కేసీఆర్‌ కు మ‌మ‌త ఫోన్‌..ప‌చ్చి అబ‌ద్దం..బూట‌కం

Update: 2018-03-05 11:17 GMT
దేశ ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పు రావాల్సిన అవసరం ఉందని, ఈ క్రమంలో భావ సారూప్యత ఉన్న పార్టీలన్నింటినీ కూడగట్టేందుకు, అవసరమైతే జాతీయ స్థాయిలో నాయకత్వం వహించేందుకు సిద్ధమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు చేసిన ప్రకటనకు దేశం నలుమూలల నుంచి విశేష మద్దతు వెల్లువెత్తుతోంద‌ని అధికార టీఆర్ ఎస్ పార్టీ నేత‌లు - సానుభూతి ప‌రువు ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఇదంతా అబ‌ద్ద‌మ‌ని తెలంగాణ జేఏసీ పేర్కొంటోంది. ఇందుకు మీడియా క‌థ‌నాల‌ను నిద‌ర్శ‌నంగా తెలిపింది.

త‌న ఫేస్‌ బుక్ పేజీలో ఈ మేర‌కు తెలంగాణ జేఏసీ వివ‌ర‌ణ ఇచ్చింది. `మోసపు ప్రచారాలకు పరాకాష్ట...దేశమంతా మద్దతు...థర్డ్ ఫ్రంట్ ప్రకంపనలంటూ వస్తున్న వార్తలు...వాస్తవాలు...` అంటూ జేఏసీ నిప్పులు చెరిగింది. `థర్డ్ ఫ్రంట్ కు మద్దతుగా కేసీఆర్ కు దేశవ్యాప్తంగా ఫోన్లు...ముఖ్యంగా మమతా బెనర్జీ నుండి కేసీఆర్ కు ఫోన్ అంటూ కోట్లు గుమ్మరించి చేస్తున్న ప్రచారాలు ఎంత అబద్ధాలో జాతీయ పత్రిక "టెలిగ్రాఫ్"లో ప్రచురితమైన ఈ వార్త చూస్తే స్పష్టమవుతుంది` అంటూ టెలీగ్రాఫ్ క‌థ‌నాన్ని ఉద‌హ‌రించింది. `అసలు మమతాబేనర్జీకి ఫోన్ చేసింది కేసీఆరే...కానీ మమతాబేనర్జీనే ఫోన్ చేసి స్వయంగా మద్దతు ప్రకటించారని మోసపు ప్రచారాలు - బిల్డప్పులూ...కేసీఆర్ చెప్పిన ఏవిషయాన్నీ మమతాబెనర్జీ పూర్తిగా ఒప్పుకోలేదనే విషయం వార్త పూర్తిగా చదువుతే స్పష్టమవుతుంది... డబ్బులు గుమ్మరించి ఇలాంటి వార్తలు ఇంకా రాపించుకుంటూనే ఉంటారు...ఎల్లుండి అమెరికా అధ్యక్షుడు ట్రంపు - రష్యా అధ్యక్షుడు పుతినూ కూడా ఫోన్ చేశారని వార్తలొస్తే ఆశ్చర్యపోకండి...తెలంగాణలో ఈమాయమాటలు నమ్మి మోసపోడానికి ఒక్కళ్ళూ సిద్ధంగా లేరు`  అంటూ ప్ర‌క‌టించింది.

కాగా, గులాబీ ద‌ళ‌ప‌తి కొత్త అడుగుపై ఆదిలోనే జేఏసీ కౌంట‌ర్ వేయ‌డం ఆస‌క్తికరంగా మారింది. ఏకంగా జాతీయ ప‌త్రిక‌ల్లో వ‌చ్చిన క‌థ‌నాలను సైతం త‌న ఎదురుదాడికి ఆధారంగా చేసుకోవ‌డం చూస్తుంటే...కేసీఆర్ అడుగుల‌ను తెలంగాణ జేఏసీ చాలా క్షుణ్ణంగా అధ్య‌య‌నం చేస్తోంద‌ని ప‌లువురు అంటున్నారు. త్వ‌ర‌లో రాజకీయ అరంగేట్రం చేయ‌నున్న జేఏసీ చైర్మ‌న్ కోదండ‌రాం త‌న ఎంట్రీకి ముందే అధికార పార్టీకి త‌న స‌త్తా ఏంటో రుచిచూపిస్తున్నార‌ని వివ‌రిస్తున్నారు.
Tags:    

Similar News