పట్టాభి ఇంతగా భయపడ్డారా ?

Update: 2021-10-21 04:55 GMT
తనను పోలీసులు అరెస్టు చేయటానికి వచ్చినపుడు టీడీపీ అధికారప్రతినిధి పట్టాభి బాగా భయపడినట్లే ఉంది. తన అరెస్టు తప్పదన్న విషయం పట్టాభికి బాగా అర్ధమైపోయింది. అందుకనే తానొక వీడియా తీసుకుని మీడియాకు రిలీజ్ చేశారు. తాను ఆరోగ్యంగా ఉన్నానని, తన ఒంటిపై ఒక్క దెబ్బకూడా లేదంటు తనంతట తానే తన శరీరమంతా కనిపించేట్లుగా ఓ వీడియో తీసుకుని విడుదల చేశారు. ఇంతకీ పట్టాభి ఎందుకు ఈ విధంగా చేశారు ?

ఎందుకంటే తనను అరెస్టుచేసిన తర్వాత పోలీసులు కస్టడీలో తనను కొడతారని పట్టాభి బాగా భయపడ్డారు. ఒకవేళ కస్టడీలో పోలీసులు తనను కొడితే కొట్టారనేందుకు అరెస్టుకు ముందు తాను తీసుకున్న వీడియానే సాక్ష్యంగా ఉంటుందని పట్టాభి అనుకున్నట్లున్నారు. అందుకనే తన ఒంటిపై ఎక్కడా గాయాలు లేవని వీడియోలో చూపించుకన్నారు. ఇలా చేయాలని ఆయనకు ఎలా అనిపించింది ?

ఎలాగంటే వైసీపీ తిరుగుబాటు ఎంపి రఘురామకృష్ణంరాజు వ్యవహారం బహుశా పట్టాభికి గుర్తుకొచ్చిందేమో. కృష్ణంరాజును సీఐడీ పోలీసులు అరెస్టు చేసిన తర్వాత కస్టడీలో ఉంచుకున్న విషయం తెలిసిందే. మరుసటిరోజు కోర్టులో బెయిల్ రద్దు పిటీషన్ను కోర్టు కొట్టేసింది. బెయిల్ రద్దు పిటీషన్ కొట్టేసిందని తెలిసిన వెంటనే సీఐడీ పోలీసులు తనను కొట్టారంటూ ఎంపి గోల మొదలుపెట్టారు. తర్వాత రఘురామ వ్యవహారం ఎన్ని మలుపులు తిరిగిందో అందరు చూసిందే.

నిజానికి తిరుగుబాటు ఎంపిని సీఐడీ అధికారులు కస్టడీలో కొట్టారా లేదా అన్న విషయం అధికారులకు, ఎంపికి మాత్రమే తెలుసు. ఏదేమైనా ఇదే విషయం బహుశా తన విషయంలో కూడా జరగవచ్చని పట్టాభి భయపడుంటారు. అందుకనే ముందుజాగ్రత్తగా తన శరీరంపై ఎలాంటి గాయాలు లేవని చెప్పుకుంటు ఓ వీడియోను తీసుకుని మీడియాకు రిలీజ్ చేశారు. అయితే ఇక్కడ పట్టాభి మరచిపోయిన విషయం ఒకటుంది.

అదేమిటంటే నిజంగానే పోలీసులు కొట్టదలచుకుంటే దెబ్బలు పైకి కనబడకుండానే కొట్టగలరు. ఇప్పటివరకు అనేక సందర్భాల్లో కొందరు టీడీపీ నేతలను పోలీసులు అరెస్టు చేసి విచారించారు. అయితే ఏ నేత కూడా తనను పోలీసులు విచారణలో కొట్టారని ఒక్కళ్ళు కూడా చెప్పలేదు. విచారణలో తమతో పోలీసులు బాగానే వ్యవహరించారనే అందరు చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. ఏదేమైనా రఘురామ వ్యవహారం పట్టాభిని బాగానే భయపెట్టినట్లు అనిపిస్తోంది. టీడీపీ నేత అనుమానించి నట్లుగానే అరెస్టు జరిగింది. మరి బయటకు వస్తే కానీ ఈ మధ్యలో ఏమి జరిగిందో తెలీదు.
Tags:    

Similar News