బద్వేల్ లో టీడీపీ షాకింగ్ డెసిషన్... ?

Update: 2021-10-21 12:30 GMT
బద్వేల్ లో మరో ఉప ఎన్నికకు గట్టిగా పది రోజులు కూడా టైమ్ లేదు. ఈ నెల ముప్పయిన ఎన్నిక జరుగుతుంది. ఇప్పటికే అక్కడ ఫలితం ఏంటో తేలిపోయింది. తెలంగాణాలోని హుజూరాబాద్ ఉప ఎన్నిక లాంటి ఉత్కంఠ అయితే బద్వేల్ అసలు లేదు అని చెప్పవచ్చు. ఇక బద్వేల్ ఉప ఎన్నిక వేళ ఏపీ పొలిటికల్ గా బాగా వేడెక్కింది. జగన్ మీద టీడీపీ వ్యక్తిగత‌ విమర్శలు చేయడం, దానికి ప్రతిగా వైసీపీ టీడీపీ ఆఫీసులపైన దాడులు చేయడం, ఆ మీదట అటూ ఇటూ దీక్షలతో ఏపీ బాగా హీట్ మీద ఉంది. మరి ఈ పరిణామాలు బద్వేల్ లో ఏమైనా ప్రభావం చూపుతాయా అన్న చర్చ కూడా ఉంది. బద్వేల్ లో ఈ టైమ్ లో టీడీపీ కనుక పోటీలో ఉంటే ఫలితం మీద బాగా ఇంటెరెస్ట్ ఉండేది. కానీ టీడీపీ పోటీ నుంచి తప్పుకుంది. అక్కడ బీజేపీ, కాంగ్రెస్ మాత్రమే బరిలో ఉన్నాయి. ఈ రెండూ జాతీయ పార్టీలు అయినా బద్వేల్ పోరులో మాత్రం పెద్దగా ప్రభావం చూపించలేవు అంటున్నారు. మరో వైపు చూసుకుంటే ఈ ఎన్నికల్లో ఎంతో కొంత పరువు నిలుపుకోవడానికి రెండు పార్టీలు చూస్తున్నాయి అన్నది వాస్తవం.

కాంగ్రెస్ కి ఒకపుడు సాలిడ్ గా ఓట్లు ఉండేవి. ఇపుడు అవన్నీ వైసీపీకే ఏనాడో షిఫ్ట్ అయ్యాయి. దాంతో కాంగ్రెస్ బీజేపీ కంటే ఎక్కువ ఓట్లు తెచ్చుకుంటే చాలు తాను నెగ్గినట్లే అని భావిస్తోంది. మరో వైపు వచ్చే ఎన్నికల్లో తన మాట గెలవాలన్నా, పొత్తుల ఎత్తులలో కొంత పై చేయి సాధించాలి అన్నా బీజేపీకి బద్వేల్ ఎన్నికలలో ఓటింగ్ చాలా ముఖ్యం. అందుకోసం టీడీపీని ఇండైరెక్ట్ సాయం కోరుతోంది అంటున్నారు. సరిగ్గా ఇపుడు టీడీపీ కూడా కేంద్ర సాయం అంటోంది. కేంద్ర బలగాలు కావాలని, ఏపీలో రాష్ట్రపతిపాలన పెట్టాలని కూడా డిమాండ్ చేస్తోంది. నేడో రేపో చంద్రబాబు ఢిల్లీ వెళ్లి కేంద్ర హోం మంత్రి అమిత్ షాని కలవాలని చూస్తున్నట్లుగా ప్రచారం అయితే ఉంది.

ఇవన్నీ చూసినపుడు బద్వేల్ లో వైసీపీ ని బాగా తగ్గించేందుకు బీజేపీకి అవుట్ రేట్ గా టీడీపీ సపోర్ట్ ఇస్తుందా అన్న చర్చ కూడా ఉంది. బీజేపీలో ఉన్న ఒకప్పటి తమ్ముళ్ళు అయిన మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎంపీ సీఎం రమేష్ వంటి వారు కూడా ఇప్పటికే టీడీపీ నేతలతో టచ్ లో ఉన్నారు. నిన్నటివరకూ టీడీపీ కాస్తా బెట్టునకు పోయినా ఇపుడు టీడీపీకి బీజేపీ అవసరం అర్జంటుగా వచ్చి పడుతోంది. కేంద్రం నుంచి ఎంతో కొంత మాట సాయం అయినా తీసుకోకపోతే ఏపీలో టీడీపీ శ్రేణుల మనోధైర్యం దెబ్బ తింటుంది. దాంతో క్లిష్టమైన ఈ పరిస్థితుల్లో బీజేపీ కి లోపాయికారీగా టీడీపీ మద్దతు ఇచ్చే చాన్స్ అయితే ఉందని ప్రచారం సాగుతోంది. అదే కనుక నిజమైతే కమలం పంట పండినట్లే. కనీసం డిపాజిట్ తెచ్చుకున్నా బీజేపీ వచ్చే ఎన్నికల వేళ సీట్ల బేరాలు, రాయబేరాలతో బాగా చెలరేగిపోయే అవకాశాలు అయితే గట్టిగా ఉన్నాయి మరి.


Tags:    

Similar News