నాయి. అందుకే ఏ మాత్రం ప‌స‌లేని ధ‌ర్నా చౌక్ కొర‌కు కూడా కోదండ‌రాం ఢిల్లీ జంత‌ర్ మంత‌ర్ లో నిర‌స‌న తెల‌ప‌డం అంద‌ర్నీ ఆశ్చ‌ర్య ప‌రుస్తుంది. ఢిల్లీ ధ‌ర్నా పేరుతో జాతీయ‌స్థాయి నాయ‌కుల‌కు కేసీఆర్ మ‌మ్మ‌ల్ని అణ‌చివేస్తున్నాడ‌ని, తెలంగాణ‌లో అరాచ‌కం సాగుతుంద‌ని చెప్పేందుకు కోదండ‌రాం వెళ్లాడ‌ని, అంతే కానీ మ‌రో అంశం లేద‌ని స‌మాచారం. ఎంత ప్రచారం చేసినా ప్ర‌జ‌లు వీటిని ఎంత‌వ‌ర‌కు ప‌ట్టించుకుంటారు అన్న‌ది వేచిచూడాలి.
Tags:    

Similar News