టీలో టీడీపీ క్లోజ్‌!... టీ కాంగ్ పుంజ‌కుంది!

Update: 2019-02-07 09:11 GMT
ఇప్పుడంతా స‌ర్వేల కాలం న‌డుస్తోంది. సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌తో పాటు ఏపీ స‌హా ప‌లు రాష్ట్రాల అసెంబ్లీల‌కు జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల‌కు ఇంకా రెండు నెల‌లే గ‌డువు ఉంది. ఈ నెల‌లోనే నోటిఫికేష‌న్ వ‌చ్చే అవ‌కాశాలున్నాయ‌న్న వార్త‌ల నేప‌థ్యంలో ఇప్పుడు ఏ స‌ర్వే వెలువ‌డినా... పెద్ద సంచ‌ల‌నంగానే మారిపోతోంది. ఇప్ప‌టికే వెలువ‌డిన చాలా స‌ర్వేలు... కేంద్రంలో క‌ష్టమైనా ఎన్డీయేకే ఎడ్జ్ ద‌క్కుతుంద‌ని చెప్ప‌డంతో పాటుగా ఏపీలో మాత్రం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ఈ సారి బంప‌ర్ మెజారిటీతో విజ‌యం సాధించ‌డం ఖాయ‌మ‌ని చెప్పాయి. తాజాగా ఈ కోవ‌లోనే మ‌రో స‌ర్వే వ‌చ్చేసింది. నేష‌న‌ల్ ట్రాక‌ర్ పోల్ 2 పేరిట వీడీఏ అసోసియేట్స్ అనే సంస్థ నిర్వ‌హించిన ఈ స‌ర్వేలోనూ కేంద్రంలో ఎన్డీఏకే విజ‌యావ‌కాశాలు క‌నిపిస్తుండ‌గా, తెలంగాణ‌లో ఇప్ప‌టిదాకా ఊహించిన ఫ‌లితాల్లో కాస్తంత మార్పు క‌నిపిస్తోంది.

తెలంగాణ‌లో మొత్తం 17 పార్ల‌మెంటు సీట్లు ఉండ‌గా... ఇప్ప‌టిదాకా వెలువ‌డిన దాదాపు అన్ని స‌ర్వేల్లో 16 సీట్లు టీఆర్ ఎస్‌ కు, ఓ సీటు మ‌జ్లిస్ ఖాతాలో ప‌డుతుంద‌ని తేలింది. అయితే వీడీఏ అసోసియేట్స్ స‌ర్వేలో మాత్రం ఈ అంకెలు కాస్తంత మారిపోయాయి. టీఆర్ ఎస్ కు రెండు సీట్లు త‌గ్గి 14 సీట్లు ద‌క్క‌నుంద‌ని ఈ స‌ర్వే చెప్ప‌గా... అనూహ్యంగా తెలంగాణ కాంగ్రెస్ కాస్తంత పుంజుకున్న‌ట్లుగా తేల్చింది. ఇటీవ‌లే ముగిసిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీడీపీతో క‌లిసి బ‌రిలోకి దిగిన కాంగ్రెస్ కు గ‌ట్టి ఎదురు దెబ్బ త‌గిలిన విష‌యం తెలిసిందే. అయితే ఈ ప‌రాభ‌వానికి గ‌ల కార‌ణాల‌పై ఆత్మ ప‌రిశీల‌న చేసుకున్న కాంగ్రెస్ టీడీపీతో జ‌ట్టు క‌ట్ట‌డం కార‌ణంగానే ఘోరంగా ఓట‌మి పాల‌య్యామ‌ని, ఇక‌పై టీడీపీతో పొత్తు దిశ‌గా ఆలోచ‌న చేయొద్ద‌న్న దిశ‌గా టీ కాంగ్రెస్ సాగుతోంది. ఆ పార్టీలో వ‌చ్చిన మార్పును జ‌నం కూడా ఆహ్వానిస్తున్న‌ట్లుగా... వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీ కాంగ్రెస్‌కు ఏకంగా రెండు సీట్లు ద‌క్కనున్న‌ట్లుగా స‌ర్వే తేల్చింది.

ఇక పాత‌బ‌స్తీ ప‌హిల్వాన్‌ గా ఉన్న మ‌జ్లిస్ పార్టీ గ‌తంలో మాదిరిగా హైద‌రాబాద్ లోక్ స‌భ సీటును త‌న ఖాతాలో వేసుకుంటుంద‌ట‌. ఓట్ల శాతానికి వ‌స్తే... టీఆర్ ఎస్ కు 42.85 శాతం, టీ కాంగ్రెస్ కు 34.2 శాతం, బీజేపీకి 12.1 శాతం, ఎంఐఎంకు 4 శాతం, ఇత‌రులు 6.85 శాతం ఓట్లు ద‌క్క‌నున్నాయట‌.  ఈ గ‌ణాంకాలు చూస్తుంటే... తెలంగాణ‌లో టీడీపీ దాదాపుగా తుడిచిపెట్టుకుపోయిన‌ట్టేన‌న్న వాద‌న వినిపిస్తోంది. అస‌లు ఓట్ల శాతంలో గానీ, సీట్ల మాట‌లో గానీ టీడీపీ పేరు వినిపించ‌క‌పోవడ‌మే ఇందుకు నిద‌ర్శ‌నంగా చెప్పుకోవాలి. కేడ‌ర్ ప‌రంగా ఇప్ప‌టికీ తెలంగాణ‌లో టీడీపీ ఉనికిలో ఉన్నా... పార్టీ నాయ‌క‌త్వం విష‌యంలో మాత్రం జీరోకు చేరింద‌న్న వాద‌న వినిపిస్తోంది.
Tags:    

Similar News