టికెట్ల పంచాయ‌తీ... ప‌వ‌న్ కోసం సీమ రెడ్డి ఏమంటున్నారంటే

Update: 2022-02-24 17:34 GMT
ప‌వర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లానాయ‌క్ విష‌యంలో ఆయ‌న అభిమానులు ఎంత క్రేజ్‌తో ఉన్నారో... టికెట్ ధరల విష‌యంలో ఆదేశాలు పాటించ‌క‌పోయినా.. బెనిఫిట్ షోలు వేసినా సినిమాటోగ్రఫీ చట్టం కింద కేసులు నమోదు చేస్తామని రెవిన్యూ అధికారులు స్పష్టం చేయడంతో ఏం జ‌రుగ‌బోతుందనే ఉత్కంఠ‌లో సామాన్యులు సైతం ఉన్నారు.

సినిమాను సినిమాలాగే చూడాలని హీరోలందరి సినిమాలను ప్రభుత్వం ఒకేలా ఆదరించాలని రాజకీయంతో ముడిపెట్టొద్దని కొంద‌రు ప్ర‌తిపాదిస్తున్నారు. ఇదే స‌మ‌యంలో రాజ‌కీయ నాయ‌కులు సైతం సినిమాల‌పై స్పందిస్తున్నారు. తాజాగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు అండ‌గా తెలుగుదేశం పార్టీ సీనియ‌ర్ నేత‌, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

భీమ్లానాయ‌క్‌ సినిమా చూడాలని అభిమానులు ఉత్సాహంగా ఉన్న స‌మ‌యంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణ‌యం ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై క‌క్ష సాధించ‌డ‌మేన‌ని జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి ఆరోపించారు. ప్ర‌భుత్వం నిర్ణ‌యంతో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు పోయేదేమీ ఉండ‌ద‌ని తెలిపారు.  

ఈగో సీఎం ఒక్కడికే కాదు అందరికీ ఉంది.. పవన్ కల్యాణ్ కు కూడా ఉంటుందని జేసీ వ్యాఖ్యానించారు. సినిమా టికెట్ల ధరల తగ్గించేందుకు తాము వ్యతిరేకం కాదని తెలిపిన జేసీ ప్ర‌భాక‌ర్‌ రెడ్డి ఇలాంటి ముఖ్య‌మైన అంశాలు సినీ ప‌రిశ్ర‌మ‌కు ముందే చెప్పాలి కదా అని ఆయన అన్నారు.

ఈ సంద‌ర్భంగా చిరంజీవి ఉదంతాన్ని సైతం జేసీ ప్ర‌భాక‌ర్‌ రెడ్డి ప్ర‌స్తావించారు. మెగాస్టార్ చిరంజీవి బతకలేక సీఎం దగ్గరకు వెళ్ల‌లేద‌ని...సినిమా పరిశ్రమ కోసం ఆయ‌న అంత శ్ర‌మించార‌ని విశ్లేషించారు. చిరంజీవి చేతులు జోడించి అడిగిన‌ప్ప‌టికీ సీఎం జ‌గ‌న్ ఇంకా సినిమా టికెట్ల విష‌యంలో క్లారిటీ ఇవ్వ‌లేద‌ని మండిప‌డ్డారు.

సినిమా టికెట్ల విష‌యంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను టార్గెట్ చేస్తున్న‌ట్లు సీఎ జ‌గ‌న్ భావిస్తున్న‌ప్ప‌టికీ సిని ప‌రిశ్ర‌మ‌, దానిపై ఆధార‌ప‌డిన వారిని సీఎం జ‌గ‌న్ ఇబ్బందుల పాలు చేస్తున్నార‌నే విష‌యం గ‌మ‌నించాల‌ని జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి హిత‌వు ప‌లికారు. కాగా, జ‌న‌సేనానికి మ‌ద్ద‌తుగా సీమ రెడ్డి లైన్లోకి రావ‌డం, ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ను టార్గెట్ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.
Tags:    

Similar News