నిరసన వేళ చింతమనేని హడావుడి చేస్తే.. పెళ్లికి వస్తుంటే అరెస్టు చేయటమా?

Update: 2021-08-30 03:09 GMT
2014 ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత.. అత్యంత వివాదాస్పద నేతగా.. తానేం చేసినా నడిచిపోతుందన్న ధీమాతో వ్యవహరించిన ఎమ్మెల్యేగా చింతమనేని ప్రభాకర్ పేరు తరచూ వినిపిస్తూ ఉండేది. దీనికి తోడు.. మహిళా రెవెన్యూ ఉద్యోగిపై చేయి చేసుకున్న ఉదంతంలో బాబు సర్కారు ఇమేజ్ ఎంత దారుణంగా డ్యామేజ్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. పలు వివాదాలతో ఆయన పేరు ముడిపడి ఉండటం తెలిసిందే.

ప్రభుత్వం పడిపోయి.. అధికారంలోకి జగన్ సర్కారు వచ్చిన తర్వాత కూడా ఆయన తీరు మారలేదన్న విమర్శ వినిపిస్తూ ఉంటుంది. ఆయన ఆగ్రహావేశాలు ఎప్పటికప్పుడు కేసులు నమోదయ్యేలా చేయటం.. అరెస్టుకావటం.. రిమాండ్ కు వెళ్లి రావటం ఈ మధ్యన ఎక్కువైంది. తాజాగా మరోసారి ఆయనకు షాక్ తప్పలేదు.

పెళ్లికి వెళ్లి తిరిగి వస్తున్న ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్టు చేయటం సంచలనంగా మారింది. ఈసారి ఆయన చేసిన తప్పేంటి? అన్న విషయంలోకి వెళితే.. కాస్త ఆశ్చర్యానికి గురి కావాల్సిందే. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరల పెంపునకు నిరసన చేపట్టాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన పిలుపు మేరకు.. దెందలూరులో చింతమనేని ప్రభాకర్ శనివారం నిరసన చేపట్టారు. ఇందులో భాగంగా ఎడ్ల బండిని నడిపారు.

తన నిరసనను తెలియజేసేందుకు ఎమ్మార్వో కార్యాలయానికి వెళుతుండగా..అనుమతి లేదని ఆయన్ను అడ్డుకున్నారు. దీంతో అక్కడున్న పోలీసులపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వాగ్వాదం జరగటం.. పోలీసులకు.. చింతమనేనికి మధ్య తోపులాట జరిగింది. చివరకు అధికారులు వాతావరణాన్నిచక్కదిద్ది.. చింతమనేని చేతుల నుంచి వినతిపత్రం తీసుకున్నారు.

నిరసన కార్యక్రమం ముగిసినప్పటికీ.. పోలీసుల విషయంలో ఆయన ప్రదర్శించిన ఆగ్రహావేశాలకు మూల్యం అన్నట్లుగా ఆయనపై కేసు నమోదు చేశారు. శనివారం జరిగిన ఈ ఉదంతానికి సంబంధించి ఆదివారం ఆయన విశాఖ జిల్లాలో జరిగిన పెళ్లికి వెళ్లి వస్తుండగా అడ్డుకొని.. అరెస్టు చేసి తీసుకెళ్లారు. జగన్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత చింతమనేనిని పలుమార్లు అరెస్టు చేయటం తెలిసిందే. రానున్న రోజుల్లో మరెన్ని కేసులు నమోదవుతాయో?
Tags:    

Similar News