సీఎం ర‌మేష్ పై టీడీపీ త‌మ్ముళ్ల కుర్చీల దాడి

Update: 2017-04-08 05:09 GMT
ఏపీ అధికార‌ప‌క్షంలో నెల‌కొన్న అసంతృప్త లుక‌లుక‌లు కొత్త‌రూపును సంత‌రించుకుంటున్నాయి. అధికార‌పార్టీ అత్యాశ‌కు ఫ‌లిత‌మ‌న్న‌ట్లుగా టీడీపీ త‌మ్ముళ్లు చెల‌రేగిపోతున్నారు. దొడ్డిదారిన విప‌క్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యేల్ని తీసుకొచ్చేసి.. మంత్రిప‌ద‌వుల‌తో పెద్ద‌పీట వేయ‌టాన్ని నేత‌లే కాదు.. వారి కార్య‌క‌ర్త‌లు తీవ్రంగా ర‌గిలిపోతున్నారు. ఏళ్ల త‌ర‌బ‌డి జెండాలు మోసిన వారిని కాద‌ని.. స్వార్థంతో పార్టీలు మారిపోయిన వారికి ప‌ద‌వులు అప్ప‌గిస్తారా? అంటూ అగ్గి ఫైర్ అవుతున్నారు.

తాజాగా జ‌రిపిన మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో పార్టీ పిరాయింపుల‌కు పాల్ప‌డిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన న‌లుగురు ఎమ్మెల్యేల‌కు మంత్రి ప‌ద‌వులు ఇవ్వ‌టంపై సర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ్య‌క్తం కావ‌ట‌మే కాదు.. టీడీపీ కార్య‌క‌ర్త‌ల్లో తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. సుదీర్ఘ కాలంగా పార్టీకి సేవ చేసిన త‌మ‌కు ప‌ద‌వులు ఇవ్వ‌ని వైనంపై నేత‌లు ర‌గిలిపోవ‌ట‌మే కాదు.. త‌మ అసంతృప్తిని బాహాటంగానే బ‌య‌ట‌కువెళ్ల‌గ‌క్కేశారు.

ఇదిలా ఉంటే.. తాజాగా బాబుకు అత్యంత స‌న్నిహితుడు.. ఆయ‌న తీసుకునే ప‌లు కీల‌క నిర్ణ‌యాల్లో  చురుకైన పాత్ర‌ను పోషించే రాజ్య‌స‌భ స‌భ్యుడు సీఎం ర‌మేశ్‌కు చేదు అనుభ‌వం ఎదురైంది.

పార్టీ ఫిరాయింపుదారుల‌తో బేరాలు ఆడ‌టం.. డీల్ సెట్ చేయ‌టం లాంటివి సీఎం ర‌మేశ్ చురుగ్గా వ్య‌వ‌హ‌రిస్తార‌ని.. ఇలాంటి విష‌యాల‌కు బాబు ఆయ‌న్ను త‌ర‌చూ ప్ర‌యోగిస్తుంటార‌ని చెబుతుంటారు. సుదీర్ఘ‌కాలంగా పార్టీలో కొన‌సాగుతున్న టీడీపీ సీనియ‌ర్ నేత రామ‌సుబ్బారెడ్డికి మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌కుండా.. ఆయ‌న‌కు ప్ర‌త్య‌ర్థి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యే అయిన ఆదినారాయ‌ణరెడ్డి (జ‌మ్మ‌ల‌మ‌డుగు)కి మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌టాన్ని కిందిస్థాయి నేత‌లు.. కార్య‌క‌ర్త‌లు అస్స‌లు జీర్ణించుకోలేక‌పోతున్నారు. సీఎంర‌మేశ్ పావులు క‌దిపిన తీరుకే బాబు.. ఆదినారాయ‌ణ‌రెడ్డికి ప‌ద‌వి ఇచ్చి ఉంటార‌న్న వాద‌న వినిపిస్తోంది.

దీంతో..  రామ‌సుబ్బారెడ్డి వ‌ర్గీయులు తీవ్రంగా ర‌గిలిపోతున్నారు. పార్టీలోకి ఆదినారాయ‌ణ‌రెడ్డి ఎంట్రీని మొద‌టి నుంచి వ్య‌తిరేకిస్తున్న రామ‌సుబ్బారెడ్డి.. తాజాగా మంత్రి ప‌ద‌వి కూడా ద‌క్క‌టంపై తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. శుక్ర‌వారంసాయంత్రం రామ‌సుబ్బారెడ్డి పార్టీ కార్య‌క‌ర్త‌ల‌తో భేటీ అయ్యారు. ఈ కార్య‌క్ర‌మం సాగుతున్న వేళ‌లో.. రాజ్య‌స‌భ స‌భ్యుడు సీఎం ర‌మేశ్ అక్క‌డికి చేరుకున్నారు. ఆయ‌న్ను చూసినంత‌నే రామ‌సుబ్బారెడ్డి వ‌ర్గీయులు ఒక్క‌సారి తీవ్ర ఆగ్ర‌హానికి గురి అయ్యారు. క‌ట్ట‌లు తెంచుకున్న ఆవేశంతో సీఎం ర‌మేశ్ పై విరుచుకుప‌డ్డారు. ఆయ‌న‌పైకి కుర్చీలు పెద్ద ఎత్తున ఎగుర‌వేశారు. దీంతో.. సీఎం ర‌మేశ్‌కు ర‌క్ష‌ణ‌గా నిలించేందుకు ఆయ‌న గ‌న్ మెన్లు తీవ్రంగా శ్ర‌మించాల్సి వ‌చ్చింది. ఈ సందర్భంగా గ‌న్ మెన్ల‌కు కుర్చీల కార‌ణంగా గాయాలు అయిన‌ట్లుగా తెలుస్తోంది. తీవ్రంగా ఆవేశ‌ప‌డుతూ.. సీఎం ర‌మేశ్ వైపు దూసుకొస్తున్న కార్య‌క‌ర్త‌ల్ని శాంతింప‌చేసేందుకు రామ‌సుబ్బారెడ్డి.. శివారెడ్డి.. ఆయ‌న స‌తీమ‌ణి లక్ష్మీదేవ‌మ్మ‌తీవ్రంగా ప్ర‌య‌త్నించి.. వారి ఆవేవాన్ని చ‌ల్లార్చే ప్ర‌య‌త్నంచేశారు. ఊహించ‌ని రీతిలో సొంత త‌మ్ముళ్లే ఈ స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌టంతో సీఎం ర‌మేశ్ అవాక్కయ్యారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News