కేసీఆర్ పై విపక్షాల జలగర్జన గాండ్రిపు

Update: 2016-08-02 05:05 GMT
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఒక్కడిగా ఎదుర్కోవటం సాధ్యం కాదన్న విషయాన్ని తెలంగాణ విపక్షాలు అర్థం చేసుకున్నట్లు కనిపిస్తున్నాయి. అంతా కలిసి కట్టుగా పోరాడితే తప్పించి.. ఆయన ఇమేజ్ ను డ్యామేజ్ చేయటం కుదరదన్న విషయంలో క్లారిటీ వచ్చినట్లుగా ఉంది. తాజాగా నిర్వహించిన జలగర్జన సందర్భంగా విపక్ష నేతలంతా కలిసికట్టుగా కేసీఆర్ పై దుమ్మెత్తిపోసిన తీరు ఆసక్తికరంగా మారింది. పేట – కొడంగల్ ఎత్తిపోతల పథకం సాధన కమిటీ నేతృత్వంలో 11 రోజుల పాటు చేపట్టిన పాదయాత్ర తాజాగా మహబూబ్ నగర్ లో  ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో విపక్ష నేతలు కలిసి కట్టుగా కేసీఆర్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఖరిని తీవ్రంగా తప్పు పట్టిన విపక్ష నేతలు పలు ఆసక్తికర అంశాల్ని తెర మీదకు తీసుకొచ్చారు.

లక్షలాది కోట్ల రూపాయిలతో కొత్త కొత్త ప్రాజెక్టులను ప్రకటిస్తున్న ముఖ్యమంత్రి వందల కోట్లు ఖర్చు చేస్తే.. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి అవుతాయని.. కానీ వాటి ఊసే కేసీఆర్ ఎత్తటం లేదని ఆరోపించారు. దీనికి ఉదాహరణగా మహబూబ్ నగర్ జిల్లా అంశాన్ని ప్రస్తావించారు. జిల్లాలో నాలుగు ప్రాజెక్టులు పూర్తి కావటానికి దగ్గరగా ఉన్నాయని.. కేవలం రూ.1250 కోట్లు కేటాయిస్తే ఈ నాలుగు ప్రాజెక్టులు పూర్తి అవుతాయని.. అయినా వీటి ఊసును కేసీఆర్ అస్సలు పట్టించుకోవటం లేదని మండిపడుతున్నారు.

రూ.1250 కోట్లు ఖర్చు చేస్తే నాలుగు ప్రాజెక్టులు పూర్తి అయ్యే అవకాశం ఉన్నా.. వాటికి కేవలం రూ.300 కోట్లు కేటాయించిన ముఖ్యమంత్రి వేలాది కోట్లు ఖర్చు చేసి పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల్ని నిర్మించటం ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారు. పాలమూరు ఎత్తిపోతలతో రైతులకు ఏ విధంగా న్యాయం చేస్తారని ప్రశ్నిస్తున్న వారు.. ప్రాజెక్టుల రూపకల్పన రైతుల కోసం చేస్తున్నారా? లేక కాంట్రాక్టర్లకు దోచి పెట్టేందుకు చేస్తున్నారా? అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ తీరును తీవ్రంగా తప్పు పట్టిన వారిలో కాంగ్రెస్ నేతలు జైపాల్ రెడ్డి.. డీకే అరుణ.. చిన్నారెడ్డి.. టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు రమణ.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్.. నాగం జనార్దన రెడ్డి.. సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో సహా పలువురు నేతలంతా ఒకే వేదిక మీద కేసీఆర్ సర్కారు తీరును తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

ఇక.. జల గర్జనకు పేరుకు తగ్గట్లే సభలో మాట్లాడిన పలువురు నేతలు కేసీఆర్ పై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ఫైర్ బ్రాండ్ నాగం మాట్లాడుతూ..కేసీఆర్ కారు చక్రాల గాలి తీసి దాన్ని తగలబెట్టకపోతే తన పేరు నాగం కాదన్న వ్యాఖ్య చేస్తే.. కేసీఆర్ పర్సంటేజీల కోసమే ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తూ వాటి అంచనా వ్యయాన్ని భారీగా పెంచేస్తున్నారంటూ డీకే అరుణ.. చిన్నారెడ్డి లాంటి వారు తీవ్ర ఆరోపణలు చేశారు. కేసీఆర్ పై విపక్ష నేతలంతా మూకుమ్మడిగా కలిసి పోరాడుతున్న వైనం చూస్తే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వారిని ఎంతలా ఇబ్బంది పెడుతున్నారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
Tags:    

Similar News