తీరు మార్చుకోని టీడీపీ నేత‌లు.. అదే క‌డ‌ప‌, అదే సీమ!

Update: 2020-03-11 02:30 GMT
ఒక‌వైపు మాట‌కు ముందు పులివెందుల రౌడీయిజం, పులివెందుల పంచాయ‌తీ అనే వారు. చివ‌ర‌కు ఆ మాట‌లు విని విసుగే వ‌చ్చిందేమో కానీ ఆ పులివెందుల్లో తెలుగుదేశం పార్టీకి పెద్ద దిక్కుగా ఉండిన స‌తీష్ రెడ్డి రాజీనామా చేసేసాడు. టీడీపీకి స‌తీష్ రెడ్డి రాజీనామా వెనుక‌... త‌ర‌చూ చంద్ర‌బాబు పులివెందుల‌ను త‌క్కువ చేసి మాట్లాడం, పులివెందులను రౌడీయిజానికి కేరాఫ్ అన్న‌ట్టుగా మాట్లాడ‌టం ఒక కార‌ణ‌మ‌ని విశ్లేష‌ణ‌లు వినిపిస్తూ ఉన్నాయి.

అయినా తెలుగుదేశం తీరులో మాత్రం మార్పు క‌నిపించ‌డం లేదు. పులివెందుల‌, క‌డ‌ప‌, రాయ‌ల‌సీమ‌.. ఈ పేర్ల‌ను ఎత్తుతూ ఆ ప్రాంతాన్ని అవ‌మానిస్తున్న‌ట్టుగా మాట్లాడ‌టం కొన‌సాగుతూ ఉంది. విశాఖ‌లో చంద్ర‌బాబు నాయుడును అడ్డుకుంటే.. దానికి కూడా రాయ‌లసీమ నుంచి జ‌నాల‌ను ర‌ప్పించి అడ్డుకున్నారంటూ తెలుగుదేశం పార్టీ వాళ్లు మాట్లాడుతూ వ‌చ్చారు. ఇక విశాఖ‌లో రాయ‌ల‌సీమ రౌడీయిజం, రాయ‌ల‌సీమ ఫ్యాక్ష‌నిజం అంటూ నోటికి వ‌చ్చిన‌ట్టుగా మాట్లాడుతూ ఉన్నారు.

ఇక తాజాగా న‌ర్సీప‌ట్నం తెలుగుదేశం నేత, మాజీ మంత్రి అయ్య‌న్న‌పాత్రుడు మ‌ళ్లీ రాయ‌ల‌సీమ ప్రాంతాన్ని కించ‌ప‌రిచేలా మాట్లాడ‌టం గ‌మ‌నార్హం. స‌తీష్ రెడ్డి రాజీనామా న‌మోదు అయిన రోజే.. అయ్య‌న్నపాత్రుడు క‌డ‌ప‌ను కించ‌ప‌రుస్తూ మాట్లాడారు. ఈయ‌న మ‌నుషులు న‌ర్సీప‌ట్నంలో స్థానిక ఎన్నిక‌ల్లో పోటీ చేస్తూ ఉంటే.. అక్క‌డ కు క‌డ‌ప నుంచి వ‌చ్చి కొంత‌మంది బెదిరించార‌ట‌! అలాంటి బెదిరింపుల‌కు తాము భ‌య‌ప‌డేది ఉండ‌ద‌ని అయ్య‌న్న‌పాత్రుడు చెప్పుకొచ్చారు!

ఇలాంటి విడ్డూర‌మైన మాట‌లు, ఒక ప్రాంతాన్ని కించ‌ప‌రిచే మాట‌లు తెలుగుదేశం వాళ్లు త‌గ్గించుకుంటే వాళ్ల‌కే మంచిది. అయితే తెలుగుదేశం పార్టీ వాళ్ల అహంభావం ఇంకా త‌గ్గిన‌ట్టుగా లేదు. న‌ర్సీప‌ట్నంలో స్థానిక ఎన్నిక‌ల్లో పోటీ పెట్ట‌కూడ‌ద‌ని క‌డ‌ప నుంచి వెళ్లి బెదిరించార‌ట‌. వినే వాళ్ల‌కు కామ‌న్ సెన్స్ ఉండద‌నేది తెలుగుదేశం పార్టీ భావ‌న కావొచ్చు. న‌ర్సీప‌ట్నంలో అయ్య‌న్న పాత్రుడు మ‌నుషుల‌ను బెదిరించార‌నే అనుకుందాం. అక్క‌డ వైసీపీనేత‌ల్లేరా? క‌్యాడ‌ర్ లేరా? న‌ర్సీప‌ట్నంలో అయ్య‌న్న‌ను గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఓడించింది స్థానికుడే క‌దా. మ‌రి ఇప్పుడు బెదిరించ‌డానికి మాత్రం క‌డ‌ప నుంచి జ‌నాలు వ‌చ్చారా? తెలుగుదేశం పార్టీ ప‌త‌నావ‌స్థ‌లోకి కూరుకుపోతున్నా.. ఆ పార్టీ నేత‌ల అనుచిత‌ మాట‌లు, అహంభావ‌పు ప్ర‌క‌ట‌న‌లు మాత్రం ఇంకా త‌గ్గ‌డం లేదు. దీనికి ఆ పార్టీ మ‌రింత చిత్తు కావాల్సి వ‌స్తుందేమో!
Tags:    

Similar News