టీడీపీ వ‌ర్సెస్ వైసీపీ.. ఏది త‌ప్పు.. ఎవరిది ఒప్పు?

Update: 2021-10-20 14:30 GMT
టీడీపీ వ‌ర్సెస్ వైసీపీ. సాధార‌ణంగా అధికారంలో ఉన్న పార్టీపై.. ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌వారు.. విమ‌ర్శించ‌డం.. త‌ప్పుబ‌ట్ట‌డం.. ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌పై విరుచుకుప‌డ‌డం స‌ర్వ‌సాధార‌ణం. అస‌లు అలా చేయ‌క‌పోతే.. ప్ర‌తిప క్షం అన్న మాట‌కే అవ‌కాశం లేదు. అయితే.. దీనికి కూడా కొన్ని హ‌ద్దులు ఉంటాయి క‌దా! ఇదే.. ఇప్పుడు టీడీపీ మ‌రిచిపోయింద‌నే వాద‌న వినిపిస్తోంది. అదేస‌మ‌యంలో రాజ‌కీయంగా చేసే వ్యాఖ్య‌ల‌ను రాజ‌కీయంగానే ఎదురొడ్డాలి త‌ప్ప‌.. క‌న్నుకు క‌న్ను.. ప‌న్నుకు ప‌న్ను.. అనే సంస్కృతిని పాటిస్తూ.. పోతే.. ఇక ప్ర‌స్వామ్యానికి విలువ ఏముంటుంది? అనేది వైసీపీ నేత‌ల‌ను ఉద్దేశించి.. వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

ఖ‌చ్చితంగా నెల కింద‌ట సెప్టెంబ‌రు 16న.. ఇప్పుడు అక్టోబ‌రు 19న రాష్ట్రంలో జ‌రిగిన రెండు ఘ‌ట‌న‌ల‌కు హేతువు లేదు! ఆశ్చ‌ర్యంగా అనిపించినా.. ఇది నిజం. వైసీపీ నేత‌లను. లేదా ముఖ్య‌మంత్రిని విమ‌ర్శించేం దుకు ఈ రెండు సంఘ‌ట‌న‌ల్లో..వేదిక‌లు ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. అంటే స‌మ‌యం, సంద‌ర్భం ఎక్క‌డా గోచ‌రించ‌డం లేదు. అయిన‌ప్ప‌టికీ.. టీడీపీ నాయ‌కులు చేసిన వ్యాఖ్య‌లు.. రాష్ట్రాన్ని అల‌జ‌డి దిశ‌గా ప‌య నింప‌జేశాయ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. నాటి ఘ‌ట‌న‌లో కోడెల శివ‌ప్ర‌సాద‌రావు వర్థంతిని పుర‌స్క‌రించిన నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో మాజీ మంత్రి అయ్య‌న్న పాత్రుడు నోరు పారేసుకున్నారు.

నేరుగా ముఖ్య‌మంత్రిపై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ద‌రిమిలా.. ఈ విష‌యంలో చంద్ర‌బాబు క్ష‌మాప‌ణ‌లు చెప్పాలంటూ.. పెడ‌న ఎమ్మెల్యే జోగి ర‌మేష్‌.. ఆయ‌న ఇంటిపైకి వెళ్ల‌డం.. హ‌ల్‌చ‌ల్ చేయ‌డం.. వంటివి రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం సృష్టించాయి. ప‌ర‌స్ప‌ర పార్టీ నేత‌లు కేసులు పెట్టుకోవ‌డం.. పోలీసుల‌ను కార్న‌ర్ చేయ‌డం ఇప్ప‌టి వ‌ర‌కు ఈ విష‌యం ఏం జ‌రిగిందో.. ఎలాంటి చ‌ర్య‌లు తీసుకున్నారో.. అనే విష‌యం తేల‌లేదు. నిజానికి వ‌ర్ధంతి స‌భ‌లో జ‌జ‌గ‌న్‌ను దూషించాల్సిన అవ‌స‌రం లేదు. హోం మంత్రి సుచ‌రిత‌పై నోరు పారేసుకోవాల్సిన అవ‌స‌రం క‌నిపించ‌దు. కానీ.. అయ్య‌న్న వంటి సీనియ‌రే క‌ట్టు త‌ప్పారు!

