నితీశ్ కు ఇంతకంటే అవమానం ఏముంటుంది?

Update: 2016-08-18 14:26 GMT
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. మచ్చ లేని రాజకీయ నేతగా.. అవినీతికి దూరంగా ఉంటూ.. తన పాలనలో బీహార్ రూపురేఖలు మార్చిన ముఖ్యమంత్రిగా నితీశ్ కు ఉన్న పేరు ప్రఖ్యాతులు తక్కువేం కాదు. ఆరాచకాలకు కేరాఫ్ అడ్రస్ గా బీహార్ ఉంటుందన్న ఇమేజ్ నితీశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచే తొలగటాన్ని మర్చిపోలేం.

ఈ మధ్య జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్ అభివృద్ధి మంత్రంతో పాటు.. లాలూ ప్రసాద్ తో చేసుకున్న వ్యూహ్మాత్మక మైత్రి పుణ్యమా అని బంపర్ మెజార్టీని సొంతం చేసుకొని ప్రభుత్వాన్నిఏర్పాటు చేయటం తెలిసిందే. మిత్రధర్మంలో భాగంగా ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వీయాదవ్ కు ఉప ముఖ్యమంత్రి పదవిని ఇచ్చేందుకు నితీశ్ ఓకే అన్నారు.

సమర్థుడైన ముఖ్యమంత్రి పాలనలో రాష్ట్రం ఉన్న వేళ.. తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైన తేజస్వీ యాదవ్ ను బీహార్ కు కాబోయే ముఖ్యమంత్రిగా ఆర్జేడీ నేతలు బహిరంగంగా పొగిడేస్తున్న ఘటన తాజాగా చోటు చేసుకుంది. కేవలం తండ్రి పేరు ప్రఖ్యాతులతో ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలిసారే ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తేజస్వీని బీహార్ కు కాబోయే ముఖ్యమంత్రిగా అభివర్ణించటం నితీశ్ ను అవమానించటమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

సమర్థుడైన నేత చేతుల్లో రాష్ట్ర పగ్గాలు ఉన్నప్పటికీ ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోనట్లుగా వ్యవహరిస్తున్న ఆర్జేడీ నేతలు తమ యువనేతను ముఖ్యమంత్రిగా చేసేందుకు తాము ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేయటం ప్రారంభించామని పేర్కొంటున్నారు. బీహార్ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రిగా ఆర్జేడీ నేతలు అభివర్ణిస్తూ చేస్తున్న వ్యాఖ్యలపై జనతాదళ్ నేతలు.. కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తేజస్వీ యాదవ్ భవిష్యత్ లో ముఖ్యమంత్రి అవుతారో లేదో తర్వాత.. తాజా పొగడ్తలు అతగాడి రాజకీయ అపరిపక్వతకు నిదర్శనమని రాజకీయ విమర్శకులు విమర్శిస్తున్నారు. ఎప్పుడో వచ్చే ముఖ్యమంత్రి పదవి ముచ్చట తర్వాత ముందు తనకు లభించిన ఉప ముఖ్యమంత్రి పదవిని సమర్థంగా నిర్వహిస్తే బాగుంటుంది.
Tags:    

Similar News