కాంగ్రెస్ లోకి పీకే వెళ్లకుండా అడ్డుకున్నది కేసీఆరా?

Update: 2022-06-13 13:30 GMT
విజయం అందించే కిక్కు మామూలుగా ఉండదు. అదిచ్చే నిబ్బరం.. ధైర్యం.. మరిన్ని ప్రయోగాలు చేసేందుకు అవకాశం ఇస్తుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అదే తీరులో వ్యవహరిస్తున్నారు. దశాబ్దాల తెలంగాణ కలను సాకారం చేసేలా కేంద్రాన్ని కదిలించి.. తన డిమాండ్లకు తగ్గట్లు తెలంగాణను తెచ్చుకోవటమే కాదు.. ఆ క్రమంలో ఎవరికి ఎలాంటి ప్రయోజనం కలగకుండా.. మొత్తంగా తానే మైలేజీ సొంతం చేసుకునేలా ప్లాన్ చేసిన కేసీఆర్ తెలివి అర్థమయ్యేసరికి ఆయన చేతిలో అధికారం ఉన్న పరిస్థితి. అప్పటి నుంచి ఇప్పటివరకు పట్టిందల్లా బంగారమన్నట్లుగా ఆయన పరిస్థితి ఉంది.

ప్రశ్నించే మీడియాను.. నిలదీసే ఉద్యమ నేతల్ని తన దారికి తెచ్చుకోకున్నా.. తనకు అడ్డుపడకుండా ఉండేలా చేసుకోవటంలో ఆయన విజయం సాధించారనే చెప్పాలి. తెలంగాణ సాధన అనంతరం బంగారు తెలంగాణ కలను తెర మీదకు తీసుకొచ్చి.. అవసరానికి అనుగుణంగా సెంటిమెంట్ అస్త్రాన్ని సిద్ధం చేసుకున్న ఆయన.. తెలంగాణ ప్రజల్ని ప్రభావితం చేయటంలో తిరుగులేని రీతిలో వ్యవహరిస్తున్నారనే చెప్పాలి. అందుకే ఆయన చూపు ఇప్పుడు జాతీయ రాజకీయాల మీద పడింది.

కొండకు వెంట్రుక వేస్తే.. వస్తే కొండ.. లేదంటే పోయేది వెంట్రుకే. బీజేపీ.. కాంగ్రెస్ లతో కాని పని తనతో అవుతుందని నమ్మే ఆయన.. అందుకు తగ్గ ప్లానింగ్ షురూ చేశారు. దీనికి సంబంధించిన టీం కోసం ప్రయత్నాలు చేస్తున్న కేసీఆర్ ఇప్పటికే పీకే (ప్రశాంత్ కిశోర్)ను తన జట్టులో చేర్చుకున్నారు. అక్కడితో ఆగని ఆయన.. తనకు అలవాటైన రీతిలో ఆట ఆడి.. కాంగ్రెస్ కు భారీ షాకిచ్చారు. ప్రశాంత్ కిశోర్ తో రాజకీయ వ్యూహకర్త డీల్ చేసుకున్న కేసీఆర్.. పనిలో పనిగా ఆయన్ను ప్రభావితం చేసినట్లు చెబుతారు.

ఆ మధ్యన కాంగ్రెస్ లో చేరేందుకు మక్కువ చూపిన ఆయన.. దేశ ప్రధానమంత్రి పదవిలో రాహుల్ ఉండేలా చేయటమే తన కర్తవ్యమన్న మాటలు చెప్పిన పీకే.. కేసీఆర్ తో కలిసిన తర్వాత తన మాటను మార్చేయటమే కాదు.. కాంగ్రెస్ లో చేరాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవటంలోనూ గులాబీ బాస్ కీ రోల్ ప్లే చేశారని చెబుతారు. కాంగ్రెస్ లో చేరేందుకు పీకే రంగం సిద్ధం చేసుకున్న వేళ.. ఆ నిర్ణయాన్ని తప్పన్న విషయాన్ని పీకేకు అర్థమయ్యేలా చెప్పటమే కాదు.. ఆయన్ను ఒప్పించటంలోనూ కేసీఆర్ కీ రోల్ ప్లే చేశారని చెబుతారు.

ఆ మధ్యన సీఎం కేసీఆర్ అధికారిక నివాసమైన ప్రగతి భవన్ లో పీకే రెండు రోజుల పాటు స్టే చేయటం తెలిసిందే. ఆ సందర్భంగా గంటల తరబడి మేధో మథనం చేసి.. కాంగ్రెస్.. బీజేపీ కాకుండా మూడో పక్షాన్ని ఏర్పాటు చేయాలన్న విషయాన్ని చెప్పిన కేసీఆర్.. అందుకు తగ్గట్లే తన ఆలోచనల్ని పీకేతో పంచుకున్నట్లు చెబుతారు.

గులాబీ బాస్ వాదనకు ఓకే చెప్పిన పీకే.. కాంగ్రెస్ లోకి వెళ్లకుండా ఉండాలన్న నిర్ణయాన్ని తీసుకోవటమే కాదు.. ఆ విషయాన్ని అధికారిక ప్రకటన ఇచ్చేయటం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా కాంగ్రెస్ కు ఒక జెల్లకాయ ఇచ్చిన కేసీఆర్.. పీకే రూపంలో మరోసారి భారీ షాకిచ్చారన్న మాట బలంగా వినిపిస్తోంది. ఇలా దెబ్బ మీద దెబ్బ వేస్తున్న గులాబీ బాస్ కు కాంగ్రెస్ ఎప్పటికి సరైన సమాధానం చెప్పటం ఖాయమంటున్నారు. అదెప్పటికి జరుగుతుందో చూడాలి.
Tags:    

Similar News