ఏపీ, టీ కాంగ్రెస్ మధ్య అమరావతి చిచ్చు

Update: 2015-10-18 07:30 GMT
ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్లు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపన పోయిపోయి తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య చిచ్చు పెట్టింది. ఈ కార్యక్రమానికి వెళ్లే విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కాంగ్రెసు పార్టీల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. ఒకవైపు ఏపీలో టీడీపీ ప్రభుత్వానికి, రాజధాని భూసమీకరణకు వ్యతిరేకంగా పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి నేతృత్వంలోని కొందరు కాంగ్రెస్ నేతలు పోరాటం చేస్తుంటే మరోవైపు టీ కాంగ్రెస్ మాత్రం ఈ కార్యక్రమానికి రావడానికి ఉవ్విళ్లూరుతోంది... అంతేకాదు చంద్రబాబు సూపర్ అంటూ వారు ప్రశంసలు కురిపిస్తున్నారు. దీంతో రఘువీరారెడ్డికి మొఖం ఎక్కడ పెట్టుకోవాలో తెలియడం లేదట. దీంతో ఆయన టీ కాంగ్రెస్ పెద్దలతో 'మీరు చేస్తున్నదేమీ బాగులేదు' అని అసంతృప్తి వ్యక్తంచేసినట్లు సమాచారం.

అమరావతి శంకుస్థాపనకు రావాలంటూ ఏపీ మంత్రులు తెలంగాణలోని అన్ని పార్టీల ముఖ్య నేతలను స్వయంగా కలిసి ఆహ్వానిస్తున్నారు. అందులో భాగంగానే టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి - టీ సీఎల్పీ లీడర్ జానారెడ్డిలనూ ఏపీ మంత్రులు కామినేని, చింతకాయల అయ్యన్నపాత్రుడు వెళ్లి ఆహ్వానించారు. దీంతో ఈ కార్యక్రమానికి వెళ్తే బాగుంటుందని తెలంగాణ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారట. మరోవైపు జానారెడ్డి కూడా చంద్రబాబు అద్భుతంగా పనిచేస్తున్నారని చెప్పడంతోపాటు ఏకంగా వెంటనే చంద్రబాబును అభినందిస్తూ లేఖ కూడా రాశారు. దీంతో ఏపీ పీసీసీ నేతలకు గొంతులో వెలక్కాయ పడినట్లయింది. తెలంగాణ కాంగ్రెస్ నేతలు అత్యుత్సాహం చూపిస్తుండడంతో ఏపీ నేతలు ఇబ్బంది పడుతున్నారట. తాము మాత్రం మోడీ తమకు అపాయింటుమెంటు ఇస్తేనే వస్తామని.. లేదంటే రామని రఘువీరారెడ్డి చెబుతున్నారు. మేం రాకుండా మీరు వస్తే తాము మాట పడతామని ఉత్తమ్ తో రఘువీరా అన్నట్లు సమాచారం.

కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నలుగురు కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్‌ మెంట్ అడిగినట్లు తెలుస్తోంది. అమరావతి శంకుస్థాపనకు వచ్చినప్పుడు కలవడానికి తమకు అవకాశం ఇవ్వాలని వారు ప్రధానిని కోరారు. అయితే, ఇప్పటి వరకు ఆ విషయం ఏదీ తేలలేదు. ప్రధాని ప్రతిస్పందన కోసం ఈ నెల 20వ తేదీ వరకు వేచి చూడాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్టీ నాయకత్వం భావిస్తోంది. ఆ తర్వాత తమ నిర్ణయాన్ని ప్రకటించాలని ఆలోచిస్తోంది. అయితే, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్టీ నాయకత్వం అమరావతి శంకుస్థాపనకు దూరంగా ఉంటే, తెలంగాణ కాంగ్రెసు నాయకులు కూడా హాజరు కాకపోచ్చునని అంటున్నారు. రెండు రాష్ట్రాల పార్టీలు భిన్న వైఖరులతో వ్యవహరిస్తే పార్టీకి నష్టం జరిగే ప్రమాదం ఉంటుందని భావిస్తున్నారు. దాంతో ఎపి పిసిసి నిర్ణయంపైనే తెలంగాణ కాంగ్రెసు నాయకులు అమరావతి శంకుస్థాపనకు హాజరయ్యే విషయం ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. దీంతో తెలంగాణ పీసీసీ నేతలు మాత్రం అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారట.. రాజకీయాలు ఎలా ఉన్నా కొత్త రాష్ట్రానికి సంబంధించిన ఒక మంచి కార్యక్రమానికి హాజరైతే తప్పేంటన్న భావనలో వారు ఉన్నారని తెలుస్తోంది. ఈ రోజు ఏపీ కాంగ్రెస్ నేతలు హాజరుకాకపోతే భవిష్యత్తులో అధికారంలోకొచ్చి అదే రాజధాని పనులు చేయాల్సినప్పుడు ప్రజలకు ఏం సమాధానం చెబుతారన్న ప్రశ్న లేవనెత్తుతున్నారు.

మొత్తానికి టీ కాంగ్రెస్ కు ఉన్న ఆలోచన ఏపీ కాంగ్రెస్ కు ఉన్నట్లుగా కనిపించడం లేదు.
Tags:    

Similar News