ఇక‌, అప్ప‌ట్లోనే చంద్ర‌బాబు స‌మ‌యం.. సంద‌ర్భం లేని ఇలాంటి వ్యాఖ్య‌లను అదుపు చేసి ఉంటే.. సీనియ‌ర్ల‌యినా.. జూనియ‌ర్ల‌యినా.. క‌ట్టుత‌ప్ప‌రాద‌నే సంకేతాలు గ‌ట్టిగా పంపి ఉంటే.. మంగ‌ళ‌వారం నాటి ఘ‌ట‌న జ‌రిగి ఉండేది కాదు. ఇక‌, మంగ‌ళ‌వారం జ‌రిగిన ఘ‌ట‌న కూడా.. సంద‌ర్భం లేనిద‌నే వాద‌న ఉంది. విశాఖ‌లో గంజాయి స్మ‌గ్లర్ల‌ను ఏరివేసే క్ర‌మంలో తెలంగాణ పోలీసులు అక్క‌డ‌కు వెళ్లడం.. అక్క‌డ గిరిజ‌నులు వారిని ప్ర‌తిఘ‌టించ‌డం.. ఈ క్ర‌మంలో కాల్పులు జ‌ర‌గ‌డం.. తెలిసిందే. అయితే..దీనిపై టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి.. న‌క్కా ఆనంద‌బాబు.. వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. స‌రే.. రాజ‌కీయంగా ఇవి కామ‌న్ అనుకుందాం.

ఇక‌, గంజాయిపై కేంద్రం నుంచి రాష్ట్రాల వ‌ర‌కు ఉక్కుపాదం మోపుతున్న స‌మ‌యంలో ఏ చిన్న క్లూ ఉన్నా.. త‌మ‌కు ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని భావిస్తున్న పోలీసులు.. న‌క్కా ఆనంద‌బాబు చేసిన వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో ఆయ‌న‌కు నోటీసులు ఇచ్చేందుకు గుంటూరుకు వ‌చ్చారు. ఈ ప‌రిణామం.. స‌ర్వ‌సాధార‌ణం. నోటీసులు ఇచ్చినంత మాత్రాన ఆయ‌న గంజాయిలో నిందితుడు కాదుక‌దా?! అయితే.. ఇదే విష‌యంపై మీడియా స‌మావేశం పెట్టిన పార్టీ అధికార ప్ర‌తినిధి.. ప‌ట్టాభి.. రెచ్చిపోయారో.. లేక .. ఫ్లోలో అన్నారో.. తెలియ‌దు కానీ.. వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు.

ద‌రిమిలా.. వైసీపీ నాయ‌కులు రెచ్చిపోయారు. టీడీపీ కార్యాల‌యంపై దాడి చేశారు. స‌రే.. ప‌ట్టాభి.. ఆ కార్యాల‌యంలో కూర్చుని.. వ్యాఖ్యానించాడు క‌నుక‌.. అక్క‌డితో పోవాల్సిన ర‌గ‌డ‌ను..(అది కూడా త‌ప్పే అంటారు ప్ర‌జాస్వామ్య వాదులు) రాష్ట్రం మొత్తానికి పాకించారు. ప‌లు జిల్లాలో టీడీపీ కార్యాల‌యాల‌పై దాడుల‌కు య‌త్నించారు. ఈ మొత్తం ఎపిసోడ్‌లో క‌ట్టుత‌ప్పిన త‌మ్ముళ్ల‌ను స‌రిదిద్దుకోలేక పోయిన‌.. చంద్ర‌బాబుది.. రాజ‌కీయంగా చేసిన విమ‌ర్శ‌ల‌ను రాజ‌కీయంగా నే చూడాల్సిన అధికార పార్టీ నాయ‌కుల‌ది కూడా త‌ప్పు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఎన్నిక‌ల‌కు మ‌రో రెండున్న‌రేళ్ల స‌మ‌యంలో ఉంద‌న‌గా.. ప్ర‌జాస్వామ్యంలో ఈ రెండు పార్టీలు ప్ర‌వ‌ర్తిస్తున్న తీరు.. న‌గుబాటుగానే ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇప్ప‌టికైనా ప‌ద్ధ‌తిమార్చుకోవాల్సిన అవ‌స‌రం రెండు పార్టీల‌పైనా ఉంద‌ని చెబుతున్నారు.




Tags:    

Similar News