గుంటూరు జిల్లా మంగళగిరిలోని నాగార్జున విశ్వవిద్యాలయం వద్ద మహాసంకల్ప సభా ఫుల్ జోష్ తో సాగింది. పెద్ద ఎత్తున హాజరైన టీడీపీ కార్యకర్తలు, ప్రజలతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఈ సందర్భంగా పలువురు నేతలు తమ ప్రసంగంతో హాజరైన వారిలో ఉత్సాహం నింపారు.
తెలుగుజాతితో పెట్టుకుంటే..ఎవరైనా మటాష్ అవ్వాల్సిందేనని బాలకృష్ణ అన్నారు. మహాసంకల్ప వేదికలో మాట్లాడిన బాలకృష్ణ సభికుల్లో జోష్ నింపారు. నవ్యాంధ్ర నిర్మాణానికి ప్రజలంతా పునరంకితం కావాలని కోరారు. ఆర్థికలోటు ఉన్నా.. సీఎం చంద్రబాబు హామీల అమలుకు కృషిచేస్తున్నారని అన్నారు. రాజధాని నిర్మాణం, నధుల అనుసంధానంతో నవ్యాంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి పథంలోకి తీసుకువెళుతున్నారని బాలకృష్ణ చెప్పారు.
రాష్ర్టం అభివృద్ధి పథకాలతో బుల్లెట్ ట్రైన్ లా దూసుకెళుతోందని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. కేసులున్న జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ లు చంద్రబాబుకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారని చెప్పారు. ఆర్థికలోటున్నా...సమర్థంగా ముందుకు పోతున్న విషయాన్ని అంతా గుర్తుంచుకోవాలని చెప్పారు.
ప్రభుత్వ ఛీప్ విప్ కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ... ఐదు కోట్ల మంది తెలుగు ప్రజల అండ ఉన్నంతకాలం చంద్రబాబుపై ఎవరూ నిందలు వేయలేరని, కేసీఆర్ కుట్రలు ఏమీ చేయలేవని అన్నారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఎవరైనా ఏమైనా చేస్తే మాడి మసైపోతారని శ్రీనివాసులు హెచ్చరించారు. గతంలో కూడా కాంగ్రెస్ ఇరవై ఆరు ఆరోపణలు చేస్తే ఒక్క మచ్చ కూడా లేకుండా చంద్రబాబు బయటపడ్డారని గుర్తుచేశారు. మచ్చలేని వ్యక్తిత్వంతో మందుకు వెళుతున్నందుకే చంద్రబాబును ఎవరూ ఏమీ చేయలేరని శ్రీనివాసులు అన్నారు.