తెలుగుదేశం పార్టీ ఇపుడు కసితో రగులుతోంది. ఒకసారి ఓడితే అది జగన్ సీఎం అయితే ఇన్ని కష్టాలు వస్తాయని కలలో కూడా ఊహించి ఉండదు. ఎందుకంటే టీడీపీకి విపక్షం కొత్త కాదు, కానీ జగన్ ఏలుబడిలో విపక్ష పాత్ర అయితే చాలా చాలా కొత్త. దానికి పరిహారం ఆ పార్టీ మూడేళ్ళుగా అనుభవిస్తోంది. ఎక్కడికక్కడ క్యాడర్ తో పాటు టీడీపీ లీడర్స్ ని అరెస్ట్ చేస్తూ మూడేళ్ళుగా పసుపు పార్టీ కంటి మీద కునుకు లేకుండా చేస్తూ వైసీపీ చెలరేగిపోతోంది.
దానికి జగన్ సర్కార్ ని ఇంటికి పంపించి అధికారంలోకి రావడమే టీడీపీ పెట్టుకున్న అతి భారీ లక్ష్యం. సరే ఇది వ్యక్తిగతం కాదు, ఫక్తు రాజకీయం మాత్రమే. అధికారం కోసం ఏ ప్రాంతీయ పార్టీ అయినా ఎదురుచూస్తుంది. టీడీపీకి అయితే ఆ అవసరం చాలా ఎక్కువగా ఉంది. ఈసారి అధికారంలోకి రావడం కచ్చితంగా జరగాలి.
ఆ పనిలో టీడీపీ ఉంది. దానికి తెర వెనక కసరత్తు చాలానే జరుగుతోంది. ఈ విషయాన ఎంతలా తగ్గాలో అంతలా తగ్గి అయినా టీడీపీ జెండాను ఎగరేయాలని ఆ పార్టీ ఆలోచిస్తోంది. ఇవన్నీ పక్కన పెడితే ఇపుడు టీడీపీకి ఆ గెలుపును కూడా మించిన ఒక బలమైన బరువైన టార్గెట్ ఒకటి ఉందిట. టీడీపీ ఏపీలో ఏకమొత్తాన గెలిచినా రాని ఆనందం ఒక విషయంలో కలుగుతుందిట.
ఆ ఒక్కటి ఏంటి అంటే గుడివాడ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలి నానికి చిత్తుగా ఓడించడం. నాని ఇంతలా టీడీపీ పాలిట ప్రబల
శత్రువులా మారిపోయారు. ఆయన ఎందుకో చంద్రబాబు లోకేష్ లను పూచిక పుల్ల కంటే దారుణంగా చూస్తూ హాట్ హాట్ కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి నాని 2014లో వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ తొలి అయిదేళ్ళూ లేని దూకుడు ఈ వ్యక్తిగత విమర్శలు మూడేళ్లలో ఎక్కువ అయిపోయాయి.
అందులో ఆయన మంత్రి కాగానే చంద్రబాబుని టార్గెట్ చేశారు. ఇక మంత్రి పదవి ఊడింది ఆయన తగ్గుతారని టీడీపీ వారు భావించినా కూడా తగ్గేదే లే అంటూ కొడాలి నాని జోరు పెంచేస్తున్నారు. లేటెస్ట్ గా ఆయన చంద్రబాబు మీద లోకేష్ మీద చేసిన కొన్ని అనుచిత వ్యాఖ్యలు మంట పుట్టించాయి. అప్పట్లో వల్లభనేని వంశీ ఏ రకంగా కామెంట్స్ చేశారో వాటికి మద్దతుగా అన్నట్లుగా కొడాలి నాని మరోసారి అవే కామెంట్స్ ని రిపీట్ చేశారు.
చంద్రబాబు లోకేష్ లను ఏమీ కాకుండా మాటలు అనేస్తున్న కొడాలి నానిని ఈసారి ఎలాగైనా ఓడించాలని టీడీపీ గట్టి టార్గెట్ నే పెట్టుకుంది. ఈ విషయంలో ఏం చేయాలి అన్నదే ఇపుడు టీడీపీలో అంతర్మధనంగా ఉంది. గుడివాడలో కొడాలికి పోటీగా మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు ఉన్నారు. కానీ ఆయన అయితే ఏ కోశానా సరిపోరు అని టీడీపీ భావిస్తోంది.
గట్టి పిండాన్నే దించాలని ఆలోచిస్తొందిట. మరో వైపు నందమూరి ఫ్యామిలీ మెంబర్స్ ని అయినా దించాలని అనుకుంటోందిట. ఇక లోకేష్ బాబు అయితే ఎలా ఉంటుంది అన్న ఆలోచన కూడా గుడివాడ టీడీపీ తమ్ముళ్ళు చేస్తున్నారు అని తెలుస్తోంది. లోకేష్ అయితే కమ్మ సామాజికవర్గం నాని నుంచి ఇటు వైపు టర్న్ అవుతారని అంటున్నారు.
అలాగే జనసేన తో పొత్తు ఉంటే పెద్ద సంఖ్యలో ఉన్న కాపులు కూడా ఈ వైపుగా వస్తారు అని అంటున్నారు. మొత్తానికి కొడాలి నాని టీడీపీకి అతి పెద్ద శత్రువుగా కనిపిస్తున్నారు. ఆయన్ని ఓడించి మాజీ ఎమ్మెల్యే చేస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుంది అని ఏపీ వ్యాప్తంగా ఉన్న టీడీపీ క్యాడర్ అంటోంది. హై కమాండ్ ఆలోచనలు అలాగే ఉన్నాయిట. సో జగన్ టార్గెట్ కంటే కొడాలి వైపే గురి ఎక్కువ అయిపోయిది మరి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.